Wednesday, September 18, 2019

Ghulam Nabi Azad, Ahmed Patel meet Chidambaram in Tihar jail


చిదంబరాన్ని తీహార్ జైలుకు వెళ్లి కలిసిన గులాంనబీ, అహ్మద్ పటేల్
తీహార్ జైలులో ఉన్న మాజీ మంత్రి చిదంబరాన్ని బుధవారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు గులాంనబీ అజాద్, అహ్మద్ పటేల్, చిదంబరం తనయుడు కార్తీలు కలిశారు. ఐ.ఎన్.ఎక్స్. మీడియా ముడుపుల కేసులో చిదంబరం అరెస్టయి సెప్టెంబర్ 5 నుంచి తీహార్ జైలులో ఉన్నారు. సోమవారమే చిదంబరం 74వ పుట్టినరోజు జరుపుకున్నారు. చిదంబరం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని జైలు ప్రధాన ఆవరణలో ఆయనను కలిసినట్లు గులాంనబీ తెలిపారు. అర్ధగంట సేపు చిదంబరంతో భేటీ అయిన కాంగ్రెస్ నేతలు గులాంనబీ అజాద్, అహ్మద్ పటేల్ లు తాజా రాజకీయ పరిణామాల్ని ఆయనతో చర్చించారు. దేశ ఆర్థిక పరిస్థితులు, రానున్న ఆయా రాష్ట్రాల ఎన్నికలు, జమ్ముకశ్మీర్ లో ప్రస్తుత పరిమాణాలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుల త్రయం చర్చించినట్లు తెలుస్తోంది.


Tuesday, September 17, 2019

Air-To- Air Missile Astra succesfully test fires in the odisha coast


అస్త్రా క్షిపణి ప్రయోగ పరీక్ష విజయవంతం
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణ పరిశోధనా సంస్థ (డీఆర్డీవో) రూపొందించిన గగనతలం నుంచి గగనతలంలో లక్ష్యాల్ని ఛేదించే అస్త్రా క్షిపణి ప్రయోగ పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని బంగాళాఖాతంపై సుఖోయ్-30 ఎం.కె.ఐ. యుద్ధ విమానం నుంచి మంగళవారం ఈ పరీక్షను భారత సైన్యం విజయవంతంగా పూర్తి చేసింది. నిరంతరం నిర్వహించే పరీక్షల్లో భాగంగా ఈరోజు అస్త్రా క్షిపణి ప్రయోగాన్ని చేపట్టారు. వివిధ రాడార్లు, ఎలక్ట్రో ట్రాకింగ్ వ్యవస్థ, సెన్సార్ల నుంచి అందిన సమాచారం ప్రకారం అస్త్రా లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించినట్లు భారత సైనికాధికారులు ధ్రువీకరించారు. అవసరాలకు అనుగుణంగా అస్త్రాను ప్రయోగించొచ్చన్నారు. మధ్యంతర, సుదీర్ఘ శ్రేణిలోని లక్ష్యాల్ని ఈ క్షిపణి ఛేదించగలదని పేర్కొన్నారు.

Monday, September 16, 2019

AP CM YSJagan arial survey at kachuluru


లాంచీ మునిగిన కచ్చులూరు ప్రాంతంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే
గోదావరి లాంచీ మునక ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఉదయం ఏరియల్ సర్వే నిర్వహించారు. దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన లాంచీ దుర్ఘటన లో 12 మంది మృతదేహాల్ని వెలికితీశారు. ఆదివారం 8, సోమవారం మరో నాలుగు మృతదేహాల్ని వెలికితీసి రాజమండ్రి  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రంపచోడవరం, రాజమండ్రి ప్రభుత్వాసుపత్రుల్లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. మునిగిపోయిన లాంచీ, అందులో చిక్కుకుపోయిన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ బృందాలు దుర్ఘటన ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. రెండు హెలికాప్టర్లలో ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నాయి. ఈ దుర్ఘటనలో 34 మంది గల్లంతైనట్లు భావిస్తున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దుర్ఘటనా స్థలానికి వెళ్లారు. లాంచీ ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతంలో కొనసాగుతున్న సహాయక రక్షణ చర్యలను ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. సీఎం జగన్‌  వెంట ఏపీ హోంమంత్రి సుచరిత, నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ తదితరులు ఉన్నారు. అనంతరం జగన్ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ప్రమాద బాధితులను పరామర్శించారు. బోటు ప్రమాదానికి గల కారణాలను అధికారుల్నిఅడిగి తెలుసుకున్నారు. బాధితులు ఒక్కొక్కరి వద్దకు వెళ్లి యోగ క్షేమాలు కనుక్కున్నారు. బాధితులకు అందుతున్న చికిత్స గురించి సీఎం జగన్ వైద్యుల్ని ఆరా తీశారు. ప్రమాదంలో మరణించిన వారికి ఏపీ సర్కారు ఆదివారమే రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. తెలంగాణ సీఎం కె.సి.ఆర్. రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

Sunday, September 15, 2019

Microsoft CEO Satya Nadella Arrives In Hyderabad To Perform Father's Funeral


తండ్రి అంత్యక్రియల కోసం హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ల
మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) సత్య నాదెళ్ల శనివారం మధ్యరాత్రి  హైదరాబాద్ వచ్చారు. ఆయన తండ్రి ప్రఖ్యాత మాజీ ఐఏఎస్ అధికారి యుగంధర్ అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రత్యేక విమానంలో లండన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. పీవీ నరసింహారావు హయాంలో పీఎంఓలో యుగంధర్ సెక్రటరీగా పనిచేశారు. 1962 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆయన 2004_2009 వరకు ప్రణాళికా సంఘం సభ్యునిగా విధులు నిర్వర్తించారు. ముస్సోరిలోని లాల్ బహుదూర్ శాస్త్రి ఎన్.ఎ.ఎ. అకాడెమీ డైరెక్టర్ గా (1988_93) బాధ్యతలు వహించారు. ఐఏఎస్ అధికారిగా పలు కీలక బాధ్యతలు చేపట్టిన యుగంధర్(82) ఈనెల13న పరమపదించిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఆదివారం జుబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో నిర్వహించారు.