Sunday, September 8, 2019

Prez, V-Prez, PM, Sonia mourn Jethmalni`s demise


రాంజెఠ్మలానీ మృతికి రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి, ప్రధాని,సోనియా సంతాపం
ప్రముఖ న్యాయవాది, మాజీ కేంద్ర మంత్రి రాంజెఠ్మలానీ (95) మృతికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సంతాపం వెలిబుచ్చారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాంజెఠ్మలానీ ఆదివారం ఉదయం 7.45కు న్యూఢిల్లీలోని నివాసగృహంలో మరణించినట్లు ఆయన తనయుడు సుప్రీంకోర్టు న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ తెలిపారు. స్వతంత్ర భావాలు మెండుగా గల రాంజెఠ్మలానీ దేశంలోని పలు కీలక కేసులను వాదించి పేరుగడించారు. ముఖ్యంగా నేర సంబంధ వ్యాజ్యాల్ని వాదించడంలో దిట్ట. హత్య కేసులో ఇరుక్కున్న కె.ఎం.నానావతి (నేవీలో నిజాయతీ గల అధికారి)  తరఫున వాదనల్లో పాల్గొనడం ద్వారా రామ్ జెఠ్మలానీ ప్రముఖ క్రిమినల్ లాయర్ గా ఖ్యాతి పొందారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సీఎంత్రివేది, వై.వి.చంద్రచూడ్ లకు సహాయకునిగా వ్యవహరించారు. ఈ కేసు క్రాస్ ఎగ్జామినేషన్ లో రామ్ జెఠ్మలానీ తనదైన ముద్ర వేశారు. వృత్తి పరంగా వివాదాస్పద వ్యక్తుల కేసులు వాదించి విమర్శల్ని ఎదుర్కొన్నారు. ఇందిరా, రాజీవ్ గాంధీ హంతకులు తరఫున, భారత పార్లమెంట్ పై దాడి కేసులో ఉరిశిక్ష పడిన అఫ్జల్ గురు పక్షాన కేసులు వాదించారు. అవినీతిపై పోరాడతానంటూ ఆయన 94వ ఏట న్యాయవ్యాది వృత్తి నుంచి పదవీ విరమణ ప్రకటించారు. దేశ విభజన కు ముందు సింధ్ ప్రాంతంలో జన్మించిన జెఠ్మలానీ 17 ఏళ్లకే న్యాయశాస్త్ర పట్టా పొందారు. కరాచీలో న్యాయవాది వృత్తి కొనసాగించారు. 18వ ఏట దుర్గా అనే మహిళను వివాహం చేసుకున్నారు. వారికి రాణి, శోభ, మహేశ్ సంతానం. రాణి కొద్ది కాలం క్రితమే మరణించారు. శోభ అమెరికాలో ఉంటున్నారు. దేశ విభజన జరిగిన ఏడాదికి ఆయన కుటుంబంతో ముంబయి వలసవచ్చారు. అప్పుడే  రత్న అనే మరో మహిళను రెండో వివాహం చేసుకున్నారు. వారికి జనక్ అనే కొడుకు ఉన్నాడు. రాజకీయాల్లోనూ ఆయన చురుగ్గా పాల్గొన్నారు. జనతాదళ్, బీజేపీల్లో పనిచేశారు. లోక్ సభకు రెండుసార్లు, ఓసారి  రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2010లో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. వాజ్ పేయి హయాంలో న్యాయ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా వ్యవహరించారు.

No comments:

Post a Comment