Saturday, November 21, 2020

Patient Watches BigBoss show and Avataar movie as Guntur doctors perform brain surgery

రోగి బిగ్ బాస్ షో

చూస్తుండగా బ్రెయిన్ సర్జరీ

గుంటూరు సర్వజనాసుపత్రి జీజీహెచ్ మరో రికార్డును సొంతం చేసుకుంది. మెదడులో కణితిని తొలగించే క్రమంలో రోగితో మాట్లాడుతూనే వైద్యులు శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.  పెదకూరపాడు మండలం పాటిబండ్లకు చెందిన వరప్రసాద్‌(33)కు మెదడులో కణితి (బ్రెయిన్‌ ట్యూమర్‌) వచ్చింది. అయితే ఆ కణితిని 2016లో హైదరాబాద్‌లో డాక్టర్లు శస్త్రచికిత్స నిర్వహించి తొలగించారు. ఆ తర్వాత రేడియేషన్ చికిత్స చేశారు. కానీ మళ్లీ వరప్రసాద్ కు ఫిట్స్ వస్తుండడంతో పరీక్షలు చేయగా మరో కణితి పెరిగినట్లు గుర్తించారు. డాక్టర్లు భవనం హనుమా శ్రీనివాసరెడ్డి, శేషాద్రి శేఖర్‌, త్రినాథ్‌ లు ఈ కేసును చాలెంజ్ గా తీసుకున్నారు. డాక్టర్లు మెదడు త్రీడీ మ్యాప్‌ను తయారు చేసుకుని.. నావిగేషన్‌ సాయంతో కణితి సరిగ్గా ఎక్కడ ఉందో గుర్తించారు. మెదడులో ఆ భాగం కీలకమైనది కావడంతో చాలా జాగ్రత్తగా సర్జరీ చేశారు. రోగి స్పృహలో ఉండగానే మెదడులో మార్పులు, పరిణామాలను గమనిస్తూ సర్జరీ చేశారు. అతడు మెలకువగా ఉండటం కోసం బిగ్‌బాస్ షో, అవతార్ సినిమా చూపించారు. రోగికి పైసా ఖర్చు లేకుండా బీమా సౌకర్యంతో సర్జరీ నిర్వహించారు. రోగి పూర్తిగా కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి శుక్రవారం డిశ్ఛార్జి చేశారు. ఇదే ఆసుపత్రిలో 2017 లోనూ ఈ తరహా శస్త్రచికిత్స నిర్వహించి వైద్యులు విజయం సాధించారు. విజయకుమారి అనే మహిళకు మెదడులో కణితి (కెవర్నోమా)ని ఆపరేషన్ చేసి తొలగించారు. ఆమెకు బాహుబలి-2 సినిమాను చూపిస్తూ అప్పట్లో ఈ శస్త్రచికిత్స చేశారు. గుంటూరు గవర్న్ మెంట్ హాస్పిటల్ న్యూరోసర్జరీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బీహెచ్ శ్రీనివాస్ రెడ్డి ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు.

Wednesday, November 18, 2020

Roja birthtday..takes blessings from CM YSJaganmohan Reddy

 రోజాకి జగన్ ఆశీస్సులు

నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజాకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులు అందజేశారు. రోజా బుధవారం తన పుట్టిన రోజు సందర్భంగా సీఎం ని కలిశారు. భర్త సెల్వమణితో కలసి అమరావతిలోని క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన రోజా జగన్‌ కు స్వీట్ బాక్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రోజాను ఆశీర్వదించి మిఠాయి తినిపించారు. అదే విధంగా రోజాకు జగన్ స్వీట్ బాక్స్ ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజున ఎవరైనా జగన్ వద్దకు వస్తే వారికి ఓ స్వీట్ బాక్స్ కానుకగా ఇవ్వడం ఆయనకు అలవాటు. అనంతరం రోజా ఈ సాయంత్రం తన కుటుంబసభ్యులతో కలిసి బర్త్ డే వేడుక ఘనంగా జరుపుకున్నారు.

