Sunday, April 5, 2020

Drone Split Hypo Chloride Medicine On Houses in Andhra Pradesh

డ్రోన్లతో కరోనాపై దండయాత్ర
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నగర మునిసిపల్ అధికారుల వినూత్న రీతిలో కరోనాపై యుద్ధభేరి మోగించారు. భవానీపురం పరిధిలోని ప్రియదర్శిని కాలనీలో మున్సిపల్ సిబ్బంది డ్రోన్ తో హైపో క్లోరైడ్ అనే యాంటీ కరోనా వైరస్ మందును ఇళ్లపై చల్లారు. కరోనా ప్రబలకుండా అడ్డుకునే చర్యల్లో భాగంగా మున్సిపల్ అధికారులు కార్యక్రమం చేపట్టారు. ప్రతీ వీధిలో డ్రోన్ల సహాయంతో నివాసాలపై మందు పిచికారీ చేసే కార్యక్రమం కొనసాగుతోంది. కార్యక్రమాన్ని మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

Tuesday, March 31, 2020

Badminton player Jwala Gutta has confirmed her marriage to South Indian actor Vishnu Vishal

త్వరలో విష్ణు విశాల్ తో గుత్తా జ్వాల పెళ్లి
భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ ప్లేయర్ గుత్తా జ్వాల తన పెళ్లి వార్తను ధ్రువీకరించింది. దక్షిణాదికి చెందిన ప్రముఖ నటుడు విష్ణు విశాల్తో ఆమె గత కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్న సంగతి తెలిసిందే. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆమె తమ ఫోటోలను షేర్ చేసి సంచలన సృష్టించింది. త్వరలోనే తామిద్దరం పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ప్రకటించింది. మేరకు గుత్తా జ్వాల ట్వీట్ చేసింది.  ట్వీట్ లో `లాక్డౌన్ సందర్భంగా నిన్ను మిస్ అవుతున్నా`అంటూ విశాల్ నుద్దేశించి పేర్కొంది. అందుకు బదులుగా విశాల్ `సామాజిక దూరం అందరూ ఇప్పుడు పాటించాలి కదా` అని  రీ ట్వీట్ చేశాడు. త్వరలోనే కరోనా మహమ్మారి కూడా దూరం కావాలని ఆకాంక్షించాడు. ఇదిలావుంటే జ్వాలకు గతంలోనే వివాహం అయిన విషయం విదితమే. తొలుత బాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. తర్వాత వీళ్లిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. అలాగే విశాల్కూడా గతంలోనే తన భార్యకు విడాకులు ఇచ్చాడు.

Wednesday, March 25, 2020

At Union Cabinet meet with PM Modi, ministers practice social social distancing

కేబినెట్ భేటీలోనూ సామాజిక దూరం
ఇటలీ, ఇరాన్, అమెరికాల్లో ప్రస్తుత కరోనా సంక్షోభం నేపథ్యంలో భారత్ పూర్తి స్థాయిలో అప్రమత్తమయింది. అందుకు స్ఫూర్తిగా కేంద్ర కేబినెట్ భేటీలోనూ సామాజిక దూరాన్ని పాటించింది. గడిచిన ఆదివారం (మార్చి 22) జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చి విజయవంతం చేసిన ప్రధాని మోదీ తాజా భేటీలోనూ ప్రజలకు చక్కటి సందేశాన్ని అందించారు. ప్రధాని, మంత్రులు సమావేశంలో రెండేసి మీటర్ల చొప్పున దూరంగా కూర్చుని కరోనా వ్యాప్తికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మంగళవారం దేశ ప్రజల్ని ఉద్దేశించి టీవీలో ప్రసంగించిన మోదీ 21 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ప్రకటించిన తర్వాత తొలిసారిగా ప్రధాని నివాసంలో కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమైంది. ప్రస్తుతం భారత్ కరోనా రెండో దశను దాటి మూడులోకి అడుగుపెట్టిన విపత్కర సమయంలో ప్రజలు సామాజిక దూరం పాటించి, ఐసోలేషన్లో ఉంటేనే వైరస్ నియంత్రణ సాధ్యమన్న నిపుణుల హెచ్చరికల్ని కేబినెట్ సీరియస్ గా అమలులోకి తెచ్చే చర్యలపై చర్చించింది. దేశంలో అత్యంత వేగంగా వ్యాపిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారికి చెక్ చెప్పడానికి ముమ్మరంగా ప్రయత్నించాలని నిర్ణయించింది. ఏమరపాటు, సామాజిక దూరాన్ని పాటించకపోవడం వల్లే అమెరికా, ఇటలీ, ఇరాన్ లు కరోనా వైరస్ పుట్టిన చైనాను మించి అతలాకుతలం అవుతున్నాయి. పరిస్థితి భారత్ లో దాపురించకుండా ప్రస్తుతం తీవ్రమైన ఆంక్షలు అమలులోకి తెచ్చారు. తాజా కేబినెట్ భేటీలో నిత్యావసరాల ధరలు నియంత్రణ, వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచడంపై కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫుడ్ప్రాసెసింగ్యూనిట్లు లాక్చేయొద్దని సూచించింది. ప్రజలు సాధ్యమైనంత వరకు బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేసింది. మార్కెట్లో నిత్యావసర వస్తువుల అందుబాటుపై కేంద్రం పర్యవేక్షిస్తుందని కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్విలాస్ పాశ్వాన్ తెలిపారు. ఇదే అదనుగా ఉత్పత్తిదారులు, వ్యాపారులు ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Sunday, March 22, 2020

