20 నుంచి తూ.గో.లో సినిమా హాళ్ల బంద్
కోవిడ్-19 ఎఫెక్ట్ సినిమా లవర్స్ ఎక్కువగా ఉండే ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాను తాకింది. కరోనా ప్రభావంతో జిల్లాలో థియేటర్లు మూతపడనున్నాయి. ఈ విషయాన్ని ఈస్ట్ గోదావరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ అసోషియేషన్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణలో సినిమా హాళ్లన్నీ మూతపడ్డాయి. ఈనెల 31 వరకూ థియేటర్లతో పాటు విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్ మూసివేశారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న `ఆచార్య` మొదలు చిన్న, పెద్ద సినిమాల షూటింగ్లు రద్దయ్యాయి. విడుదలైన సినిమాలకు కోట్లలో నష్టం జరగ్గా ఈ నెలలో విడుదల కావాల్సిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడుతున్నాయి. కరోనా అంతకంతకూ వ్యాప్తి చెందుతుండడంతో ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం (20వ తేదీ) నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని థియేటర్ల మూసివేయనున్నారు. నెల్లూరులో కరోనా కలకలం రేగడంతో ఇప్పటికే అక్కడ సినిమా హాళ్లన్నీ బంద్ ప్రకటించాయి. మరికొన్ని జిల్లాల్లో స్వచ్ఛందంగానే థియేటర్లను మూసేస్తున్నారు. పెద్ద సంఖ్యలో జనసమూహాలు గుమిగూడే ప్రాంతాల్లో అత్యంత వేగంగా కరోనా ప్రబలుతోందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టమైన హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లాలో తీసుకున్న తాజా నిర్ణయం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా థియేటర్ల స్వచ్ఛంద బంద్ కు దారితీసే అవకాశం ఉంది. ఇక తెలంగాణతో పాటు కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు ఇప్పటికే అధికారికంగా బంద్ ప్రకటించాయి.