కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టు జడ్జిగా షిరీన్ మాథ్యూస్
నియామకం
ఇండో అమెరికన్ షిరీన్ మాథ్యూస్ కాలిఫోర్నియా ఫెడరల్
కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కార్యాలయం
(వైట్ హౌస్) ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ఫెడరల్ కోర్టు జడ్జిగా నియమితులైన ఇండో అమెరికన్లలో
ఆమె ఆరోవారు. దక్షిణాది రాష్ట్రమైన కాలిఫోర్నియాలోని శాన్ డియోగోలో గల ఫెడరల్
కోర్టులో ఆమె జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇందుకు సెనెట్ ఆమోదముద్ర
పడాల్సి ఉంది. ఆమె నియామకంతో న్యాయస్థానంలో సమర్థంగా దక్షిణాసియా గొంతు
వినిపించగలదనే ఆశాభావాన్ని దక్షిణాసియా బార్ అసోసియేషన్ (ఎస్.ఎ.బి.ఎ-నార్త్ అమెరికా) అధ్యక్షుడు అనీశ్ మెహతా వ్యక్తం
చేశారు. ప్రభుత్వ, ప్రయివేటు న్యాయవాదిగా షిరీన్ రాణించారని
కాలిఫోర్నియా కోర్టు ధర్మాసనంలోనూ ఆమె తనదైన ముద్ర వేయగలరని ఎన్.ఎ.పి.ఎ.బి.ఎ. అధ్యక్షులు
డేనియల్ సాకాగుచి ఆకాంక్షించారు. జార్జిటౌన్
యూనివర్సిటీ లో ఆర్ట్స్ డిగ్రీ చేసిన షిరీన్ న్యాయశాస్త్ర పట్టాను డ్యూక్ వర్సిటీ నుంచి
పొందారు. ఆమె 2008 నుంచి 2013 వరకు కాలిఫోర్నియా కోర్టులో అసిస్టెంట్ క్రిమినల్ లాయర్ గా విధులు నిర్వహించారు. అంతకుముందు షిరీన్ శాన్
డియోగోలోని లాథమ్ అండ్ వాట్కిన్స్ (ఎల్.ఎల్.పి) అసోసియేట్ గా బాధ్యతలు వహించారు. న్యాయశాస్త్ర పట్టా పొందిన తొలిరోజుల్లో ఆమె కాలిఫోర్నియా కోర్టు జడ్జి ఇర్మాఈ గోంజలెజ్ వద్ద క్లర్క్ గా పనిచేశారు. అంచెలంచెలుగా న్యాయశాస్త్రాన్ని అవపోశన పట్టిన ఆమె అవినీతి కేసుల్ని
వాదించడంలో దిట్టగా రాణించారు. క్రిమినల్ కేసుల్లోనూ సమర్ధురాలైన న్యాయవాదిగా పేరొందారు.
ప్రతిష్టాత్మక న్యాయ సంస్థ `జోన్స్ డే` భాగస్వామి అయిన షిరీన్ వైద్య పరికరాల భారీ చోరీ
కేసును వాదించి విజయం సాధించారు.