కరోనాను
ఖాతరు చేయని హోలీ హేల
ప్రపంచవ్యాప్తంగా
కరోనా వైరస్ గుబులు పుట్టిస్తున్నా భారత సంప్రదాయ హోలీ సంబరం యథావిధిగా కొనసాగింది.
దేశంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం జనం రంగుల పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.
అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలతో పాటు పలు ప్రాంతాల్లో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ
సంబరంగా గడిపారు. ఓ వైపు దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నా
ప్రజలు లెక్కచేయకుండా హోలీ ఆడారు. గువాహటి, లక్నోల్లో రంగుల వేడుక ఘనంగా కొనసాగింది.
ప్రవాస భారతీయులు ఆయా దేశాల్లో హోలీ జరుపుకున్నారు. అయితే క్రితం సంవత్సరంతో పోలిస్తే
ఈసారి కలర్ ఫెస్టివల్ ఊపు మాత్రం చాలా వరకు తగ్గినట్లే కనిపించింది. ఆస్ట్రేలియా ప్రధాని
మోరిసన్ తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా ఎన్.ఆర్.ఐ.లకు హోలీ శుభాకాంక్షలు అందజేశారు. ఈ
మేరకు ఆయన ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆస్ట్రేలియా సమాజానికి హిందూ విశ్వాసాలు ఎంతో ముఖ్యం
అనే విషయాన్ని ఈ హోలీ వేడుక సూచిస్తుందని ఆయన అన్నారు. `రంగుల పండుగను ప్రతి ఒక్కరూ
ప్రేమ, ఆనందం, శాంతి, సమాజ శ్రేయస్సు దృష్ట్యా అమిత సంతోషంతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ హోలీ శుభాకాంక్షలు`
అని మోరిసన్ తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.