Tuesday, January 21, 2020

MS Dhoni offers prayers at Deori Temple

డియోరి గుళ్లో ధోని పూజలు
ఝూర్ఖండ్ డైనమేట్, మిస్టర్ కూల్ ఎం.ఎస్.ధోని మంగళవారం ఇక్కడ డియోరీలోని దేవాలయంలో పూజలు చేశాడు. గతేడాది వరల్డ్ కప్ లో ఆడిన నాటి నుంచి ధోని మళ్లీ గ్రౌండ్ లోకి దిగలేదు. దాంతో మార్చిలో జరగనున్న ఐపీఎల్ టీ20 మ్యాచ్ ల్లో రాణిస్తేనే మెన్ ఇన్ బ్లూ టీంలో అతనికి చోటు దక్కనుంది. ఇప్పటికే ఈ విషయాన్ని టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశాడు. అంతర్జాతీయ టోర్నీల్లో ధోని పాల్గొని చాలా కాలమైనందున అతని శరీరం రానున్న టీ20 వరల్డ్ కప్ లో ఏమేరకు సహకరిస్తోందో చూడాలని కూడా వ్యాఖ్యానించాడు. బీసీసీఐ సైతం ఇటీవల విడుదల చేసిన సెంట్రల్ కాంట్రాక్ట్‌ జాబితాలో ధోని పేరు చేర్చలేదు. అయితే ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లనే బీసీసీఐ పరిగణనలోకి తీసుకుని లిస్టు రిలీజ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో మిస్టర్ కూల్ ధోని స్వరాష్ట్రంలోని డియోరీ దేవాలయంలో పూజలు చేసిన న్యూస్ నెట్టింట్లో వైరల్ అయింది. 2011లో వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు కూడా ఇదే దేవాలయంలో అప్పటి టీం కెప్టెన్‌గా ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఆ టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది. భారత్‌కి 28 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్‌ని అందించిన ఘనత ధోని సొంతమయింది. 2007లో సైతం ధోని టీ20 వరల్డ్ కప్ ను భారత్ కు అందించిన సంగతి తెలిసిందే. భారత్ మొత్తం మూడు వరల్డ్ కప్ లను అందుకోగా అందులో మొదటిది 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో సాధ్యమయింది. మిగిలిన రెండు వరల్డ్ కప్ లను ధోని నాయకత్వంలోనే భారత్ జట్టు గెలుచుకోవడం విశేషం. ఆ విధంగా భారత్ కు రెండు సార్లు వరల్డ్ కప్ లను అందించిన ఘనాపాఠి ధోనియే. 2019 వరల్డ్ కప్ సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి పాలయింది. వర్షం కారణంగా మ్యాచ్ రెండోరోజూ కొనసాగడం కివీస్ కు కలిసివచ్చింది. 240 స్వల్ప పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ జట్టు టాప్ ఆర్డర్ వికెట్లు టపటపా పడిపోయాయి. ఆ దశలో టీం ఇండియాకు ధోని వెన్నెముకగా నిలిచాడు. ఆ మ్యాచ్ లో చలాకీ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా(79) చెలరేగి బ్యాటింగ్ చేశాడు. వీరిద్దరి జోడి భారత్ ను దాదాపు గెలుపువాకిటకు తీసుకెళ్లింది. ధోని అర్ధ సెంచరీ (50) చేసి రనౌట్ కావడంతో మ్యాచ్ భారత్ చేజారింది. ఆ తర్వాత నుంచి ధోని క్రికెట్ మైదానంలో అడుగుపెట్టలేదు. ప్రస్తుతం రానున్న ఐపీఎల్ లో రాణించడంతో పాటు మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఝూర్కండ్ లోనే ధోని ముమ్మర సాధనలో నిమగ్నమయ్యాడు.

No comments:

Post a Comment