Wednesday, August 28, 2019

J&K administration says more schools to open today; parents worried


కశ్మీర్ లో విద్యార్థుల్లేక బోసిపోతున్న పాఠశాలలు
కశ్మీర్ లోయలో రెండు వారాల అనంతరం పాఠశాలలు తెరుచుకున్నా విద్యార్థులు రాకపోవడంతో తరగతి గదులు బోసిపోతున్నాయి. ఈ నెల 5న కేంద్రప్రభుత్వం జమ్ముకశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని రద్దు చేయడంతో పాటు రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా రాష్ట్రాన్ని విభజించిన నేపథ్యంలో అక్కడ అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కొనసాగింది. పాఠశాలలతో పాటు అన్ని విద్యాలయాలు, వివిధ కార్యాలయాలు రోజుల తరబడి మూసివేశారు. క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొనడంతో జనజీవనం యథావిధిగా కొనసాగుతోంది. దాంతో ప్రాథమిక పాఠశాలల్ని సోమవారం పున: ప్రారంభించారు. బుధవారం నుంచి ఉన్నత పాఠశాలల్ని తెరిచారు. అయితే కశ్మీర్ లోయ ఇంకా భద్రత దళాల జల్లెడలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. దాంతో బాలల్ని పాఠశాలలకు పంపడానికి తల్లిదండ్రులు జంకుతున్నారు. పేరుకే పాఠశాలలు తెరుచుకున్నాయి గానీ విద్యార్థులు లేక తరగతులు ఖాళీగా కనిపిస్తున్నాయి. బుధవారం నాటికి కూడా విద్యార్థుల హాజరుశాతం పెరగలేదని జె.కె. ప్రభుత్వ ప్రతినిధి రోహిత్ కన్సాల్ తెలిపారు. విద్యార్థుల్ని పాఠశాలలకు పంపేలా తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాల్సి ఉందన్నారు. శ్రీనగర్ లో దాదాపు 200 ప్రాథమిక పాఠశాలల్ని పున: ప్రారంభించారు. అత్యధిక స్కూళ్లలో విద్యార్థుల హాజరు శాతం చాలా తక్కువగా నమోదయింది. ఉగ్రవాదులకు అడ్డాగా మారిన దక్షిణ కశ్మీర్ సోపియాన్ లో పదుల సంఖ్యలో పాఠశాలలు తెరిచినా ఒక్క విద్యార్థి కూడా హాజరు కాలేదని కశ్మీర్ పాఠశాల విద్యా సంచాలకులు (డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్) యూనిస్ మాలిక్ తెలిపారు. స్కూళ్లకు పంపి తమ పిల్లల ప్రాణాలతో తల్లిదండ్రులు చెలగాటమాడరు కదా అని బాట్మాలూ జిల్లా కు చెందిన గుల్జార్ అహ్మద్ వ్యాఖ్యానించారు. తన ఇద్దరు పిల్లలు పాఠశాలకు వెళ్తుండగా అల్లర్లు చెలరేగాయన్నారు. దాంతో పరిస్థితి సద్దుమణిగే వరకు వాళ్లను ఇంటి వద్దనే ఉంచినట్లు గుల్జార్ తెలిపారు. కనీసం సెల్ ఫోన్ నెట్ వర్క్స్ పునరుద్ధరించినట్లయితే తమ పిల్లల్ని స్కూళ్లకు పంపగలమని పలువురు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.

Tuesday, August 27, 2019

PM meets PV Sindhu, congratulates her for winning gold at BWF World Championships


ప్రధాని మోదీ, మంత్రి రిజిజుల్ని కలిసిన పీవీ సింధు
స్విట్జర్లాండ్ (బాసెల్)లో ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో బంగారు పతకాన్ని సాధించిన తొలి భారతీయ షట్లర్ గా చరిత్ర సృష్టించిన పీవీ సింధు ప్రధాని మోదీ, క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజుల్ని కలుసుకుంది. కోచ్ లు పి.గోపీచంద్, కిమ్ జి హ్యూన్, తండ్రి పి.వి.రమణలతో కలిసి ఆమె మంగళవారం ప్రధాని మోదీ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ సింధూ సాధించిన ఘనత యావత్ భారతదేశానికి గర్వకారణమన్నారు. అనంతరం ఆయన ట్వీట్ చేస్తూ ప్రపంచ చాంపియన్ షిప్ లో తొలి స్వర్ణాన్ని సాధించడం ద్వారా సింధు దేశానికి కీర్తిని తీసుకువచ్చిందని..ఆమెను కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్ లో ఆమె మరిన్ని విజయాల్ని సాధించాలంటూ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి రిజిజు ఆమెకు ఈ సందర్భంగా రూ.10 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని (చెక్) అందించారు.

