Sunday, September 1, 2019

Indian American shireen Mathews nominated as federal judge


కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టు జడ్జిగా షిరీన్ మాథ్యూస్ నియామకం
ఇండో అమెరికన్ షిరీన్ మాథ్యూస్ కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కార్యాలయం (వైట్ హౌస్) ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ఫెడరల్ కోర్టు జడ్జిగా నియమితులైన ఇండో అమెరికన్లలో ఆమె ఆరోవారు. దక్షిణాది రాష్ట్రమైన కాలిఫోర్నియాలోని శాన్ డియోగోలో గల ఫెడరల్ కోర్టులో ఆమె జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇందుకు సెనెట్ ఆమోదముద్ర పడాల్సి ఉంది. ఆమె నియామకంతో న్యాయస్థానంలో సమర్థంగా దక్షిణాసియా గొంతు వినిపించగలదనే ఆశాభావాన్ని దక్షిణాసియా బార్ అసోసియేషన్ (ఎస్.ఎ.బి.ఎ-నార్త్ అమెరికా) అధ్యక్షుడు అనీశ్ మెహతా వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రయివేటు న్యాయవాదిగా షిరీన్ రాణించారని కాలిఫోర్నియా కోర్టు ధర్మాసనంలోనూ ఆమె తనదైన ముద్ర వేయగలరని ఎన్.ఎ.పి.ఎ.బి.ఎ. అధ్యక్షులు డేనియల్ సాకాగుచి ఆకాంక్షించారు.  జార్జిటౌన్ యూనివర్సిటీ లో ఆర్ట్స్ డిగ్రీ చేసిన షిరీన్ న్యాయశాస్త్ర పట్టాను డ్యూక్ వర్సిటీ నుంచి పొందారు. ఆమె 2008 నుంచి 2013 వరకు కాలిఫోర్నియా కోర్టులో అసిస్టెంట్ క్రిమినల్ లాయర్ గా విధులు నిర్వహించారు. అంతకుముందు షిరీన్ శాన్ డియోగోలోని లాథమ్ అండ్ వాట్కిన్స్ (ఎల్.ఎల్.పి) అసోసియేట్ గా బాధ్యతలు వహించారు. న్యాయశాస్త్ర పట్టా పొందిన తొలిరోజుల్లో ఆమె కాలిఫోర్నియా కోర్టు జడ్జి ఇర్మాఈ గోంజలెజ్ వద్ద క్లర్క్ గా పనిచేశారు. అంచెలంచెలుగా న్యాయశాస్త్రాన్ని అవపోశన పట్టిన ఆమె అవినీతి కేసుల్ని వాదించడంలో దిట్టగా రాణించారు. క్రిమినల్ కేసుల్లోనూ సమర్ధురాలైన న్యాయవాదిగా పేరొందారు. ప్రతిష్టాత్మక న్యాయ సంస్థ `జోన్స్ డే` భాగస్వామి అయిన షిరీన్ వైద్య పరికరాల భారీ చోరీ కేసును వాదించి విజయం సాధించారు.

