Wednesday, August 14, 2019

Chandrayaan-2 Successfully Enters Lunar Transfer Trajectory


చంద్రుని పరిభ్రమణ కక్ష్యలోకి చంద్రయాన్-2 వ్యోమనౌక

చంద్రయాన్-2 వ్యోమనౌక చంద్రుని పరిభ్రమణ మార్గంలోకి ప్రవేశించింది. మంగళవారం రాత్రి 02.21కి విజయవంతంగా వ్యోమనౌక చంద్రుని కక్ష్య దిశగా ముందుకు సాగుతున్నట్లు ఇస్రో వర్గాలు పేర్కొన్నాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా చేపట్టిన చంద్రయాన్-2ను జులై 23 న శ్రీహరికోటలోని సతీష్ దావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం (షార్) నుంచి ప్రయోగించిన సంగతి తెలిసిందే. జీఎస్ఎల్వీ ఎం.కె-3 ఎం-1 రాకెట్ ద్వారా ప్రయోగించిన చంద్రయాన్-2 వ్యోమనౌక వివిధ దశలను దిగ్విజయంగా దాటుతూ పురోగమిస్తోంది. బెంగళూరులోని అబ్జర్వేటరీ కేంద్రం నుంచి వ్యోమనౌక స్థితిగతుల్ని ఇస్రో శాస్త్రవేత్తలు నిరంతరం గమనిస్తున్నారు. తాజాగా వ్యోమనౌక ఇంజిన్ లోని ద్రవ ఇంధనాన్ని 1,203 సెకన్ల పాటు మండించారు. ఆగస్ట్ 20న ప్రస్తుత చంద్రుని కక్ష్యలోకి వ్యోమనౌక చేరుకుంటుంది. మరోసారి ఆ రోజు వ్యోమనౌక ఇంజిన్ లో ద్రవ ఇంధనాన్ని మండించనున్నారు. అక్కడ నుంచి అయిదు దశల ప్రయాణం అనంతరం తుది లక్ష్యంలోకి అడుగుపెడుతుంది. తుది అయిదో దశలో చంద్రగ్రహ ఉపరితలానికి 100 కిలోమీటర్ల సమీపంలో ఉంటుంది. సెప్టెంబర్ 7న చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలోకి వ్యోమనౌక చేరుకుంటుందని ఇస్రో వర్గాలు తెలిపాయి.

Tuesday, August 13, 2019

Jahnavi kapoor prays lord sri venkateswara in tirumala today


శ్రీదేవి జయంతి సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న జాహ్నవి
బాలీవుడ్ నటి జాహ్నవి మంగళవారం తిరుమలలో స్వామి వారిని  దర్శించుకున్నారు. తన తల్లి శ్రీదేవి 56వ జయంతి సందర్భంగా ఆమె కాలినడక మార్గంలో శ్రీవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఆలయంలో తల నేలకు తాకించి మోకాలి  ఆరాధన చేశారు. హ్యాపీ బర్త్ డే అమ్మా, ఐ లవ్ యూ అంటూ జాహ్నవి ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఫొటోలు వైరల్ అయ్యాయి. తరచు జాహ్నవి స్వామి ఆలయానికి విచ్చేస్తుంటారు. ఈసారి తెలుగు సంప్రదాయ దుస్తుల్లో స్నేహితులతో కలిసి స్వామి సన్నిధికి విచ్చేశారు. ఏదైనా ప్రత్యేక కార్యక్రమం చేపట్టిన ప్రతిసారీ విధిగా ఆమె స్వామి వారి సన్నిధికి వస్తుంటారు. ఇంతకుముందూ జాహ్నవి తండ్రి బోనీ కపూర్, చెల్లెలు ఖుషీ లతో కలిసి తిరుపతి ఆలయాన్ని సందర్శించారు. అచ్చ తెలుగు అమ్మాయిలా ఆకుపచ్చ వోణి బంగారు రంగు పరికిణి ధరించిన ఆమె స్వామి సేవలో పాల్గొన్న ఫొటోలు అభిమానుల్ని అలరిస్తున్నాయి. ఈ ఫొటోలకు వేల సంఖ్యలో లైక్ లు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా స్టార్ డమ్ సాధించిన శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న దుబాయ్ హోటల్లోని బాత్ రూమ్ టబ్ లో ఆకస్మికంగా మృతి చెందిన సంగతి తెలిసిందే.

Monday, August 12, 2019

Vikram lander will land on moon as tribute to Vikram Sarabhai from crores of Indians:PM Modi


