నిష్పాక్షిక ఎన్నికల కోసం రష్యాలో కదం తొక్కిన జనం
నిష్పాక్షికంగా స్వేచ్ఛాయుత
రీతిలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ (ఓపెన్ రష్యా మూవ్ మెంట్) రష్యా రాజధాని
మాస్కో లో పెద్ద సంఖ్యలో జనం ఆందోళనకు దిగారు. మాస్కో స్క్వేర్ లో శనివారం సుమారు
40 వేల మంది నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ `పుతిన్
ఇప్పటికీ చెప్పిన అబద్ధాలు చాలించండి..మాకు ఓటు వేసే స్వేచ్ఛ కల్పించండి` అంటూ
నినాదాలు చేశారు. దాదాపు 20 ఏళ్లగా అధ్యక్ష, ప్రధాని బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్న
66 ఏళ్ల పుతిన్ నేరుగా ప్రజల నిరసనల్ని ఎదుర్కోవడం ఇదే ప్రథమం. తాజా ర్యాలీలో 20
వేల మంది వరకు హాజరుకావచ్చని పోలీసులు వేసిన అంచనా తప్పింది. 2012లో
దేశాధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇంత పెద్ద
సంఖ్యలో ప్రజలు ఆందోళన చేపట్టడం ఇదే ప్రథమం. జులై 21న కూడా మాస్కో స్క్వేర్ లో పెద్ద
ఎత్తున జనం ఆందోళనకు దిగారు.16 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈ సందర్భంగా ఓ
సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మాస్కో మేయర్ సెర్గి సొబ్యానిన్ రాజకీయ వివాదాన్ని
రాజేస్తున్నారని ఆరోపించారు. మాస్కోలో గల 1 కోటీ 50 లక్షల మందిని ఆ వివాదంలోకి లాగుతున్నారన్నారు. ప్రజా పక్షం
వహిస్తున్న ప్రతిపక్ష అభ్యర్థుల్ని స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అధికారులు
అంగీకరించకపోవడంతో ప్రజలు ఆందోళన చేపట్టారు. దాంతో వందల సంఖ్యలో నిరసనకారుల్ని,
ప్రతిపక్ష నాయకుల్ని పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. దేశమే ఒక ఖైదుగా పౌరులు బందీలుగా మారినట్లు ప్రస్తుత పరిణామాలు పరిణమించాయని ఓపెన్
రష్యా ఉద్యమ కర్త డిమిత్రి ఖోబోటోవ్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 2 వేల మంది
పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసు చర్యల్ని ఖండిస్తూ తాజాగా ఈరోజు మళ్లీ
ప్రజలు ఆందోళనకు దిగారు. సెప్టెంబర్ లో సిటీ ఆఫ్ పార్లమెంట్స్ (స్థానిక సంస్థలు) కు ఎన్నికలు
జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పుతిన్ వ్యతిరేకులైన పలువురు ప్రతిపక్ష నాయకుల్ని పోటీ చేయడానికి
వీలులేకుండా జైళ్లకు తరలించారు. ఆందోళనకు దిగి చట్టాల్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై ప్రతిపక్ష
నాయకుడు డిమిత్రి గుడ్ కోవ్ కు 30 రోజుల కారాగారం విధించారు. ఆయన భార్య వలెరియా గుడ్
కోవ్ శనివారం నిర్వహించిన మాస్కో ర్యాలీలో ప్రసంగిస్తూ ప్రతి పౌరులకు అధికారంలో భాగస్వామ్యం
వహించే హక్కు ఉందని కానీ అందుకు పాలకులు భీతిల్లుతున్నారని వ్యాఖ్యానించారు.