ఆత్మాహుతికి ముందు వలవలా ఏడ్చిన ఐసిస్ ఉగ్రనేత బాగ్దాదీ
కరడుగట్టిన ఉగ్రవాది సైతం మరణపు
అంచులకు చేరినప్పుడు విలవిల్లాడక తప్పదు. ఇదే విషయం నరరూప రాక్షసులుగా పేరొందిన ఇస్లామిక్
స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ అధినేత అబు బకర్ అల్ బాగ్దాదీ (48) చివరి క్షణాల్లో రుజువయింది. టర్కీకి సమీపంలోని తూర్పు సిరియాకు చెందిన బరిషా
గ్రామంలో ఓ గుహలో దాగిన బాగ్దాదీని అమెరికా ప్రత్యేక బలగాలు చుట్టుముట్టాయి. యుద్ధ
తంత్రంలో ఆరితేరిన శునకాలతో సరికొత్తగా అమెరికా సేనలు బాగ్దాదీ పైకి దాడికి
ఉపక్రమించాయి. లొంగిపోవాల్సిందిగా అతణ్ని హెచ్చరించాయి. చుట్టూ సేనలు
అరివీరభయంకరమైన పులుల్లాంటి జాగిలాలు లంఘిస్తూ మీదకు ఉరుకుతుంటే అంతటి భయంకరమైన
ఉగ్రవాది బాగ్దాదీ సైతం పరుగులు పెడుతూ కన్నీరుమున్నీరుగా విలపించాడు. మాటువేసి
బాగ్దాదీ జాడ కనుగొన్న అమెరికా సంకీర్ణ దళాలు రెండు వారాలు క్రితమే పక్కా
ప్రాణాళికతో `ఆపరేషన్ కైల ముల్లర్` కు శ్రీకారం చుట్టాయి. ఈ మొత్తం ఆపరేషన్ ను అమెరికా
అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ నుంచి లైవ్ లో వీక్షించారు. తప్పించుకోలేని
పరిస్థితుల్లో బాగ్దాదీ తనను తను పేల్చేసుకున్నాడు. ఈ పేలుడులో ఇద్దరు భార్యలు,
ముగ్గురు పిల్లలు సహా బాగ్దాదీ తునాతునకలై పోయాడు. డీఎన్ఏ పరీక్షల ద్వారా అమెరికా
భద్రతా బలగాలు బాగ్దాదీ మృతిని ధ్రువీకరించాయి. పాకిస్థాన్ లోని అబోథాబాద్ లో ఒసామా
బిన్ లాడెన్ ను అమెరికా సీషెల్స్ కమెండోలు హతమార్చినప్పుడు అప్పటి అమెరికా
అధ్యక్షుడు ఒబమా ప్రత్యక్ష ప్రసారంలో తిలకించిన చందంగానే తాజాగా బాగ్దాదీని మట్టుబెట్టే
దృశ్యాల్ని ట్రంప్ లైవ్ ద్వారా వీక్షించారు. బాగ్దాదీ హతమయ్యాడనే
వార్తలు ధ్రువీకరణయ్యాక ఆ విషయాల్ని ట్రంప్ సోమవారం ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు. సేవాసంస్థలో
భాగస్వామి అయిన అమెరికాకు చెందిన కైల ముల్లర్ వైద్య సహాయకురాలిగా విధులు నిర్వర్తించేందుకు టర్కీ
నుంచి అలెప్పోకు వెళ్తుండగా ఐసిస్ ఉగ్రవాదులు ఆమెను అపహరించారు. బాగ్దాదీ ఆమెపై
తొలుత అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత 2013 నుంచి 2015 వరకు ఉగ్రవాదుల చెరలో
మగ్గిన ముల్లర్ అనంతరం మరణించినట్లు అమెరికా పేర్కొంది. ఎన్నాళ్ల నుంచో ఐసిస్
పీచమణిచేందుకు కంకణం కట్టుకున్న అమెరికా ఆదివారం `ఆపరేషన్ కైలముల్లర్` ద్వారా ఆ
సంస్థ అధినేతను అంతమొందించి మరోసారి తన సత్తా చాటింది.