Monday, September 9, 2019

ISRO more serious about fake accounts in social media on behalf of chairman Sivan


ఇస్రో చైర్మన్ శివన్ పేరిట సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ కె.శివన్ పేరిట సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు హల్ చల్ చేస్తున్నాయి. దాంతో సోమవారం ఇస్రో రంగంలోకి దిగి ఆయనకు సోషల్ మీడియాలో ఎటువంటి వ్యక్తిగత ఖాతా లేదని ప్రకటించింది. ఈ మేరకు ఇస్రో ట్వీట్ చేస్తూ `కైలాస్వాదివు శివన్` పేరిట సోషల్ మీడియాలో చాలా ఖాతాలు నడుస్తున్నట్లు గుర్తించామని పేర్కొంది. ఈ ఖాతాల నుంచి చంద్రయాన్-2 సమాచారం అంటూ అసత్యాలు వెలువడుతున్నాయని వాటిని నమ్మొద్దని కోరింది. చైర్మన్ డాక్టర్ కె. శివన్ కు సోషల్ మీడియాలో వ్యక్తిగత ఖాతా ఒక్కటీ లేదని ఇస్రో ఆ ట్వీట్ లో స్పష్టం చేసింది. చైర్మన్ పేరిట నకిలీ ఖాతాల నుంచి వెల్లడవుతున్న సమాచారం ప్రామాణికం కాదని గమనించాలని కోరింది. ఎట్టి పరిస్థితిలో అబద్ధపు ప్రచారాన్ని నమ్మరాదని ఇస్రో హెచ్చరించింది. చంద్రయాన్-2 మిషన్, చంద్రునిపై లాండర్ విక్రమ్ స్థితిగతులకు సంబంధించిన ఏదైనా నవీకరణ ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే ఇవ్వనున్నట్లు ప్రకటించింది.


Sunday, September 8, 2019

Prez, V-Prez, PM, Sonia mourn Jethmalni`s demise


రాంజెఠ్మలానీ మృతికి రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి, ప్రధాని,సోనియా సంతాపం
ప్రముఖ న్యాయవాది, మాజీ కేంద్ర మంత్రి రాంజెఠ్మలానీ (95) మృతికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సంతాపం వెలిబుచ్చారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాంజెఠ్మలానీ ఆదివారం ఉదయం 7.45కు న్యూఢిల్లీలోని నివాసగృహంలో మరణించినట్లు ఆయన తనయుడు సుప్రీంకోర్టు న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ తెలిపారు. స్వతంత్ర భావాలు మెండుగా గల రాంజెఠ్మలానీ దేశంలోని పలు కీలక కేసులను వాదించి పేరుగడించారు. ముఖ్యంగా నేర సంబంధ వ్యాజ్యాల్ని వాదించడంలో దిట్ట. హత్య కేసులో ఇరుక్కున్న కె.ఎం.నానావతి (నేవీలో నిజాయతీ గల అధికారి)  తరఫున వాదనల్లో పాల్గొనడం ద్వారా రామ్ జెఠ్మలానీ ప్రముఖ క్రిమినల్ లాయర్ గా ఖ్యాతి పొందారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సీఎంత్రివేది, వై.వి.చంద్రచూడ్ లకు సహాయకునిగా వ్యవహరించారు. ఈ కేసు క్రాస్ ఎగ్జామినేషన్ లో రామ్ జెఠ్మలానీ తనదైన ముద్ర వేశారు. వృత్తి పరంగా వివాదాస్పద వ్యక్తుల కేసులు వాదించి విమర్శల్ని ఎదుర్కొన్నారు. ఇందిరా, రాజీవ్ గాంధీ హంతకులు తరఫున, భారత పార్లమెంట్ పై దాడి కేసులో ఉరిశిక్ష పడిన అఫ్జల్ గురు పక్షాన కేసులు వాదించారు. అవినీతిపై పోరాడతానంటూ ఆయన 94వ ఏట న్యాయవ్యాది వృత్తి నుంచి పదవీ విరమణ ప్రకటించారు. దేశ విభజన కు ముందు సింధ్ ప్రాంతంలో జన్మించిన జెఠ్మలానీ 17 ఏళ్లకే న్యాయశాస్త్ర పట్టా పొందారు. కరాచీలో న్యాయవాది వృత్తి కొనసాగించారు. 18వ ఏట దుర్గా అనే మహిళను వివాహం చేసుకున్నారు. వారికి రాణి, శోభ, మహేశ్ సంతానం. రాణి కొద్ది కాలం క్రితమే మరణించారు. శోభ అమెరికాలో ఉంటున్నారు. దేశ విభజన జరిగిన ఏడాదికి ఆయన కుటుంబంతో ముంబయి వలసవచ్చారు. అప్పుడే  రత్న అనే మరో మహిళను రెండో వివాహం చేసుకున్నారు. వారికి జనక్ అనే కొడుకు ఉన్నాడు. రాజకీయాల్లోనూ ఆయన చురుగ్గా పాల్గొన్నారు. జనతాదళ్, బీజేపీల్లో పనిచేశారు. లోక్ సభకు రెండుసార్లు, ఓసారి  రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2010లో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. వాజ్ పేయి హయాంలో న్యాయ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా వ్యవహరించారు.

