Sunday, January 26, 2020

ITBP Celebrate 71st Republic Day by Hoisting National Flag at 17,000 Feet in Ladakh

హిమగిరులపై మువ్వన్నెల జెండా రెపరెపలు
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐ.టి.బి.పి.) సిబ్బంది 71వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం ఐటీబీపీ సిబ్బంది 17,000 అడుగుల ఎత్తుకు జాతీయ జెండాను మోసుకు వెళ్లి ఎగురవేశారు. సైనికులు 'భారత్ మాతా కి జై', 'వందే మాతరం' అంటూ నినాదాలు చేశారు. జెండాను ఎగురవేసే సమయంలో లడఖ్‌లో ఉష్ణోగ్రత మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ ఉంది. అతిశీతల వాతావరణంలో దేశానికి అచంచల సేవలందిస్తున్న ఈ ఐటీబీపీ సైనికులను 'హిమ్వీర్స్' (హిమాలయాల ధైర్య సైనికులు) అని కూడా పిలుస్తారు. 1962 చైనా-భారత్ యుద్ధం నేపథ్యంలో ఐటీబీపీ ఏర్పడింది. సీఆర్పీఎఫ్ (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) చట్టం ప్రకారం 1962 అక్టోబర్ 24 న నెలకొల్పిన ఐదు కేంద్ర సాయుధ పోలీసు దళాలలో ఐటీబీపీ ఒకటి. నాటి నుంచి హిమగిరులపై ఈ దళం భారత స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తోంది. భారత రాజ్యాంగం ప్రకారం దేశ పౌరుల ప్రాథమిక హక్కులు, విధులను నిర్దేశిస్తూ 26 జనవరి 1950 నుంచి అమల్లోకి వచ్చింది. భారత్ స్వతంత్ర గణతంత్ర దేశంగా అవతరించిన చరిత్రాత్మక క్షణానికి గుర్తుగా ఏటా జనవరి 26 న రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఇది. 1929 లో ఇదే రోజున భారత సంపూర్ణ స్వాతంత్య్రాన్ని కాంగ్రెస్ డిక్లరేషన్ ప్రకటించింది. 1949 నవంబర్ 26 న రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ సభ ఆమోదించింది.

Friday, January 24, 2020

Oxford Dictionary Gets 26 India English Words Like Aadhaar, chawl, dabba, hartal, shaadi

ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో 26 భారతీయ పదాలకు చోటు
దేశ ప్రజల గుర్తింపు కార్డు ఆధార్ కు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ లో చోటు దక్కింది. ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ తాజా 10వ ఎడిషన్ శుక్రవారం విడుదలయింది. ఇందులో ఆధార్, చావల్ (బియ్యం), డబ్బా(బడ్డీ), హర్తాళ్ (ఆందోళన), షాదీ (పెళ్లి) వంటి 26 భారతీయ భాషా పదాలకు చోటు కల్పించారు. వీటితో పాటు ఆక్స్ ఫర్డ్ ఇండియన్ ఇంగ్లిష్ డిక్షనరీలో చాట్‌బాట్, ఫేక్ న్యూస్, మైక్రోప్లాస్టిక్, బస్ స్టాండ్, డీమ్డ్ యూనివర్శిటీ, ఎఫ్ఐఆర్, నాన్-వెజ్, రిడ్రెసల్, టెంపో, ట్యూబ్ లైట్, వెజ్, వీడియోగ్రాఫ్ తదితర 1,000 పదాలకు స్థానం లభించినట్లు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ (ఓయూపీ) మేనేజింగ్ డైరెక్టర్ (ఎడ్యుకేషన్ డివిజన్) ఫాతిమా దాదా తెలిపారు. అలాగే డిక్షనరీ ఆన్‌లైన్ వెర్షన్‌లో విద్యుత్ కోసం (current- for electricity), దోపిడీదారుడు (looter), దోపిడీ (looting), ఉపజిల్లా (one of the areas that a district is divided) వంటి నాలుగు కొత్త భారతీయ ఆంగ్ల పదాలకు చోటు దక్కిందన్నారు. 77 సంవత్సరాల చరిత్ర కల్గిన ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ తొలి నిఘంటువు తొలుత జపాన్‌లో 1942 లో ప్రచురితమయింది. ఓయూపీ ఏర్పడ్డాక ఆల్బర్ట్ సిడ్నీ హార్నబి ఆధ్వర్యంలో ఇంగ్లాండ్ నుంచి 1948లో డిక్షనరీ మొదటి ఎడిషన్ విడుదలయింది. ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రాచుర్యాన్ని పొందిన ఆయా భాషా పదాల్ని అందిపుచ్చుకుంటూ ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ ఎనిమిది దశబ్దాలుగా సరికొత్త ఎడిషన్లను ఆవిష్కరిస్తూ వస్తోంది. కేంబ్రిడ్జ్ తర్వాత అత్యంత పురాతనమైన విశ్వవిద్యాలయం ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీయే. ఈ వర్సిటీకి అనుబంధంగా ప్రారంభమైన ఓయూపీ ప్రపంచంలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయ ముద్రణా సంస్థ. 190 దేశాలలో 70 భాషల్లో ఓయూపీ ప్రచురణలు వెలువడుతున్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా, వృత్తిపరమైన పుస్తకాల్ని ఓయూపీ విడుదల చేస్తోంది.