Saturday, August 31, 2019

Final NRC out in Assam, nearly 2 million stare at uncertain future


అసోం లో ఎన్.ఆర్.సి. తుది జాబితా తకరారు
 ·    అనర్హులుగా 19 లక్షల మంది


అసోంలో జాతీయ పౌర పట్టి (ఎన్.ఆర్.సి) తుది జాబితాను శనివారం విడుదల చేశారు. జాతీయ పౌరసత్వ నమోదుకు మొత్తం 3,30,27,661 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 3,11,21,004 మంది ధ్రువీకరణ పొందారు. మరో 19,06,657 మంది దరఖాస్తులు తిరస్కరణకు గురికావడంతో వారంతా విదేశీయులుగా పరిగణనలోకి రానున్నారు. అయితే ప్రభుత్వం వారిపై ఇప్పటికిప్పుడు చర్యలేవీ ఉండవని హామీ ఇస్తోంది. వారికి నాలుగు నెలలు గడువు ఇవ్వనున్నారు. న్యాయస్థానాల్లో తమ భారత పౌరసత్వం గురించి వారు కేసులు దాఖలు చేసుకోవచ్చు. అందుకయ్యే న్యాయసేవా ఖర్చును ప్రభుత్వం భరించనున్నట్లు పేర్కొంది. ఆల్ అసోం స్టూడింట్స్ యూనియన్ (ఆసు) తుది జాబితాపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఎన్.ఆర్.సి. లోని అవకతవకలపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆసు ప్రధానకార్యదర్శి లురింజ్యోతి గొగొయ్ చెప్పారు. 1971లో బంగ్లాదేశ్ నుంచి వలసవచ్చి భారత్ లో నివసిస్తున్న శరణార్థుల ధ్రువపత్రాల్ని ఎన్.ఆర్.సి. అధికారులు తిరస్కరించడం వివాదం రేపుతోంది. మరోవైపు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా దేశంలోకి వచ్చి ఉంటున్న వారి పౌరసత్వాన్ని అధికారులు ధ్రువీకరించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దశాబ్దాలుగా ఇక్కడే నివసిస్తున్న భారతీయుల్ని అనర్హులుగా పరిగణించడంపై పెద్దఎత్తున ఆరోపణల సెగరేగుతోంది. ఈ తుది జాబితాపై తాము ఏమాత్రం సంతోషంగా లేమని బీజేపీ మాజీ ఎంపీ  మంగల్దోయ్ వ్యాఖ్యానించారు. ఎన్.ఆర్.సి. విడుదల నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని 10 జన్ పథ్ నివాసానికి వెళ్లి పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు కలుసుకున్నారు. ఈ విషయంలో కేంద్రం విఫలమైందని సమావేశంలో ఏకే అంటోనీ, గౌరవ్ గొగొయ్, గులాంనబీ అజాద్, లోక్ సభ పక్ష నేత అధిర్ రంజిన్ చౌధురి వ్యాఖ్యానించినట్లు సమాచారం. అనంతరం అధిర్ విలేకర్లతో మాట్లాడుతూ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ వ్యాఖ్యలపై వ్యంగ్యోక్తులు విసిరారు. దేశంలో తమ పార్టీ అధికారంలో ఉండబట్టే ఎన్.ఆర్.సి. నిర్వహించగల్గుతున్నామన్న తివారీ వ్యాఖ్యల్ని ఉద్దేశిస్తూ పార్లమెంట్ లోనూ ఎన్.ఆర్.సి. నిర్వహిస్తారా అని అధీర్ ఎద్దేవా చేశారు.  తనూ బయట నుంచే వచ్చానంటూ తన తండ్రి బంగ్లాదేశ్ లో ఉండేవారని గుర్తు చేశారు. నిజమైన పౌరుల్ని దేశం నుంచి బహిష్కరించరాదని వారందరికీ రక్షణ కల్పించాలని అధీర్ హితవు చెప్పారు. మరో వంక అసోంలో అల్లర్లు చెలరేగకుండా 144వ సెక్షన్ విధించారు.



