పోయెస్ గార్డెన్ లో శశికళకు నో ఎంట్రీ!
జైలు నుంచి బయటకు వచ్చాక కూడా శశికళ పూర్వవైభవం పొందడం అసాధ్యమేనని ప్రస్తుత పరిణామాలు స్పష్టీకరిస్తున్నాయి. పోయెస్ గార్డెన్ తో ఆమె అనుబంధం పూర్తిగా తెగిపోనుంది. జయలిలతతో పాటు అందులోనే ఆమె నివసిస్తూ చక్రం తిప్పారు. జయలలిత నెచ్చెలిగా.. చిన్నమ్మగా శశికళ తమిళనాడులో ఓ వెలుగువెలిగారు. అయితే అదంతా గతం. పురచ్చితలైవిగా
రాష్ట్ర ప్రజలతో జేజేలు అందుకున్న జయలలిత మరణించాక ఆ స్థానాన్ని శశికళ
అందుకున్నారు. అమ్మ నివసించిన పోయెస్ గార్డెన్ (వేదనిలయం)లో శశికళ హవా చాలా కాలం
కొనసాగింది. రాష్ట్ర ఎన్నికల చరిత్రను మలుపుతిప్పుతూ రెండోసారి
అన్నాడీఎంకేను అధికారంలోకి తెచ్చిన జయ కొద్దికాలంలోనే అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ
నేపథ్యంలో పార్టీపై పూర్తి పట్టుకల్గిన శశికళ ముఖ్యమంత్రి పీఠం అధీష్ఠించడమే
తరువాయి అనుకున్న దశలో కోర్టు తీర్పు రూపంలో ఆమె దూకుడుకు బ్రేకులు పడ్డాయి.
స్వల్ప వ్యవధిలోనే అగ్రనాయకులతో సహా చిన్నాపెద్ద నాయకులు అంతా శశికళ పట్టు నుంచి
తప్పించుకుపోయారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉన్నత న్యాయస్థానం ఆమెకు ఆరేళ్ల
జైలు శిక్ష విధించడంతో బెంగళూరు సమీపంలోని పరప్పన అగ్రహార జైలులో ప్రస్తుతం శిక్ష
అనుభవిస్తున్నారు. శిక్షాకాలం మధ్యలో శశికళ పెరోల్ పై విడుదలయిన సందర్భాల్లోనూ ఆమె
పోయెస్ గార్డెన్ లోకి అడుగుపెట్టలేకపోయారు. అప్పటికే అమ్మ నివసించిన ఇంటిని
ప్రభుత్వం స్మారక భవనంగా ప్రకటించడమే అందుకు కారణం. ఆ క్రమంలోనే సర్కారు పోయెస్
గార్డెన్ ను తీర్చిదిద్దుతోంది. ఈ విషయమై న్యాయస్థానంలో కేసు నడుస్తున్నా అధికార
అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రత్యేక చట్టం ద్వారా లక్ష్యం దిశగా ముందుకు సాగుతోంది. 2021లో జైలు జీవితం ముగించి బయటకు వచ్చినా చిన్నమ్మ గార్డెన్‌లోకి
అడుగుపెట్టలేదు. అందుకు గాను ముఖ్యమంత్రి పళనీస్వామి చకచకా పావులు కదుపుతున్నారు. గవర్నర్
సంతకం అయిన వెంటనే పోయెస్ గార్డెన్ జయమ్మ స్మారక మందిరంగా రూపుదాల్చనుంది. దాంతో శశికళ
ఇక తన జీవితకాలంలో అందులో మకాం పెట్టడం సాధ్యం కాదు. ఇంతకుమునుపు పెరోల్ పై చెన్నై
వచ్చిన శశికళ తన బంధువు ఇంట్లో ఉండక తప్పలేదు. చిన్నమ్మ కోసం కొత్త షెల్టర్‌పై `అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం` దృష్టి పెట్టింది. ఇప్పటికే చిన్నమ్మ ప్రతినిధిగా ఉన్న `అమ్మ` పార్టీ అధినేత, ఆర్కేనగర్ ఎమ్మెల్యే దినకరన్ రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయానికి
కూత వేటు దూరంలో బ్రహ్మాండమైన భవనాన్ని తీర్చిదిద్దారు. అయితే ఆ భవనాన్ని కేవలం పార్టీ
కార్యకలాపాల కోసం వినియోగించనున్నారు. అదేవిధంగా పోయెస్ గార్డెన్ కు సమీపంలో శశికళ
కోసం మరో భవనాన్ని ఏర్పాటు చేసే పనిలో ఆయన బిజీగా ఉన్నట్లు సమాచారం.