కరోనాపై యుద్ధానికి మోదీ పిలుపు
కోవిడ్-19 మహమ్మారిపై యుద్ధానికి భారత ప్రధాని మోదీ పిలుపు
ఇచ్చారు. గురువారం రాత్రి ఆయన జాతినుద్దేశించి టీవీలో ప్రసంగించారు. ఈ ఆదివారం మార్చి
22న ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు దేశ ప్రజలందరూ స్వచ్ఛంద కర్ఫ్యూ పాటించాలని విన్నవించారు.
ఈ నెల 31 వరకు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని ప్రజల్ని
కోరారు. కరోనాకు మందులేదని, వ్యాక్సిన్ కూడా ఇంకా అందుబాటులోకి రాలేదనే విషయాన్ని గుర్తు
చేశారు. జనం గుమిగూడవద్దని, జన సమూహాలున్న ప్రాంతాలకు వెళ్లరాదని కోరారు. అందరూ వర్క్
ఫ్రం హోం చేసుకోవాలన్నారు. నిత్యావసరాల కోసం బాధ పడొద్దని వాటిని ఇళ్లకే పంపుతామని
భరోసా ఇచ్చారు. కోవిడ్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామని ప్రధాని చెప్పారు. కరోనా వైరస్
కు భయపడాల్సిన పని లేదని అయితే అజాగ్రత్త వహించరాదన్నారు. వాస్తవానికి యావత్ ప్రపంచం
థర్డ్ వరల్డ్ వార్ ముంగిట నిలిచిందని చెప్పారు. వేగంగా ప్రగతి పథాన పయనిస్తున్న భారత్
కు కరోనా తీరని ఆటంకంగా నిలిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య, పరిశుభ్రతా సిబ్బంది
సేవలు వెలకట్టలేనివని ప్రధాని ప్రశంసించారు. కరోనా కట్టడికి చేస్తున్న యుద్ధంలో సమష్టిగా
పోరాడాలని పిలుపుఇచ్చారు. తద్వారా రానున్న రోజుల్లో ఈ రాకసిపై భారత్ తప్పనిసరిగా విజయం
సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.