The law has already passed orders for the prevention of corona in Telangana

తెలంగాణలో కరోనాపై కొనసాగుతున్న యుద్ధం
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారిపై కొనసాగుతున్న యుద్ధంలో తెలంగాణ ముందువరుసలో నిలుస్తోంది. తెలంగాణ  ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణకు సరికొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ అంటువ్యాధుల నివారణ చట్టం అమలులోకి తెచ్చింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అత్యవసర ఉత్తర్వుల్ని జారీ చేసింది. ప్రధాని మోదీ పిలుపునకు మద్దతుగా ఆదివారం జనతా కర్ఫ్యూ చేపట్టాలని సీఎం కేసీఆర్ కోరిన సంగతి తెలిసిందే. ఈ బంద్ మంది కోసం కాదు మన కోసం.. కర్ఫ్యూను పాటిద్దాం.. అందరం ఇళ్లకే పరిమితమవుదామని కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా చాలా స్వాభిమానం గల వైరస్.. దాన్ని మనం ఆహ్వానిస్తేనే మనదగ్గరకు వస్తుంది.. అందువల్ల దాన్ని మనదరి చేరనీయకుండా శుభ్రత, సామాజిక దూరం పాటిస్తూ పారదోలుదామన్నారు. అంతేగాక తెలంగాణలో 24 గంటల స్వచ్ఛంద కర్ఫ్యూ పాటించి దేశానికే ఆదర్శంగా నిలుద్దామని కేసీఆర్ విన్నవించారు. పీఎం, సీఎం పిలుపుల నేపథ్యంలో భాగ్యనగరంతో సహా యావత్ రాష్ట్రంలో ప్రజలు స్వీయ గృహ నిర్బంధాన్ని పాటిస్తున్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు జనతా కర్ఫ్యూ నిరాటంకంగా కొనసాగుతోంది. అత్యవసర సేవలకు సంబంధించి టీఎస్ సర్కార్ పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర సరిహద్దుల్ని మూసివేశారు. ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. మహారాష్ట్ర నుంచి వాహనాలు రాకుండా పోలీసులు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా జహీరాబాద్ శివారులోని మాడ్గి అంతర్ రాష్ట్ర చెక్ పోస్టు దగ్గర ముంబయి నుంచి వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును పోలీసులు అడ్డుకున్నారు. మొత్తం 37 మంది ప్రయాణికులు ఖతర్ నుంచి ముంబయి వచ్చారు. అక్కడ నుంచి వారి ఏజెంట్ ద్వారా బస్సులో హైదరాబాద్ బయలుదేరారు. ఈ బస్సు రాజధానికి చేరుకుంటుండగా సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి సరిహద్దుల్లోనే నిలిపివేశారు. కాగా నగరంలో మంగళ్‌హాట్‌కు చెందిన కరోనా బాధితుణ్ని పోలీసులు నాంపల్లి రైల్వే స్టేషన్ లో పట్టుకున్నారు. తోటి ప్రయాణికుడు ఇచ్చిన సమాచారం ప్రకారం అతణ్ని పట్టుకున్న పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. సదరు వ్యక్తి ముంబయి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తూ నాంపల్లి చేరుకున్నాడు. అతని చేతిపై మహారాష్ట సర్కార్ (కరోనా పీడితుడిగా) వేసిన ముద్రను బట్టి సహ ప్రయాణికుడు పోలీసులకు సమాచారం అందించాడు.