Saturday, September 7, 2019

Those who try, never give up: isro chairman Sivan


విజయం దిశగా ఇస్రో ప్రయత్నాలు కొనసాగుతాయి: చైర్మన్ శివన్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగాలు యథావిధిగా కొనసాగుతాయని చైర్మన్ కె.శివన్ పేర్కొన్నారు. `విక్రమ్` ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువప్రాంతంలో మూగబోయిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు  ట్వీట్ చేశారు. ఈ ప్రయోగ ఫలితం వెల్లడయిన అనంతరం యావత్ భారత జాతి ఇస్రోకు బాసటగా నిలిచి ప్రోత్సహించింది. బాధను దిగమింగుకున్న చైర్మన్ శివన్ వరుస ట్వీట్లతో ఇస్రో సహచరుల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు. `విజయం అంతిమమైనది కాదు, అపజయం ప్రాణాంతకం కాదు: ప్రయత్నం అనేది ఆ గణనల్ని కొనసాగించే ఓ ధైర్యం` (Success is not final, failure is not fatal: it is the courage to continue that counts) అన్న బ్రిటన్ మాజీ ప్రధాని సర్ విన్ స్టన్ చర్చిల్ ప్రఖ్యాత సూక్తిని ఉటంకిస్తూ శివన్ ట్వీట్ చేశారు. అదే విధంగా ఇస్రో తదుపరి ప్రయోగాలు ఆదిత్య ఎల్-1, గగన్ యాన్, మంగల్యాన్-2, చంద్రయాన్-3 ప్రయోగాలు వరుసగా చేపట్టనున్నామని ప్రయత్నాన్ని విడిచిపెట్టబోమని తెలిపారు. ఇస్రో జులై 22న శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి ప్రయోగించిన చంద్రయాన్-2 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. అయితే చంద్రయాన్-2 ప్రయోగంలో అత్యంత కీలకమైన విక్రమ్ ల్యాండర్ శుక్రవారం మధ్యరాత్రి చంద్ర గ్రహ దక్షిణ ధ్రువ ప్రాంతంలో దిగాల్సి ఉన్న క్రమంలో స్తబ్ధుగా మారిపోయింది. సంక్లిష్టమైన దక్షిణ ధ్రువప్రాంతంలో మరో 2.1 కిలోమీటర్ల దూరాన్న సురక్షితంగా దిగాల్సిన దశలో `విక్రమ్` నుంచి మిషన్ కంట్రోల్ రూంకు సందేశాలు ఆగిపోయాయి. క్రాష్ ల్యాండింగ్ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

Friday, September 6, 2019

Fire at New Delhi railway station in Kerala bound train


ఢిల్లీ రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం
ఢిల్లీ రైల్వేస్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కేరళ ఎక్స్ ప్రెస్ రైలు బోగిలో అగ్నికీలలు వ్యాపించడంతో స్టేషన్ లో కలకలం రేగింది. కేరళకు బయలుదేరిన చండీగఢ్-కొచువల్లి (నం.12218) ఎక్స్ ప్రెస్ విద్యుత్ సరఫరాకు సంబంధించిన (పవర్ కార్) బోగిలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని సమాచారం. అయితే ఒకరు గాయపడినట్లు ఉత్తర రైల్వే అధికార ప్రతినిధి దీపక్ కుమార్ తెలిపారు. ప్లాట్ ఫారం నం.8 నుంచి రైలు కదిలిన కొద్ది క్షణాల్లోనే ఉవ్వెత్తున మంటలు ఎగసిపడినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం 1.40 కి చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. 12 అగ్నిమాపక శకటాలు ప్లాట్ ఫారంపైకి చేరుకుని బోగిలో చెలరేగిన మంటల్ని ఆర్పివేసినట్లు అగ్నిమాపక శాఖాధికారి ఒకరు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరావాల్సి ఉంది. ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.