కర్ణాటకలో మళ్లీ ఫోన్ల ట్యాపింగ్ రగడ
కర్ణాటక
మరో వివాదానికి వేదికయింది. తాజాగా కాంగ్రెస్ నేతలు తమ ఫోన్లు ట్యాప్ అయినట్లు ఆరోపించారు. ముఖ్యమంత్రి కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వ హయాంలో తమ ఫోన్ల ట్యాపింగ్
జరిగినట్లు కాంగ్రెస్ నాయకులు తాజా వివాదానికి తెరతీశారు. ప్రస్తుత సీఎం బి.ఎస్.యడ్యూరప్ప
కాంగ్రెస్ నేతల ఆరోపణలకు స్పందిస్తూ విచారణకు ఆదేశాలిచ్చారు. కాంగ్రెస్ నేతలతో పాటు
సీనియర్ పోలీసు అధికారుల ఫోన్లు ట్యాపింగ్ కు గురైనట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డి.ఎస్.సదానంద గౌడ విలేకర్లతో మాట్లాడుతూ
అనధికారికంగా ఫోన్లను ట్యాప్ చేయడం క్రిమినల్ నేరంగా పేర్కొన్నారు. సమగ్ర విచారణతో
ట్యాపింగ్ దోషుల్ని పట్టుకుని శిక్షించడం జరుగుతుందన్నారు. సదానంద గౌడ స్వల్ప కాలం
రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. బెంగళూర్ ఉత్తర లోక్ సభ నియోజకవర్గం నుంచి
ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నగర అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గ
ప్రజాప్రతినిధులతో సీఎం యడ్యూరప్ప నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన
విలేకర్లతో మాట్లాడారు. సీఎంగా కుమారస్వామి పదవిలో ఉన్నప్పుడు నగరానికి కొత్త కమిషనర్
గా భాస్కర్ రావు నియమితులు కానున్నారంటూ ముందుగానే మీడియాకు విడుదలయిన ఆడియో టేప్ తాజా
టెలిఫోన్ ట్యాపింగ్ ఉదంతానికి కేంద్రబిందువయింది. కమిషనర్ తో పాటు ఇద్దరు ఐ.పి.ఎస్
ఆఫీసర్ల టెలిఫోన్లు ట్యాపింగ్ గురైనట్లు తెలుస్తోంది. ట్యాపింగ్ ఉదంతంపై జాయింట్ కమిషనర్
ఆఫ్ పోలీస్(క్రైం) ఇచ్చిన మధ్యంతర నివేదిక ప్రకారం రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు (ఏప్రిల్ 18,23) ముగిశాక మే,జూన్ ల్లో మొత్తం మూడుసార్లు భాస్కర్ రావు ఫోన్ ట్యాపింగ్ గురైనట్లు
బట్టబయలయింది. కొత్త సీఎం యడ్యూరప్ప బెంగళూర్ సిటీ పోలీస్ కమిషనర్ గా అలోక్ కుమార్
సింగ్ (1994 బ్యాచ్) స్థానంలో భాస్కర్ రావు(1990 బ్యాచ్)ను ఆగస్ట్ 2న నియమించిన సంగతి
తెలిసిందే. కమిషనర్ గా బాధ్యతలు చేపట్టడానికి ముందు భాస్కర్ రావు అడిషనల్ డైరెక్టర్
జనరల్ ఆఫ్ పోలీస్(ఏడీజీపీ) హోదాలో కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్(కె.ఎస్.ఆర్.పి) విధులు
నిర్వహిస్తున్నారు. ఆ సమయంలోనే ఆయన ఫోన్ ట్యాపింగ్ గురైనట్లు నిర్ధారణ అయింది. అలోక్
సింగ్ కమిషనర్ గా కనీసం మూడు నెలలు పనిచేయకుండానే కె.ఎస్.ఆర్.పి.కి బదిలీ అయ్యారు.
ఇదిలా ఉండగా మాజీ ముఖ్యమంత్రి సీఎల్పీ నాయకుడు
సిద్ధరామయ్య ఫోన్ ట్యాపింగ్ ల వ్యవహారం తనకు తెలియదన్నారు.
1988లో
ఇదే తరహా ఫోన్ ట్యాపింగ్ ల వ్యవహారం మెడకు చుట్టుకోవడంతో రాష్ట్ర 10వ ముఖ్యమంత్రి రామకృష్ణ
హెగ్డే తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఆయన జనతా పార్టీ లో
చేరి ముఖ్యమంత్రి అయ్యారు. 1983 నుంచి 88 వరకు తిరుగులేని నాయకుడిగా రాష్ట్రాన్ని పాలించి
చివరకు ఫోన్ల ట్యాపింగ్ వివాదం వల్ల పదవి నుంచి తప్పుకున్నారు.