కశ్మీర్ లో విద్యార్థుల్లేక బోసిపోతున్న పాఠశాలలు
కశ్మీర్ లోయలో రెండు వారాల అనంతరం పాఠశాలలు తెరుచుకున్నా విద్యార్థులు
రాకపోవడంతో తరగతి గదులు బోసిపోతున్నాయి. ఈ నెల 5న కేంద్రప్రభుత్వం జమ్ముకశ్మీర్ కు
స్వయంప్రతిపత్తిని రద్దు చేయడంతో పాటు రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా రాష్ట్రాన్ని
విభజించిన నేపథ్యంలో అక్కడ అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కొనసాగింది. పాఠశాలలతో పాటు
అన్ని విద్యాలయాలు, వివిధ కార్యాలయాలు రోజుల తరబడి మూసివేశారు. క్రమంగా సాధారణ
పరిస్థితులు నెలకొనడంతో జనజీవనం యథావిధిగా కొనసాగుతోంది. దాంతో ప్రాథమిక
పాఠశాలల్ని సోమవారం పున: ప్రారంభించారు. బుధవారం నుంచి ఉన్నత పాఠశాలల్ని తెరిచారు.
అయితే కశ్మీర్ లోయ ఇంకా భద్రత దళాల జల్లెడలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. దాంతో
బాలల్ని పాఠశాలలకు పంపడానికి తల్లిదండ్రులు జంకుతున్నారు. పేరుకే పాఠశాలలు
తెరుచుకున్నాయి గానీ విద్యార్థులు లేక తరగతులు ఖాళీగా కనిపిస్తున్నాయి. బుధవారం
నాటికి కూడా విద్యార్థుల హాజరుశాతం పెరగలేదని జె.కె. ప్రభుత్వ ప్రతినిధి రోహిత్
కన్సాల్ తెలిపారు. విద్యార్థుల్ని పాఠశాలలకు పంపేలా తల్లిదండ్రులకు ధైర్యం
చెప్పాల్సి ఉందన్నారు. శ్రీనగర్ లో దాదాపు 200 ప్రాథమిక పాఠశాలల్ని పున:
ప్రారంభించారు. అత్యధిక స్కూళ్లలో విద్యార్థుల హాజరు శాతం చాలా తక్కువగా నమోదయింది.
ఉగ్రవాదులకు అడ్డాగా మారిన దక్షిణ కశ్మీర్ సోపియాన్ లో పదుల సంఖ్యలో పాఠశాలలు
తెరిచినా ఒక్క విద్యార్థి కూడా హాజరు కాలేదని కశ్మీర్ పాఠశాల
విద్యా సంచాలకులు (డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్) యూనిస్ మాలిక్ తెలిపారు.
స్కూళ్లకు పంపి తమ పిల్లల ప్రాణాలతో తల్లిదండ్రులు చెలగాటమాడరు కదా అని బాట్మాలూ
జిల్లా కు చెందిన గుల్జార్ అహ్మద్ వ్యాఖ్యానించారు. తన ఇద్దరు పిల్లలు పాఠశాలకు
వెళ్తుండగా అల్లర్లు చెలరేగాయన్నారు. దాంతో పరిస్థితి సద్దుమణిగే వరకు వాళ్లను
ఇంటి వద్దనే ఉంచినట్లు గుల్జార్ తెలిపారు. కనీసం సెల్ ఫోన్ నెట్ వర్క్స్ పునరుద్ధరించినట్లయితే తమ పిల్లల్ని స్కూళ్లకు పంపగలమని పలువురు
తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
No comments:
Post a Comment