Friday, August 30, 2019

India pays in advance for S-400 missiles to Russia


2023లో భారత సైన్యం చేతికి రష్యా ఎస్-400 క్షిపణులు
రష్యాతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఎస్-400 గగనతల రక్షణ క్షిపణులు 2023లో భారత సైన్యం చేతికి అందనున్నాయి. ఈ మేరకు రష్యాకు భారత్ ముందస్తు మొత్తాన్ని (బయానా) చెల్లించింది. భూఉపరితలం నుంచి గగనతలంలో శత్రుదుర్భేద్య మధ్యశ్రేణి రక్షణ వ్యవస్థ (ఎస్-400) నిర్ణీత గడువులో భారత సైన్యం అమ్ములపొదిలో చేరనుంది. ఇందుకు సంబంధించి భారత్ తో అన్ని అంశాలు పరిష్కృతమై ఒప్పందంపై సంతకాలు జరిగినట్లు రష్యా ఫెడరల్ సర్వీసెస్ మిలటరీ అండ్ టెక్నికల్ కార్పొరేషన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ వార్తను భారత్ లోని రష్యా రాయబార వ్యవహారాల మంత్రి రోమన్ బబుష్కిన్ ధ్రువీకరించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ రానున్న నాల్గేళ్లలో ఈ  ఎస్-400  క్షిపణి రక్షణ వ్యవస్థ (మొబైల్ సర్ఫేస్ టు ఎయిర్/ యాంటీ బాలిస్టిక్ మిస్సైల్ సిస్టమ్) భారత్ కు అందనున్నట్లు తెలిపారు. భారత్, రష్యాల ఉమ్మడి ప్రయోజనాలు నెరవేర్చడంలో భాగంగా ఒప్పందం ప్రకారం ఈ క్షిపణుల్ని సకాలంలో అందజేయనున్నామన్నారు. రష్యా తయారీ ఎస్-400 క్షిపణికి 600 కి.మీ దూరంలోని లక్ష్యాలను తిప్పికొట్టే సామర్థ్యం ఉంది. రెండంచెల రక్షణ వ్యవస్థ కల్గిన ఈ క్షిపణులు 1990లో రూపుదిద్దుకుని అనేక పరీక్షల అనంతరం 2007లో రష్యా సైన్యం చెంతకు చేరాయి. ప్రపంచంలో ఈ ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థే ప్రస్తుతానికి అత్యంత ఆధునికమైంది. నాటో (ఉత్తర అమెరికా, యూరప్) దేశాల్లో ఈ క్షిపణుల్ని ఎస్.ఎ-21 గ్రోవ్లర్ గా పిలుస్తారు.