Tuesday, January 21, 2020

MS Dhoni offers prayers at Deori Temple

డియోరి గుళ్లో ధోని పూజలు
ఝూర్ఖండ్ డైనమేట్, మిస్టర్ కూల్ ఎం.ఎస్.ధోని మంగళవారం ఇక్కడ డియోరీలోని దేవాలయంలో పూజలు చేశాడు. గతేడాది వరల్డ్ కప్ లో ఆడిన నాటి నుంచి ధోని మళ్లీ గ్రౌండ్ లోకి దిగలేదు. దాంతో మార్చిలో జరగనున్న ఐపీఎల్ టీ20 మ్యాచ్ ల్లో రాణిస్తేనే మెన్ ఇన్ బ్లూ టీంలో అతనికి చోటు దక్కనుంది. ఇప్పటికే ఈ విషయాన్ని టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశాడు. అంతర్జాతీయ టోర్నీల్లో ధోని పాల్గొని చాలా కాలమైనందున అతని శరీరం రానున్న టీ20 వరల్డ్ కప్ లో ఏమేరకు సహకరిస్తోందో చూడాలని కూడా వ్యాఖ్యానించాడు. బీసీసీఐ సైతం ఇటీవల విడుదల చేసిన సెంట్రల్ కాంట్రాక్ట్‌ జాబితాలో ధోని పేరు చేర్చలేదు. అయితే ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లనే బీసీసీఐ పరిగణనలోకి తీసుకుని లిస్టు రిలీజ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో మిస్టర్ కూల్ ధోని స్వరాష్ట్రంలోని డియోరీ దేవాలయంలో పూజలు చేసిన న్యూస్ నెట్టింట్లో వైరల్ అయింది. 2011లో వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు కూడా ఇదే దేవాలయంలో అప్పటి టీం కెప్టెన్‌గా ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఆ టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది. భారత్‌కి 28 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్‌ని అందించిన ఘనత ధోని సొంతమయింది. 2007లో సైతం ధోని టీ20 వరల్డ్ కప్ ను భారత్ కు అందించిన సంగతి తెలిసిందే. భారత్ మొత్తం మూడు వరల్డ్ కప్ లను అందుకోగా అందులో మొదటిది 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో సాధ్యమయింది. మిగిలిన రెండు వరల్డ్ కప్ లను ధోని నాయకత్వంలోనే భారత్ జట్టు గెలుచుకోవడం విశేషం. ఆ విధంగా భారత్ కు రెండు సార్లు వరల్డ్ కప్ లను అందించిన ఘనాపాఠి ధోనియే. 2019 వరల్డ్ కప్ సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి పాలయింది. వర్షం కారణంగా మ్యాచ్ రెండోరోజూ కొనసాగడం కివీస్ కు కలిసివచ్చింది. 240 స్వల్ప పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ జట్టు టాప్ ఆర్డర్ వికెట్లు టపటపా పడిపోయాయి. ఆ దశలో టీం ఇండియాకు ధోని వెన్నెముకగా నిలిచాడు. ఆ మ్యాచ్ లో చలాకీ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా(79) చెలరేగి బ్యాటింగ్ చేశాడు. వీరిద్దరి జోడి భారత్ ను దాదాపు గెలుపువాకిటకు తీసుకెళ్లింది. ధోని అర్ధ సెంచరీ (50) చేసి రనౌట్ కావడంతో మ్యాచ్ భారత్ చేజారింది. ఆ తర్వాత నుంచి ధోని క్రికెట్ మైదానంలో అడుగుపెట్టలేదు. ప్రస్తుతం రానున్న ఐపీఎల్ లో రాణించడంతో పాటు మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఝూర్కండ్ లోనే ధోని ముమ్మర సాధనలో నిమగ్నమయ్యాడు.

Monday, January 20, 2020

BalaKrishna new look in the AP Assembly

ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ కొత్త లుక్ 
హిందూపురం ఎమ్మెల్యే తెలుగుదేశం నాయకుడు నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొత్త లుక్ లో దర్శనమిచ్చారు. సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్ డీఏ బిల్లులను ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రతిపక్ష బెంచీల్లో ఆశీనులైన బాలయ్య బారు మీసాలు, గుండు, నెరిసిన గడ్డంతో కనిపించారు. సహచర శాసనసభ్యులే గుర్తు పట్టలేని విధంగా తెల్ల చొక్కా, ప్యాంట్ ధరించిన ఆయన పూర్తి సరికొత్త గెటప్ లో సమావేశాలకు హాజరయ్యారు. బాలయ్య ఈ గెటప్ లో కనిపించడం ఇదే ప్రథమం. దాంతో ఆయన ప్రస్తుత గెటప్ లోని ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇటీవల ఎస్.ఎ.రాజ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన `రూరల్` సినిమాతో ఆయన ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలయ్య ఫ్రెంచ్ కట్ గడ్డంతో యువకుడిలా కనిపించి అలరించారు. అందుకు భిన్నంగా ప్రస్తుతం పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిలా వైట్ అండ్ వైట్ డ్రస్, గుండుతో ఆయన దర్శనమివ్వడం చర్చనీయాంశం అయింది. ఆదివారం మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన టీడీఎల్పీ సమావేశానికి ఆయన ఇదే గెటప్ లో హాజరవ్వడంతో తెలుగుదేశం నాయకులూ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఇదిలావుండగా తాజాగా ఆయన తన ఆస్థాన దర్శకుడు బోయపాటి శ్రీను చిత్రంలో నటిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. హ్యాట్రిక్ కోసం వీరి ప్రస్తుత చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.