Wednesday, August 14, 2019

Chandrayaan-2 Successfully Enters Lunar Transfer Trajectory


చంద్రుని పరిభ్రమణ కక్ష్యలోకి చంద్రయాన్-2 వ్యోమనౌక

చంద్రయాన్-2 వ్యోమనౌక చంద్రుని పరిభ్రమణ మార్గంలోకి ప్రవేశించింది. మంగళవారం రాత్రి 02.21కి విజయవంతంగా వ్యోమనౌక చంద్రుని కక్ష్య దిశగా ముందుకు సాగుతున్నట్లు ఇస్రో వర్గాలు పేర్కొన్నాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా చేపట్టిన చంద్రయాన్-2ను జులై 23 న శ్రీహరికోటలోని సతీష్ దావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం (షార్) నుంచి ప్రయోగించిన సంగతి తెలిసిందే. జీఎస్ఎల్వీ ఎం.కె-3 ఎం-1 రాకెట్ ద్వారా ప్రయోగించిన చంద్రయాన్-2 వ్యోమనౌక వివిధ దశలను దిగ్విజయంగా దాటుతూ పురోగమిస్తోంది. బెంగళూరులోని అబ్జర్వేటరీ కేంద్రం నుంచి వ్యోమనౌక స్థితిగతుల్ని ఇస్రో శాస్త్రవేత్తలు నిరంతరం గమనిస్తున్నారు. తాజాగా వ్యోమనౌక ఇంజిన్ లోని ద్రవ ఇంధనాన్ని 1,203 సెకన్ల పాటు మండించారు. ఆగస్ట్ 20న ప్రస్తుత చంద్రుని కక్ష్యలోకి వ్యోమనౌక చేరుకుంటుంది. మరోసారి ఆ రోజు వ్యోమనౌక ఇంజిన్ లో ద్రవ ఇంధనాన్ని మండించనున్నారు. అక్కడ నుంచి అయిదు దశల ప్రయాణం అనంతరం తుది లక్ష్యంలోకి అడుగుపెడుతుంది. తుది అయిదో దశలో చంద్రగ్రహ ఉపరితలానికి 100 కిలోమీటర్ల సమీపంలో ఉంటుంది. సెప్టెంబర్ 7న చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలోకి వ్యోమనౌక చేరుకుంటుందని ఇస్రో వర్గాలు తెలిపాయి.

No comments:

Post a Comment