Tuesday, June 30, 2020

Covaxin India's first Covid-19 vaccine by Bharat Biotech gets DGCI nod for human trials

భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ సిద్ధం
 కరోనా వైరస్‌కు దేశీయంగా తొలి వ్యాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ సంస్థకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అభినందనలు తెలిపారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్-ఢిల్లీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి-పుణె) సహకారంతో హైదరాబాద్ కి చెందిన భారత్ బయోటెక్ `కోవాక్సిన్` పేరిట ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. దేశంలోని తమ మొదటి స్వదేశీ కోవిడ్ -19 వ్యాక్సిన్ మానవ క్లినికల్ ట్రయల్స్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) నుంచి అనుమతి లభించిందని కంపెనీ సోమవారం ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ జులై లో దేశవ్యాప్తంగా ప్రారంభమవుతాయి. ఐసిఎంఆర్, ఎన్ఐవి ల సహకారం టీకా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిందని కంపెనీ ఈ సందర్భంగా పేర్కొంది. నగరంలోని జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ బయో-సేఫ్టీ లెవల్ 3 (బిఎస్ఎల్ -3)  హై కంటైనర్ ఫెసిలిటీలో ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు. డీజీసీఐ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వ్యాక్సిన్ 1,2  దశల మానవ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించడానికి అనుమతి ఇచ్చింది. సంస్థ ప్రీ-క్లినికల్ అధ్యయన ఫలితాలను సమర్పించిన తరువాత ఈ ముందడుగు పడింది. జూలై 2020 లో దేశం అంతటా మానవ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానుండడం ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో శుభసూచకంగా భావించాలి.

Saturday, June 27, 2020

Madhya Pradesh CM Shivraj Singh Chauhan Tirumala tour

శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ ముఖ్యమంత్రి శివరాజ్
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ముందంజలో కొనసాగుతుందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. శనివారం ఆయన తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ సముదాయం నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన చౌహాన్ దేశం ప్రస్తుతం ఒక కఠినమైన దశను దాటుతోందని పేర్కొన్నారు. ఒక వైపు కోవిడ్-19 మహమ్మారిపై పోరాటం, మరోపక్క సరిహద్దుల్లో చైనాను ఎదుర్కోంటోందని చెప్పారు. సరిహద్దుల వద్ద గల మన వీర జవాన్లు చైనాకు తగిన సమాధానం ఇచ్చారన్నారు. మన సరిహద్దులను సురక్షితంగా కాపాడుకోవడం, అదే సమయంలో దేశ ప్రజలకు కరోనా మహమ్మారి  బారి నుంచి  విముక్తి కల్పించడం ప్రధానమైన సవాళ్లుగా అభివర్ణించారు. కలియుగ దైవమైన శ్రీవారిని తను ఈ విపత్కర తరుణం నుంచి దేశాన్ని రక్షించాలని ప్రార్థించినట్లు తెలిపారు. మధ్యప్రదేశ్ సీఎంగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన చౌహాన్ గడిచిన రెండ్రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఆయన శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. శుక్రవారం ఆయన చినజియర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఆశ్రమంలోనే బస చేసిన చౌహాన్ ఈరోజు తిరుమల స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.


Saturday, June 20, 2020

Telangana CM KCR announced Rs.5 crores and group-1 job for colonel Santosh Babu family

అమర జవాన్ కుటుంబానికి టీఎస్ సర్కార్ బాసట
గాల్వాన్ ప్రాంతంలో చైనా సైనికమూకను నిలువరించే ప్రయత్నంలో అసువులు బాసిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోంది. సర్కార్ తరఫున మంత్రి జగదీశ్ రెడ్డి శనివారం సూర్యపేటలోని వీరజవాన్ కుటుంబం నివసిస్తోన్న ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుటుంబానికి రూ.5 కోట్ల ఆర్థిక సాయంతో పాటు ఇంటి స్థలం కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దాంతో పాటు సంతోష్ బాబు సతీమణికి గ్రూప్-1 ఉద్యోగాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. వీరజవాన్ కుటుంబ సభ్యుల్ని సోమవారం ఆయన స్వయంగా వెళ్లి కలవనున్నారు. చైనా సైనికులతో ఘర్షణలో మరణించిన మిగతా 19 మంది కుటుంబ సభ్యులకు కూడా ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర రక్షణ మంత్రి ద్వారా అందిస్తామని సీఎం వెల్లడించారు. సరిహద్దుల్లో దేశ రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సైనికులకు యావత్ దేశం అండగా నిలవాలి..వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలను ఆదుకోవాలి.. తద్వారా సైనికుల్లో ఆత్మ విశ్వాసం, వారి కుటుంబాల్లో భరోసా నింపాలి.. అని కేసీఆర్ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం సందర్భంగా చెప్పిన సంగతి తెలిసిందే.

Sunday, June 14, 2020

YSRCP MP Raghu Rama Krishna Raju sensational comments on Atchannaidu's arrest will bring disrepute to Jagan

అచ్చెన్న అరెస్ట్ పై వైఎస్సార్ సీపీ ఎంపీ పెదవి విరుపు
ఆంధ్రప్రదేశ్ కు చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సొంతపార్టీనే ఇరుకున పెట్టేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వై.ఎస్.ఆర్.సి.పి.లో ఉన్న ఆయన శనివారం మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్టుపై పెదవి విరిచారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రతిపక్ష నాయకుల అరెస్టులు జగన్ సర్కార్ కు మైనస్ కావొచ్చని అభిప్రాయపడ్డారు. అచ్చెన్నాయుడును చూసేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఆస్పత్రిలోకి అనుమతించకపోవడం సరైన పద్ధతి కాదని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. అయితే ఆయన తాజాగా బీజేపీ వైపు చూస్తున్నారన్న వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై ప్రశ్నించగా ఏపీ సీఎం జగన్ పక్క చూపు చూసినా, ఓర చూపు చూసినా, దొంగ చూపు చూసినా తను మాత్రం ఆయననే చూస్తున్నానని  బదులిచ్చారు. కొందరు వైసీపీ నేతల అత్యుత్సాహం  జగన్ ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తోందని చెప్పారు. అలాగే అచ్చెన్నాయుడు ఇంటి గోడ దూకి ఆయన్ను అరెస్ట్‌ చేయాల్సిన అవసరం లేదన్నారు. నిజంగా తప్పు చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.  టీడీపీ నేతలు రోజుకొకరు అరెస్టు అవుతారని మంత్రులు అనడం సరి కాదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. మంత్రుల వ్యాఖ్యల వల్ల కావాలనే అరెస్టులు చేసినట్లు ప్రజలు భావించే ప్రమాదం ఉందని ఎంపీ వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. అలాగే నాయకులపై ఎలాంటి ఆధారం లేకుండా ఎవరూ కేసులు పెట్టలేరన్నారు.