Saturday, August 31, 2019

Final NRC out in Assam, nearly 2 million stare at uncertain future


అసోం లో ఎన్.ఆర్.సి. తుది జాబితా తకరారు
 ·    అనర్హులుగా 19 లక్షల మంది


అసోంలో జాతీయ పౌర పట్టి (ఎన్.ఆర్.సి) తుది జాబితాను శనివారం విడుదల చేశారు. జాతీయ పౌరసత్వ నమోదుకు మొత్తం 3,30,27,661 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 3,11,21,004 మంది ధ్రువీకరణ పొందారు. మరో 19,06,657 మంది దరఖాస్తులు తిరస్కరణకు గురికావడంతో వారంతా విదేశీయులుగా పరిగణనలోకి రానున్నారు. అయితే ప్రభుత్వం వారిపై ఇప్పటికిప్పుడు చర్యలేవీ ఉండవని హామీ ఇస్తోంది. వారికి నాలుగు నెలలు గడువు ఇవ్వనున్నారు. న్యాయస్థానాల్లో తమ భారత పౌరసత్వం గురించి వారు కేసులు దాఖలు చేసుకోవచ్చు. అందుకయ్యే న్యాయసేవా ఖర్చును ప్రభుత్వం భరించనున్నట్లు పేర్కొంది. ఆల్ అసోం స్టూడింట్స్ యూనియన్ (ఆసు) తుది జాబితాపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఎన్.ఆర్.సి. లోని అవకతవకలపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆసు ప్రధానకార్యదర్శి లురింజ్యోతి గొగొయ్ చెప్పారు. 1971లో బంగ్లాదేశ్ నుంచి వలసవచ్చి భారత్ లో నివసిస్తున్న శరణార్థుల ధ్రువపత్రాల్ని ఎన్.ఆర్.సి. అధికారులు తిరస్కరించడం వివాదం రేపుతోంది. మరోవైపు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా దేశంలోకి వచ్చి ఉంటున్న వారి పౌరసత్వాన్ని అధికారులు ధ్రువీకరించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దశాబ్దాలుగా ఇక్కడే నివసిస్తున్న భారతీయుల్ని అనర్హులుగా పరిగణించడంపై పెద్దఎత్తున ఆరోపణల సెగరేగుతోంది. ఈ తుది జాబితాపై తాము ఏమాత్రం సంతోషంగా లేమని బీజేపీ మాజీ ఎంపీ  మంగల్దోయ్ వ్యాఖ్యానించారు. ఎన్.ఆర్.సి. విడుదల నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని 10 జన్ పథ్ నివాసానికి వెళ్లి పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు కలుసుకున్నారు. ఈ విషయంలో కేంద్రం విఫలమైందని సమావేశంలో ఏకే అంటోనీ, గౌరవ్ గొగొయ్, గులాంనబీ అజాద్, లోక్ సభ పక్ష నేత అధిర్ రంజిన్ చౌధురి వ్యాఖ్యానించినట్లు సమాచారం. అనంతరం అధిర్ విలేకర్లతో మాట్లాడుతూ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ వ్యాఖ్యలపై వ్యంగ్యోక్తులు విసిరారు. దేశంలో తమ పార్టీ అధికారంలో ఉండబట్టే ఎన్.ఆర్.సి. నిర్వహించగల్గుతున్నామన్న తివారీ వ్యాఖ్యల్ని ఉద్దేశిస్తూ పార్లమెంట్ లోనూ ఎన్.ఆర్.సి. నిర్వహిస్తారా అని అధీర్ ఎద్దేవా చేశారు.  తనూ బయట నుంచే వచ్చానంటూ తన తండ్రి బంగ్లాదేశ్ లో ఉండేవారని గుర్తు చేశారు. నిజమైన పౌరుల్ని దేశం నుంచి బహిష్కరించరాదని వారందరికీ రక్షణ కల్పించాలని అధీర్ హితవు చెప్పారు. మరో వంక అసోంలో అల్లర్లు చెలరేగకుండా 144వ సెక్షన్ విధించారు.



No comments:

Post a Comment