Monday, August 26, 2019

Alongside Trump, PM Modi rejects any scope for third party mediation on Kashmir


మోదీపై జోక్ పేల్చిన ట్రంప్
భారత ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సరదాగా ఆటపట్టించారు. ఫ్రాన్స్ పట్టణం బియర్రిట్జ్ లో జరుగుతున్న జి-7 సమావేశాలకు హాజరైన సందర్భంగా మోదీని ఉద్దేశిస్తూ ట్రంప్ జోక్ పేల్చారు. మోదీ ఇంగ్లిష్ చక్కగా మాట్లాడతారు.. కానీ ఇక్కడ మాత్రం ఎందుకో మాట్లాడరంటూ ట్రంప్ చమత్కరించారు. అందుకు మోదీ పెద్దగా నవ్వేస్తూ తన చేతుల్లోకి ట్రంప్ చేయిని తీసుకుని చరిచారు. దాంతో అక్కడున్న వారందరిలో నవ్వులు విరబూశాయి.
కశ్మీర్ సమస్యపై మూడో దేశాన్ని ఇబ్బంది పెట్టం
దీర్ఘకాల అపరిష్కృత సమస్యగా ఉన్న కశ్మీర్ వ్యవహారాన్ని ద్వైపాక్షికంగానే పరిష్కరించుకుంటామని ట్రంప్ తో భేటీ సందర్భంగా మోదీ తేల్చిచెప్పారు. ఈ సమస్య పరిష్కారంలో మూడో దేశాన్ని ఇబ్బంది పెట్టబోమన్నారు.  ట్రంప్ తో కలిసి మోదీ విలేకర్ల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా ట్రంప్ ను కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహించాలని కోరుతూ పాతపాటే పాడారు. అందుకు బదులుగా ట్రంప్ కశ్మీర్ పై మధ్యవర్తిత్వం వహించడానికి తను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. స్పందించిన అమెరికా కాంగ్రెస్ భారత్, పాక్ ల ద్వైపాక్షిక చర్చల ద్వారానే కశ్మీర్ సమస్య పరిష్కరించుకోవాలని వివాదం రేగకుండా సముచిత ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ తో మోదీ కశ్మీర్ సమస్యపై మూడో దేశం జోక్యం అవసరం లేదని నర్మగర్భంగా చెప్పారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో ఆర్టికల్ 370 రద్దు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన అనంతరం పాక్ కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తడానికి యత్నించి భంగపడింది. ఆ క్రమంలో అమెరికా అధ్యక్షుడికి ఫోన్ చేసి మరీ పాక్ ప్రధాని నానాయాగి చేశారు. దాంతో మోదీ సైతం ఇటీవల ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడి కశ్మీర్ భారత అంతర్భాగమని అందులో తాము దేశీయంగా చేపట్టిన చర్యల్ని వివరించారు. సానుకూలంగా స్పందించిన ట్రంప్ వెంటనే ఇమ్రాన్ ఖాన్ కు ఫోన్ చేసి భారత్ ను రెచ్చగొట్టొద్దని హెచ్చరించారు. తాజా భేటీలో ట్రంప్ తో మోదీ మాట్లాడుతూ పాక్ ప్రధానితో కొంతకాలం క్రితం టెలిఫోన్ లో తను సంభాషించినట్లు తెలిపారు. పాక్ లో సమస్యల్ని ఇమ్రాన్ తనతో ఏకరువు పెట్టారన్నారు. ఆ దేశంలోని ప్రజల బాగోగులకు సంబంధించి కూడా భారత్ చేయూత అందిస్తుందని ఇమ్రాన్ కు చెప్పినట్లు మోదీ తెలిపారు.

Sunday, August 25, 2019

Muslims cremate Hindu friend in Assam village


సోదర హిందువుకి దహన సంస్కారాలు నిర్వహించిన ముస్లింలు
అసోంలో మత సామరస్యం మరోసారి వెల్లివిరిసింది. కామరూప్ జిల్లా హిందూముస్లింల సఖ్యతకు అద్దం పట్టింది. ఆదివారం కండికర్ గ్రామంలో ఓ వృద్ధ హిందువుకి దహనసంస్కారాల్ని ముస్లిం సోదరులు నిర్వహించిన ఘటన చోటుచేసుకుంది. 65 ఏళ్ల రాజ్ కుమార్ గౌర్ శనివారం మరణించారు. దాంతో ఏళ్ల తరబడి అక్కడ జీవనం సాగిస్తున్న ఆయనకు స్థానిక ముస్లింలే అంతిమసంస్కారాలు నిర్వహించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఉత్తరప్రదేశ్ నుంచి అసోం వలస వచ్చిన రాజ్ కుమార్ కుటుంబం తొలుత రైల్వే కార్టర్స్ లో నివాసం ఉండేవారు. 1990లో తండ్రి మరణించడంతో రాజ్ కుమార్ క్వార్టర్ ఖాళీ చేయాల్సి వచ్చింది. దాంతో సద్దాం హుస్సేన్ అనే ముస్లిం తన ఇంట్లో ఆయనకు ఆశ్రయం కల్పించారు. రాజ్ కుమార్ ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లయ్యాయి. వారిద్దరూ ముస్లిం యువకుల్నే పెళ్లి చేసుకున్నారు. రాజ్ కుమార్ కూడా దశాబ్దాలుగా ముస్లింలతో మమేకమై జీవనం సాగిస్తున్నారు. ముస్లింల పండుగలు, పెళ్లి వేడుకల్లో రాజ్ కుమార్ పాల్గొంటూ వాళ్ల బంధువుగా మెలిగారు. ఈ నేపథ్యంలో ఆయన చనిపోవడంతో కండికర్ గ్రామ ముస్లింలే దహన సంస్కారాలకు పూనుకున్నారు. అందుకు అవసరమయ్యే సామగ్రి తదితరాల గురించి తమను అడిగి తెలుసుకున్నట్లు పొరుగున గల ఉపెన్ దాస్ గ్రామవాసులు తెలిపారు. ఒక బ్రాహ్మణుడ్ని ఏర్పాటు చేసుకుని వారు అంత్యక్రియలు నిర్వహించారన్నారు. ఇటీవల ఎన్.ఆర్.సి. పున: నమోదు (రీ వెరిఫికేషన్)కు అసోం పశ్చిమ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో తరలివచ్చిన ముస్లింలకు శివసాగర్, చారయిడియో జిల్లాల హిందూ యువకులు ఆశ్రయం కల్పించి ఆదరించిన సంగతి తెలిసిందే.