షర్మిల కొ్త్త పార్టీ వైఎస్ఆర్టీపీ!
తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించనుంది. ఈ రాష్ట్రంలో రాజన్నరాజ్యం మళ్లీ రావాల్సి ఉందని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల పేర్కొన్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆమె మంగళవారం స్వగృహం లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తొలుత షర్మిల నల్గొండకు చెందిన వైఎస్ అనుచరులైన నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో భేటీ అయ్యారు. ఈరోజు ఫిబ్రవరి 9 వైఎస్ఆర్, విజయమ్మల పెళ్లిరోజని శుభసూచకంగా ఈ ఆత్మీయ సమావేశాలకు శ్రీకారం చుట్టామన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నాయకులతో వరుసగా సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తను మాట్లాడ్డానికి రాలేదని వారు చెప్పేది వినడానికి వచ్చానన్నారు. స్థానికంగా గల సాధకబాధకాలు వినాలనుకుంటునట్లు చెప్పారు. ఈ రాష్ట్రానికి ఆనాటి వైఎస్ పాలన కావాలని తాము తీసుకువస్తామని షర్మిల తెలిపారు. ఆమె ప్రారంభించనున్న కొత్త పార్టీకి వైఎస్ఆర్టీపీగా నామకరణం చేసినట్లు తెలుస్తోంది. ఈసరికే ఎన్నికల సంఘం దగ్గర రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం. తెల్లనిరంగుపై మండే సూర్యుడి చిహ్నంతో జెండా కూడా ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. త్వరలో తెలంగాణ వ్యాప్తంగా ఆమె మళ్లీ పాదయాత్ర చేపట్లనున్నట్లు తెలుస్తోంది.