చందమామపై విక్రమ్ ల్యాండర్.. అదే భారత అంతరిక్ష పితామహునికి ఘన నివాళి:ప్రధాని మోది
చంద్రయాన్-2 ప్రయోగంలో కీలక పార్శ్వమైన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగనుండడమే భారత అంతరిక్ష ప్రయోగ పితామహుడు విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ కి నిజమైన నివాళి అని ప్రధాని మోది పేర్కొన్నారు. విక్రమ్ సారాభాయ్ శత జయంత్యుత్సవాల్ని పురస్కరించుకుని అహ్మదాబాద్ లో ఏర్పాటైన కార్యక్రమంలో ప్రధాని మోది వీడియో సందేశమిస్తూ ఆయన సేవల్ని స్మరించుకున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వ్యవస్థాపకుడిగా విక్రమ్ సారాభాయ్ సేవలు చిరస్మరణీయమన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లోనే కాకుండా భారతీయ సంస్కృతి, సంస్కృత భాషా వ్యాప్తికి ఎనలేని కృషి చేశారన్నారు. పిల్లల్లో ఆధునిక శాస్త్ర విజ్ఞాన జిజ్ఞాసతో పాటు, భారతీయ సంస్కృతి విలువల్ని పెంపొందించడం, సంస్కృత భాషా అభిలాషను ప్రోత్సహించేందుకు పాటు పడ్డారని ప్రధాని చెప్పారు. డాక్టర్ హోమీ బాబా మరణంతో యావత్ ప్రపంచం శాస్త్రసాంకేత విజ్ఞాన రంగంలో ఎదుర్కొంటున్న లోటును విక్రమ్ సారాభాయ్ తీర్చారన్నారు. అంతరిక్ష ప్రయోగాలతో విశ్వ వ్యాప్తంగా నీరాజనాలందుకుంటున్న ఇస్రోను నెలకొల్పిన విక్రమ్ సారాభాయ్ `భారతమాతకు నిజమైన పుత్రుడు` అని చైర్మన్ డాక్టర్ కె.శివన్ పేర్కొన్నారు. ఆయన ఓ అద్భుతమైన సంస్థకు అంకురార్పణ చేశారని కొనియాడారు. భౌతికశాస్త్రం, ఆధునిక శాస్త్ర విజ్ఞానం, అణుశక్తి రంగాల్లో విక్రమ్ సారాభాయ్ సేవలు నిరుపమానమన్నారు.
విక్రమ్ సారాభాయ్ ఆగస్ట్ 12, 1919లో అహ్మదాబాద్ (ఉమ్మడి మహారాష్ట్ర) లో జన్మించారు. కేంబ్రిడ్జి యూనివర్శిటీలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. 1942లో ఆయన ప్రఖ్యాత శాస్త్రీయ నృత్యకళాకారిణి మృణాళిని వివాహం చేసుకున్నారు. ఇస్రోతో పాటు ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ అహ్మదాబాద్ (ఐఐఎంఎ) సంస్థలను నెలకొల్పారు. భారత అణుశక్తి సంస్థ (అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా) కి 1966-1971 వరకు చైర్మన్ గా వ్యవహరించారు. 1966లో ఆయనకు పద్మభూషణ్ అవార్డు లభించింది. 1971లో తన 52వ ఏట తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ పరమపదించారు. మరణానంతరం 1972లో ఆయనకు పద్మవిభూషణ్ పురస్కారం లభించింది.   

Sunday, August 11, 2019

Abrogation of 370 is the need of the hour: Vice President venkaiah Naidu


జమ్ముకశ్మీర్ లో 370 అధికరణం రద్దు అనివార్యం: ఉపరాష్ట్రపతి
దేశ భద్రత, సమగ్రతల కోణంలో ప్రస్తుతం జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు అత్యవసరమని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం చెన్నైలో ఆయన తన రెండేళ్ల పదవీకాలంపై రచించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడారు. 370 అధికరణం రద్దుకు పార్లమెంట్ ఆమోదం లభించినందున ఇప్పుడు ఆ విషయంపై తను స్వేచ్ఛగా మాట్లాడుతున్నానన్నారు. ఈ ఆర్టికల్ రద్దు విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఓ ప్రొఫెసర్ తనను జమ్ముకశ్మీర్ ను చూశారా? అని ప్రశ్నించినట్లు ఉపరాష్ట్రపతి చెప్పారు. మన ముఖంలో ఉండే రెండు కళ్లు కూడా ఒకదాన్ని మరొకటి చూడలేవు..కానీ ఒక కంటికి బాధ కల్గితే రెండో కంట్లోనూ నీరు ఉబికి వస్తుందని వెంకయ్య అన్నారు. అదే విధంగా భారత జాతి ప్రయోజనాల రీత్యా దేశమంతా ఏకరీతిగా ముందడుగు వేయాలని చెప్పారు. రాష్ట్రాలు, ప్రాంతాలన్న తేడా లేకుండా సంక్షేమ ఫలాలు దేశమంతా అందాలన్నారు. జమ్ముకశ్మీర్ లో జనజీవనాన్ని సాధారణ స్థితికి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. త్వరలో ఆ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలై ప్రగతి నెలకొంటుందని చెప్పారు. కార్యక్రమంలో ప్రసంగించిన హోంమంత్రి అమిత్ షా జమ్ముకశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు వల్ల ఉగ్రవాదం తుడిచిపెట్టుకుపోతుందని చెప్పారు. తమ పార్టీకి రాజ్యసభలో కనీస మెజార్టీ లేదని.. 370 ఆర్టికల్ రద్దు బిల్లును తొలుత ఆ సభలోనే ప్రవేశపెడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు నాటి పరిస్థితులు నెలకొంటాయేమోనన్న చిన్న సందేహం కల్గిందన్నారు. అయితే పెద్దల సభలో బిల్లు సజావుగా ఆమోదం పొందిందని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్, భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, అపొలో హాస్పిటల్స్ చైర్మన్ పి.సి.రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్, రాజస్థాన్ విశ్వవిద్యాలయం ఉపకులపతి కె.కస్తూరి రంగన్, వి.ఐ.టి. వ్యవస్థాపకులు, చాన్స్ లర్ జి.విశ్వనాథన్ తదితరులు ఉపరాష్ట్రపతిని ఈ సందర్భంగా అభినందించారు.