హలీం.. తయారీ లేదు!
గల్లీ గల్లీలోనూ చవులూరించే హలీం
ఈసారి భాగ్యనగరంలో కనిపించదు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు రోజంతా ఉపవాసం ఉన్నాక తక్షణ శక్తి
కోసం పోషకాహారమైన హలీం తీసుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీతో పాటు
హలీం రుచి అంతే ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. అయితే ప్రస్తుత కరోనా కాలంలో
అన్నింటితో పాటు ప్రార్థనలకు గండిపడింది. దాంతో రంజాన్ సామూహిక ప్రార్థనలతో పాటు
హలీం ఆరగింపునకు తెరపడనుంది. రంజాన్ నెలంతా దొరికే హలీంను ముస్లింలతో పాటు అన్ని
వర్గాల వారు లొట్టలేసుకుంటూ తింటారు. ఆన్
లైన్లో ఆర్డర్ చేసుకొని మరీ చికెన్, మటన్,
వెజ్ వెరైటీ హలీంలను టేస్ట్ చేసి తరిస్తుంటారు. వాటన్నింటికి
ఇప్పుడు `లాక్ డౌన్` పడ్డట్లే. ఈ ఏడాది
ఎక్కడా హలీం తయారీ ఉండబోదని హలీం మేకర్స్ అసోసియేషన్ తాజాగా ప్రకటించింది.
ప్రార్థనలు, పండుగలు అన్నీ ఇళ్లకే పరిమితం కావాలని తెలంగాణ
ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మసీదుల్లో కూడా సామూహిక ప్రార్థనలకు
అనుమతి లేదు. కేవలం ఇమామ్, మౌజన్లు మాత్రమే మసీదుల్లో
నమాజులు చేసుకొనే వెసులుబాటు పొందారు.