Thursday, August 29, 2019

One of the stalwarts of people's telugu movement Gidugu Rama Murthy


అచ్చతెలుగు దివ్య వెలుగు గిడుగు
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికార భాష తెలుగు. తెలుగు మాతృభాషగా మాట్లాడే వారు సుమారు 11 కోట్ల మంది. దేశంలో ప్రాంతీయ భాషలలో మాట్లాడే వారి సంఖ్యలో తెలుగు వారు మొదటి స్థానంలో ఉన్నారు. ప్రపంచంలోనే ప్రజలు అత్యధికంగా మాట్లాడే భాషలలో తెలుగుది 15వ స్థానం. దేశంలో హిందీ తర్వాత స్థానంలో తెలుగు నిలుస్తోంది. `ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్` గా కీర్తి పొందింది. `దేశ భాషలందు తెలుగు లెస్స` అని శ్రీకృష్ణదేవరాయలతో ప్రశంసలు అందుకుంది. అటువంటి తెలుగును సామాన్య జనం వాడుక భాష లో అందరి దరికి చేర్చిన మహానుభావుల్లో గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు ఆద్యులు. తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడాయన. గిడుగు వాడుక భాషా ఉద్యమం వల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు తర్వాత  అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఆయన పుట్టిన రోజైన ఆగస్టు 29 ని `తెలుగు భాషా దినోత్సవం` గా జరుపుకుంటున్నాం.
గిడుగు రామ్మూర్తి పంతులు 1863 లో శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేట అనే గ్రామంలో వీర్రాజు, వెంకమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి వీర్రాజు విష జ్వరంతో మరణించారు. ప్రాథమిక విద్య అనంతరం గిడుగు రామ్మూర్తి పంతులు విజయనగరంలోని మేనమామ గారి ఇంటికి చేరి హైస్కూలు చదువు పూర్తి చేశారు. ఆయనకు 10వ తరగతిలో గురజాడ అప్పారావు గారు సహాధ్యాయి. అనంతరం పర్లాకిమిడి రాజా వారి పాఠశాల్లో 8వ తరగతి చరిత్ర ఉపాధ్యాయుడిగా గిడుగు ఉద్యోగం చేశారు. ఆ తర్వాత ప్రయివేటుగా బి.ఎ. చేశారు. డిగ్రీలో చరిత్రను ముఖ్య పాఠ్యాంశంగా ఎంచుకున్న ఆయన రాష్ట్రంలోనే రెండో ర్యాంక్ సాధించారు.
చదువంటే ఎనలేని మమకారం గల గిడుగు బహుభాషా కోవిధుడు. తెలుగు, ఇంగ్లీష్, సంస్కృతంతో పాటు సవర భాషను పట్టుబట్టి నేర్చుకున్నారు. సవరలు వారి భాషలోనే చదువుకొనేలా ప్రోత్సహించారు. సొంతంగా పాఠశాల ప్రారంభించి ఉపాధ్యాయుల్ని నియమించి వారికి జీతాలు ఇస్తూ సవరలకు చదువు నేర్పారు. వారిని తన ఇంట్లోనే పెట్టుకుని భోజనం పెడుతూ చదువు చెప్పించారు. స్వయంగా ఆయన సవర భాషలో పుస్తకాలు రాశారు. సవర-ఇంగ్లీషు డిక్షనరీ రూపొందించారు. మద్రాస్ ప్రభుత్వం గిడుగు కృషిని గుర్తించి `రావుబహుదూర్` బిరుదుతో పాటు, కైజర్-ఇ-హింద్ అనే స్వర్ణ పతకాన్ని ఇచ్చి గౌరవించింది. ఆనాడే సవరలు, హరిజనులు అంటరాని వారు కాదని వారితో మమేకం అయిన ధీశాలి.
1907లో  ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూళ్ల ఇన్ స్పెక్టర్ గా ఇంగ్లీషు దొర యేట్సు వచ్చారు. ప్రజలు మాట్లాడే భాష, పాఠ్య పుస్తకాల భాష మధ్య తేడాలు ఎందుకు ఉన్నాయని యేట్సుకు సందేహం వచ్చింది. ఆ విధంగా వాడుక భాష ఉద్యమం గురజాడ, గిడుగు, శ్రీనివాస అయ్యంగారు, యేట్సుల ద్వారా ప్రారంభమైంది. జనం మాట్లాడే తెలుగు భాషను గ్రంథ రచనకు అనువుగా చేయడానికి ఎనలేని కృషి చేసిన గిడుగుకు వీరేశలింగం పంతులు ఊతం కూడా లభించింది. 1919లో వాడుక భాషా ఉద్యమ ప్రచారం కోసం 'తెలుగు' అనే మాసపత్రిక నడిపారు. వ్యాసాలు, ఉపన్యాసాలతో అవిశ్రాంతంగా పోరాటం సాగించారు. స్కూలు, కాలేజీ పుస్తకాల్లోని  గ్రాంథికభాషను క్రమంగా వాడుకభాషలోకి తేవడానికి గిడుగు సాగించిన కృషి ఫలించింది. ఆంధ్ర సాహిత్య పరిషత్తు ఆధికారికంగా వాడుక భాషా నిషేధాన్ని ఎత్తివేసింది. తాపీ ధర్మారావు సంపాదకుడిగా ప్రారంభమైన `జనవాణి` అనే పత్రిక వాడుక భాషలోనే వార్తలు, సంపాదకీయాలు రాయటం మొదలుపెట్టింది. వాడుక భాష లో విద్య బోధిస్తేనే ప్రయోజనం ఉంటుందని గిడుగు నిరూపించారు. జనం మాట్లాడే భాష అంతటా వినబడుతూ ఉంటుంది. అదే నిత్య జీవంతో కళకళలాడుతుందని లోకానికి చాటి చెప్పిన మహనీయులు గిడుగు రామ్మూర్తి.  ఆయన 1940 జనవరి 22న రాజమండ్రిలో మరణించారు.