అపర దాన కర్ణ.. ఫీని
§ రూ.58వేల
కోట్ల దానం
అపరదాన కర్ణుల జాబితాలోకి తాజాగా అమెరికా వ్యాపారవేత్త ఒకరు చేరారు.
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, బెర్క్ షైర్ హాథ్వే చైర్మన్
వారెన్ బఫెట్ సరసన స్థానం సంపాదించుకున్న ఈ అభినవ కర్ణుడి పేరు ఛార్ల్స్ చక్
ఫీనీ. విమానాశ్రయాల్లోని ‘డ్యూటీ ఫ్రీ షాపర్స్’ సహవ్యవస్థాపకుడు. రూ.58వేల కోట్లకు (7.5 బిలియన్ డాలర్లు) అధినేత. ఎంత సంపాదించామన్నది కాదు ఎంత దానం చేశామన్నదే
ముఖ్యమంటారీయన. సంతృప్తి అనేది డబ్బు సంపాదనలో కాక దాన్ని పదుగురికి
పంచడంలోనే ఉందనేది ఆయన ఫిలాసఫీ. దాతృత్వంలోనే ఆనందాన్ని వెతుక్కున్న ధీశాలి. బిల్ గేట్స్, బఫెట్ బాటలో.. కాదు..కాదు..
వారికే మార్గం చూపిన మహామనిషి.. స్ఫూర్తి ప్రదాత ఫీని. తన స్వచ్ఛంద సంస్థ ‘అట్లాంటిక్ ఫిలాంత్రోపీస్’ ద్వారా యావదాస్తిని
దానం చేశారు. ఫీని తన ఆస్తిని విద్య, సాంకేతికరంగం, ఆరోగ్యం, మానవ హక్కుల రక్షణ కోసం అమెరికా, ఆస్ట్రేలియా, వియత్నాం, బెర్ముడా,
దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ ల్లో వివిధ స్వచ్ఛంద సంస్థలకు అందజేయడం ద్వారా ఖర్చు
చేశారు. ఈ మేరకు 2012లో ప్రకటించిన ఫీనీ, ఆ మాటను ఇప్పుడు నిలుపుకున్నారు. పదవీ విరమణ చేశాక కేవలం రూ.14కోట్లనే ఉంచుకుని తన భార్యతో కలిసి జీవిస్తున్నారు. ఓ సాధారణమైన
జీవితాన్ని గడుపుతున్నారు. శానిఫ్రాన్సిస్కోలోని ఓ మామూలు అపార్ట్ మెంట్ ప్రస్తుతం
ఈ దంపతుల ఆవాసం. దాదాపు రూ.58 వేల కోట్ల మొత్తాన్ని వివిధ
స్వచ్ఛంద సంస్థలకు దానమిచ్చేశారు. దాంతో ఈ నెల 14న ఫీనీ
స్వచ్ఛంద సంస్థ ప్రయాణం ముగిసింది. 1997లో ఆయన అట్లాంటిక్
ఫిలాంత్రోపీస్ ను ప్రారంభించారు. `జీవిత పరమార్థం గురించి
చాలా నేర్చుకున్నా.. చాలా సంతోషంగా ఉంది.. నేను బతికుండగానే ఈ మంచి పని పూర్తి
కావడం నాకు బాగా అనిపిస్తోంది` అని ఫీని ఫోర్బ్స్ పత్రికతో
వ్యాఖ్యానించారు. బిల్ గేట్స్, వారెన్ బఫెట్ ఇద్దరూ తమ
దాతృత్వాన్ని చాటుకోవడం గురించి చెబుతూ మేము సంపాదించిన అపార సంపదను దానం
చేసేందుకు ఫీని మాకు ఓ దారిని ఏర్పరిచాడన్నారు. `మన ఆస్తిలో
సగం కాదు, యావదాస్తిని దానం చేయాలి`.. అంటూ
ఫీని నాతో పాటు ఎంతోమందిలో స్ఫూర్తిని నింపాడని బిల్ గేట్స్ పేర్కొన్నారు.