బీటెక్ విద్యార్థిని బలిగొన్న పబ్జీ గేమ్
ఎంతో భవిత ఉన్న ఓ బీటెక్ విద్యార్థి ఆన్ లైన్ గేమ్ కు బానిసై బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఇది. అనంతపురం రెవెన్యూ కాలనీలో నివాసముంటున్న నరసింహారెడ్డి పెద్ద కుమారుడు కిరణ్‌కుమార్‌రెడ్డి (23) గత కొంతకాలంగా పబ్జీ గేమ్ కు బానిసయ్యాడు. చెన్నైలో అతను బీటెక్ చదువుతున్నాడు. అక్కడ ఉండగానే ఈ పబ్జీ గేమ్ ఆడ్డానికి అలవాటు పడ్డాడు. లాక్ డౌన్ నేపథ్యంలో అనంత స్వగృహానికి చేరుకుని గత అయిదు నెలలుగా కుటుంబసభ్యులతోనే ఉంటున్నాడు. చైనాతో పరిణామాల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఈ పబ్జీ గేమ్ నూ నిషేధించింది. పబ్‌జీ సహా 118 చైనా యాప్‌లపై భారత సర్కారు వేటు వేసింది. ఈ ఆట కు బానిసైన కిరణ్ గత కొద్ది రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు తెలిసింది. మూడు రోజుల క్రితం అతను కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు మూడో టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే శనివారం కిరణ్ సొంత ఇంట్లోని స్టోర్ రూమ్ లో శవంగా కనిపించాడు. అందులోనే ఉరివేసుకుని చనిపోయాడని తెలుస్తోంది. అయితే అతను ఈరోజే చనిపోయాడా మూడ్రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే విషయమై పోలీసు విచారణ కొనసాగుతోంది. అనంత సర్వజన ఆసుపత్రికి కిరణ్ మృతదేహాన్ని తరలించి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.