Monday, November 16, 2020

Nitish Kumar takes oath as Bihar CM for fourth consecutive time

బిహార్ సీఎంగా నితీశ్ నాల్గోసారి 

బిహార్ ముఖ్యమంత్రిగా జెేడీ (యు) చీఫ్ నితీశ్ కుమార్  వరుసగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సమక్షంలో ఆయనతో పాటు ఎన్డీయే కూటమిలోని పార్టీల నాయకులు కూడా కేబినెట్ మంత్రులుగా పదవులు చేపట్టారు. డిప్యూటీ సీఎంలుగా తార్కిషోర్ ప్రసాద్, రేణు దేవి కూడా ప్రమాణ స్వీకారం చేశారు. హిందూస్థానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం) చీఫ్ జితాన్ రామ్ మంజి కుమారుడు సంతోష్ కుమార్ సుమన్, వికాషీల్ ఇన్సాన్ పార్టీ (వి.ఐ.పి) కు చెందిన ముఖేష్ సాహ్ని, జేడీ (యు) విజయ్ కుమార్ చౌదరి, విజయేంద్ర ప్రసాద్ యాదవ్, అశోక్ చౌదరి, మేవాలౌచౌదరి తదితరులు మంత్రులుగా పదవీ ప్రమాణం చేశారు. 2005 నుంచి గరిష్ఠ కాలం బిహార్‌ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పదవులు చేపట్టిన సుశీల్ కుమార్ మోడీ (బీజేపీ)కి కొత్త మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఆయనకు సెంట్రల్ బెర్త్ దక్కవచ్చని సమాచారం. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆర్జేడీ నాయకుడు తేజశ్వి యాదవ్ హాజరుకాలేదు. నితీశ్ ప్రమాణ స్వీకారాన్ని ఆర్జేడీ బహిష్కరించింది. 

Friday, November 13, 2020

Telangana High Court Bans Sale, Use Of Firecrackers Ahead Of Diwali

తెలంగాణలో బాణసంచా నిషేధం

తెలంగాణలో బాణసంచా కొనుగోళ్లు, అమ్మకాలపై నిషేధం విధించారు. రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఈమేరకు ఆదేశాలు  జారీ చేసింది.  బాణసంచా కాల్చడం వల్ల పెద్దఎత్తున వాయుకాలుష్యం ఏర్పడుతోంది. ప్రజలు శ్వాస కోశవ్యాధుల బారిన పడుతున్నారు. వీటి క్రయవిక్రయాలు నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఈమేరకు తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పుపై తెలంగాణ రాష్ట్ర క్రాకర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టుకు అప్పీలు చేసింది. ఇప్పటికే కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, హర్యానా, పశ్చిమబెంగాల్, సిక్కింల్లో బాణసంచాపై నిషేధం అమలులో ఉన్న సంగతి తెలిసిందే. కోవిడ్-19 మహమ్మారి కొనసాగుతున్న కారణంగా దీపావళికి ముందు రాష్ట్రంలో క్రాకర్ల అమ్మకం, వాడకాన్ని గౌరవ హైకోర్టు నిషేధించినట్లు సీనియర్ కౌన్సెల్ మాచార్ల రంగయ్య మీడియాకు తెలిపారు. కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే కొనుగోలు చేసిన వ్యక్తులు కూడా బాణసంచా కాల్చొద్దని హైకోర్టు సూచించిందన్నారు. ఈ మహమ్మారి ఇప్పటికే  చాలా మంది ప్రాణాలు బలిగొంది. సంక్రమణ ప్రధాన లక్షణంగా గల కరోనా ఊపిరితిత్తుల పైనే అధికప్రభావం చూపుతున్న దృష్ట్యా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పు ఇచ్చినట్లు వివరించారు. అంతేగాక ఈ మేరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సంబంధించి నవంబర్ 19న నివేదికను సమర్పించాలని  హైకోర్టు ఆదేశాలిచ్చింది.