ప్రధాని మోదీకి గ్లోబల్ గోల్ కీపర్
అవార్డు ప్రదానం
భారత
ప్రధాని నరేంద్ర మోదీ కి గ్లోబల్ గోల్ కీపర్ అవార్డును బిల్ అండ్ మెలిండ గేట్స్ ఫౌండేషన్ ప్రదానం చేసింది. అమెరికా పర్యటనలో ఉన్న మోదీ న్యూయార్క్ లో బుధవారం (భారత
కాలమానం ప్రకారం) జరిగిన కార్యక్రమంలో ఈ అత్యుత్తమ అవార్డును బిల్ గేట్స్ చేతుల
మీదుగా అందుకున్నారు. దేశంలో `స్వచ్ఛ భారత్ అభియాన్` కార్యక్రమాన్ని 2014లో మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్ 2న కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. బాపూజీ 150వ
జయంత్యుత్సవాలు జరుగుతున్న సంవత్సరంలో ఈ అవార్డు లభించడం తనకు వ్యక్తిగతంగా ఎంతో విలువయిందంటూ
మోదీ సంతోషం వ్యక్తం చేశారు. 130 కోట్ల మంది భారతీయులు స్వచ్ఛభారత్ లో పాల్గొంటూ
ఎటువంటి అవరోధాన్నైనా ఎదుర్కోడానికి సిద్ధమని ప్రతిజ్ఞ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో
పాల్గొంటున్న అందరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు మోదీ ప్రకటించారు. గడిచిన అయిదేళ్లలో 11 కోట్ల మరుగుదొడ్లను గ్రామగ్రామాన
నిర్మించినట్లు తెలిపారు. ప్రజాఉద్యమంగా కొనసాగుతున్న శుభ్రత కార్యక్రమాల వల్ల
సుమారు 3 లక్షల మంది ప్రాణాల్ని రక్షించుకోగలిగామన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లు.హెచ్.ఒ)
ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు చెప్పారు. బిల్ అండ్ మెలిండ గేట్స్ ఫౌండేషన్ కూడా
భారత్ లో గ్రామీణ పారిశుద్ధ్యం ఎంతో మెరుగుపడినట్లు పేర్కొందన్నారు. గాంధీజీ కలలు
గన్న పరిశుభ్రత సాకరమయినందుకు ఆనందంగా ఉందని మోదీ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం
కేవలం భారతీయుల జీవన ప్రమాణాల్ని మాత్రమే కాక ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన యావత్ మానవాళి
జీవనప్రమాణాల పెంపునకు దోహదం చేసేదన్నారు. వసుదైక కుటుంబ (The whole world is one single family) తత్వం విశ్వవ్యాప్తం కావాలనే ఆకాంక్షను ఈ సందర్భంగా
మోదీ పునరుద్ఘాటించారు.