సీఏఏను వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం
ముందునుంచి చెబుతున్నట్లుగానే తెలంగాణ ప్రభుత్వాధినేత కేసీఆర్ నేతృత్వంలో ఆ రాష్ట్ర సర్కార్ సీఏఏ (సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్) కు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. ఇటీవల కేంద్రప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) తెచ్చిన సంగతి తెలిసిందే. సోమవారం తెలంగాణ అసెంబ్లీలో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు సవరణల్ని కేంద్రానికి సూచించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. ఏదో గుడ్డిగా ఈ యాక్ట్ ను వ్యతిరేకించడం లేదని సంపూర్ణ అవగాహనతోనే సీఏఏ ను వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. సీఏఏ యావద్దేశ సమస్య తప్పా మరొకటి కాదని తేల్చి చెప్పారు. తనకే బర్త్ సర్టిఫికెట్ లేదని నమోదుకు ఆధార్, ఓటర్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డులేవీ పనికిరావని నిబంధన విధించడమేంటని ప్రశ్నించారు. ప్రజలు తమను నాయకులుగా ఎన్నుకోవడానికి ఉపయోగపడే ఓటర్ కార్డు వారు పౌరులుగా నమోదు కావడానికి ఉపయోగపడకపోవడం విడ్డూరమన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ శాసనసభ తీర్మానానికి ఆమోదం తెలిపింది. తీర్మానంపై చర్చ అనంతరం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే సీఎం కేసీఆర్.. సీఏఏపై తీర్మానం ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించారు. అనంతరం అన్ని పార్టీల నేతలూ ఈ తీర్మానంపై మాట్లాడారు. అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ సీఏఏపై తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. అసెంబ్లీలో సీఏఏ వ్యతిరేక తీర్మానం ప్రతుల్ని చించేసి తన నిరసన వ్యక్తం చేశారు.