Sunday, June 14, 2020

YSRCP MP Raghu Rama Krishna Raju sensational comments on Atchannaidu's arrest will bring disrepute to Jagan

అచ్చెన్న అరెస్ట్ పై వైఎస్సార్ సీపీ ఎంపీ పెదవి విరుపు
ఆంధ్రప్రదేశ్ కు చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సొంతపార్టీనే ఇరుకున పెట్టేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వై.ఎస్.ఆర్.సి.పి.లో ఉన్న ఆయన శనివారం మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్టుపై పెదవి విరిచారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రతిపక్ష నాయకుల అరెస్టులు జగన్ సర్కార్ కు మైనస్ కావొచ్చని అభిప్రాయపడ్డారు. అచ్చెన్నాయుడును చూసేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఆస్పత్రిలోకి అనుమతించకపోవడం సరైన పద్ధతి కాదని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. అయితే ఆయన తాజాగా బీజేపీ వైపు చూస్తున్నారన్న వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై ప్రశ్నించగా ఏపీ సీఎం జగన్ పక్క చూపు చూసినా, ఓర చూపు చూసినా, దొంగ చూపు చూసినా తను మాత్రం ఆయననే చూస్తున్నానని  బదులిచ్చారు. కొందరు వైసీపీ నేతల అత్యుత్సాహం  జగన్ ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తోందని చెప్పారు. అలాగే అచ్చెన్నాయుడు ఇంటి గోడ దూకి ఆయన్ను అరెస్ట్‌ చేయాల్సిన అవసరం లేదన్నారు. నిజంగా తప్పు చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.  టీడీపీ నేతలు రోజుకొకరు అరెస్టు అవుతారని మంత్రులు అనడం సరి కాదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. మంత్రుల వ్యాఖ్యల వల్ల కావాలనే అరెస్టులు చేసినట్లు ప్రజలు భావించే ప్రమాదం ఉందని ఎంపీ వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. అలాగే నాయకులపై ఎలాంటి ఆధారం లేకుండా ఎవరూ కేసులు పెట్టలేరన్నారు.

No comments:

Post a Comment