Tuesday, July 30, 2019

Triple talaq bill passed by Parliament


ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోద ముద్ర
దేశంలో వివాహిత ముస్లిం మహిళలకు రక్షణ కల్పించే ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఈ బిల్లు ఆమోదాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు మంగళవారం రాజ్యసభ లోనూ గట్టెక్కింది. బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సభలో ప్రవేశపెట్టారు. ఎస్.పి, బీఎస్పీలు సభకు హాజరుకాలేదు. ఎ.ఐ.ఎ.డి.ఎం.కె. సభ నుంచి వాకౌట్ చేసింది. కూటమి మిత్ర పక్షం జేడీయూ కూడా వాకౌట్ చేయడం గమనార్హం. వై.ఎస్.ఆర్.సి.పి, టి.ఆర్.ఎస్ సభ్యులు ఓటింగ్ లో పాల్గొనలేదు. బిల్లుకు అనుకూలంగా 99 మంది ఎంపీలు ఓటేయగా 84 మంది వ్యతిరేకిస్తూ ఓటేశారు. దాంతో రాజ్యసభ లోనూ బిల్లు ఆమోదం పొందగల్గింది. ఎగువ సభలో మోదీ ప్రభుత్వానికి వాస్తవంగా 107 మంది ఎంపీల బలముంది. బిల్లు ఆమోదానికి 121 ఓట్లు అవసరం. ఎస్.పి, బీఎస్పీ సభ్యులు సభకు హాజరుకాకపోవడం, టి.ఆర్.ఎస్, వై.ఎస్.ఆర్.సి.పి. సభ్యులు ఓటింగ్ లో పాల్గొనకపోవడంతో ట్రిపుల్ తలాఖ్ బిల్లు కు రాజ్యసభ లో కూడా ఆమోద ముద్ర పడింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం పొందాక.. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి అమలులో ఉన్న ట్రిపుల్ తలాఖ్ ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లు చట్టరూపాన్ని దాల్చి అమలులోకి రానుంది.

Monday, July 29, 2019

Financier 'kidnapped and freed' after paying Rs 1 crore in hyderabad


రూ.కోటి తీసుకొని ఫైనాన్షియర్ని విడిచిపెట్టిన కిడ్నాపర్లు

హైదరాబాద్ లో కిడ్నాపర్ల ముఠా రూ.కోటి వసూలు చేసి ఓ ఫైనాన్షియర్ ను సోమవారం విడుదల చేసింది. ఆదివారం రాత్రి దోమలగూడ లో గజేంద్ర ప్రసాద్ అనే ఫైనాన్షియర్ ను ఓ ముఠా కిడ్నాప్ చేసింది. అతని కుటుంబ సభ్యుల్ని రూ.3 కోట్లు డిమాండ్ చేశారు. ఆ సొమ్ము ఇస్తేనే గజేంద్రను విడిచిపెడతామని హెచ్చరించారు. చివరకు కుటుంబ సభ్యులు రూ.కోటి చెల్లించడంతో ముఠా అతణ్ని అబిడ్స్ లో వదిలి పరారయింది. ఈ మేరకు గజేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గజేంద్ర తనకు ముంబయికి చెందిన వ్యాపారవేత్తతో లావాదేవీల్లో వివాదమున్నట్లు తెలిపారు. గత రాత్రి తనను అపహరించిన కిడ్నాపర్లు తర్వాత నిర్భందించి దాడి చేశారన్నారు. గజేంద్ర ఒంటిపై గాయాలు కనిపిస్తున్నాయి. మొహం కూడా కమిలిపోయింది. కిడ్నాపర్లు రూ.3 కోట్లు డిమాండ్ చేస్తుండగా రూ.5 లేదా 10 లక్షలు ఇస్తానని చెప్పగా తనను వాళ్లు తీవ్రంగా కొట్టారన్నారు. చివరకు రూ.50 లక్షలు తీసుకుని వదిలివేయాలని కోరినా కనికరించలేదని చెప్పారు. తప్పక రూ.కోటి ఇస్తానని చెప్పడంతో అంగీకరించి తనను విడుదల చేశారని గజేంద్ర పోలీసులకు వివరించారు. తన స్నేహితుడు ఆ మొత్తాన్ని కారులో తీసుకొని వచ్చి సమీపంలోని ఓ స్కూల్ వద్ద పార్క్ చేశారన్నారు. అనంతరం ఆ డబ్బును ముఠాలోని ఇద్దరు సభ్యులు వెళ్లి తీసుకుని వచ్చారన్నారు. ఆ తర్వాతే నిర్బంధ ప్రాంతం నుంచి తనను కిడ్నాపర్లు అబిడ్స్ కు తరలించి పరారయినట్లు తెలిపారు.

Sunday, July 28, 2019

Bachchan 'filled with pride' after successful rescue of Mahalaxmi Express passengers


మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ ప్రయాణికుల్ని రక్షించిన బృందాలకు అమితాబ్ అభినందనలు
మహారాష్ట్రలో ఇటీవల జలదిగ్బంధనానికి గురైన మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ ప్రయాణికుల్ని రక్షించిన సహాయక రక్షణ బృందాల్ని ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రశంసించారు. శనివారం థానే జిల్లా సమీపంలోని వంగణీ ప్రాంతంలో ఈ రైలు వరద నీటిలో చిక్కుబడి 1050 మంది ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడిన సంగతి తెలిసిందే. వారందరూ సుమారు 17 గంట పాటు రైల్లోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. సమాచారం అందుకున్న సహాయక రక్షణ బృందాలు, భారత సైన్యం రంగంలోకి దిగి గంటల తరబడి శ్రమించి ప్రయాణికులందర్ని సురక్షితంగా వరద నీటి నుంచి వెలుపలికి తీసుకువచ్చారు. స్పందించిన బిగ్ బి , "ఎన్డీఆర్ఎఫ్ బృందానికి అభినందనలు .. వారు మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ నుంచి 700 మంది ప్రయాణికులను విజయవంతంగా రక్షించారు! ఎన్డీఆర్ఎఫ్, నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, రైల్వే, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కు ధన్యవాదాలు, మీరు చాలా గొప్ప కార్యం నిర్వర్తించారు .. ఇది సాహసోపేతమైన , విజయవంతమైన కార్యక్రమం. నేను ఎంతో గర్వ పడుతున్నాను. జై హింద్! అని ట్వీట్ చేశారు. ప్రాణాల కోసం పోరాడుతున్న ప్రయాణికుల్ని ప్రాణాలొడ్డి రక్షించడానికి చేపట్టిన విజయవంతమైన సహాయక చర్య ఆయనను ఎంతగానో కదిలించింది. దాంతో ఈ ఆపరేషన్ లో పాల్గొన్న వారందర్ని అమితాబ్ ప్రశంసలతో ముంచెత్తారు.

Saturday, July 27, 2019

All 1,050 passengers of stranded Mahalaxmi Express rescued:Railways


ఈ నీళ్ల పైన రైలుంది
·       ముంబయిలో పోటెత్తిన వరదలు
·       మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ నుంచి 1050 మంది ప్రయాణికుల తరలింపు
కుంభవృష్టి తాజాగా మహారాష్ట్రలోని ముంబయి, థానేల్ని అతలాకుతలం చేసింది. ఉల్హాస్ నది పోటెత్తడంతో సెంట్రల్ రైల్వే జోన్ లోని రైల్వే ట్రాక్ లు ముంపునకు గురయ్యాయి. శుక్రవారం రాత్రి ముంబయి నుంచి కోల్హాపూర్ బయలుదేరిన మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ వరదల తాకిడికి ముంపునకు గురై నిలిచిపోయింది. బద్లా పూర్, వంగణి రైల్వే స్టేషన్ల మధ్యమార్గంలో రైలు వరద పోటెత్తి ప్రవహించడంతో జలదిగ్బంధనానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న 1050 మంది రైల్లోనే చిక్కుబడిపోయారు. వారందర్ని శనివారం మధ్యాహ్నం సహాయ రక్షణ బృందాలు సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చాయి. మొత్తం ప్రయాణికులందర్ని వారు చేరుకోవాల్సిన గమ్య స్థానం కోల్హాపూర్ కు వేరే మార్గంలో మరో రైలులో తరలించారు. శుక్రవారం అర్ధరాత్రి కుండపోత వర్షానికి వరద పోటెత్తడంతో మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ ప్రయాణిస్తున్న రైల్వే ట్రాక్ ముంపునకు గురైంది. గంటల కొద్దీ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ప్రయాణికులు కాలం గడిపారు. శనివారం ఉదయానికే సహాయ రక్షణ బృందాలు రైలు జలదిగ్బంధానికి గురైన ప్రాంతానికి చేరుకున్నాయి. భారత నేవీ సిబ్బంది హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహిస్తూ వీరికి సహకరించారు. సహాయ రక్షణ చర్యలు చేపట్టిన సెంట్రల్ రైల్వే సిబ్బంది, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్.పి.ఎఫ్), జాతీయ విపత్తు సహాయక దళం (ఎన్.డి.ఆర్.ఎఫ్)  ప్రయాణికులందరి ప్రాణాలు కాపాడాయి. లైఫ్ జాకెట్లు, బోట్ల తో భారత నేవీ బృందం కూడా వరదల్లో దిగ్బంధనానికి గురైన మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ వద్దకు చేరుకుని ప్రయాణికుల్ని సురక్షితంగా తీరానికి చేర్చడానికి సహకరించింది. వెలుపలికి తీసుకువచ్చిన ప్రయాణికుల్ని తొలుత బద్లాపూర్ లోని కన్వెన్షన్ హాల్ కు తరలించారు. వైద్య సహాయం అవసరమైన ప్రయాణికుల్లో కొందర్ని అంబులెన్స్ లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. సెంట్రల్ రైల్వే సిబ్బంది ప్రయాణికులంతా తేరుకున్నాక వారి గమ్య స్థానం కోల్హాపూర్ కు వేరే మార్గంలో ప్రత్యేక రైలులో తరలించే ఏర్పాట్లు పూర్తి చేసింది.