అఫ్గానిస్థాన్ ను
62 పరుగుల తేడాతో చిత్తు చేసిన బంగ్లాదేశ్
ప్రస్తుత వరల్డ్
కప్ లో బంగ్లాదేశ్ మరోసారి తన పట్టును ప్రదర్శిస్తూ అఫ్గనిస్థాన్ పై ఘన విజయాన్ని
సాధించింది. వరల్డ్ కప్-12 మ్యాచ్ నం.31 సాథాంప్టన్ రోజ్ బౌల్ మైదానంలో సోమవారం జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ 62 పరుగుల తేడాతో అఫ్గనిస్థాన్ ను చిత్తు చేసింది. టాస్
గెలిచిన అఫ్గన్ టీం ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ 50
ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 262 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది.
అఫ్గానిస్థాన్ తొలుత తడబాటు లేకుండానే ఇన్నింగ్స్ కొనసాగించింది. తొలి వికెట్ కు
ఓపెనర్లు కెప్టెన్ గుల్బుద్దీన్ నయిబ్(47), రహ్మత్ షా(24) 10.5 ఓవర్లలో 49 పరుగులు
స్కోర్ చేశారు. రహ్మత్ షా ను బంగ్లా ఆల్ రౌండర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ షాకిబ్ అవుట్
చేశాడు. తర్వాత హష్మతుల్లా షాహిదీ(11)ని మొసాదిక్ హొస్సేన్ బోల్తా కొట్టించాడు.
కీపర్ రహీం స్టంప్ చేయగా షాహిదీ వెనుదిరిగాడు. ఆ తర్వాత 28వ ఓవర్ లో షాకిబ్ వరుసగా
గుల్బుద్దీన్ , 20 పరుగులు చేసిన అస్ఘర్ అఫ్గాన్ లను పెవిలియన్ చేర్చి ప్రత్యర్థి
బ్యాటింగ్ లైనప్ ను దెబ్బతీశాడు. అఫ్గన్ స్టార్ బ్యాట్స్ మన్ మహ్మద్ నబీ(0)ని
క్లీన్ బౌల్డ్ చేసి డకౌట్ గా పెవిలియన్ చేర్చాడు. చివర్లో కుదురుకుంటున్న
నజీబుల్లా జర్దాన్(23)ని కూడా షాకిబ్ బోల్తా కొట్టించాడు. కీపర్ రహీం స్టంపౌట్
చేయగా అతను క్రీజ్ నుంచి నిష్క్రమించాడు. 10 ఓవర్లలో షాకిబ్ 29 పరుగులిచ్చి 5
వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. చివరి వరుస బ్యాటర్లు ఒక్కొక్కరు వెనుదిరగ్గా సామివుల్లా
షిన్వారి(49*) నాటౌట్ గా
మిగిలాడు. అఫ్గనిస్థాన్ 47 ఓవర్లకే ఆలౌటై సరిగ్గా 200 పరుగులు చేసింది. టాస్
ఓడిపోయి బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టులో ఓపెనర్లు లిటన్ దాస్(16),
తమిమ్ ఇక్బాల్(36) పరుగులు చేశారు. షాకిబ్ అల్ హసన్(51) మరో అర్ధ సెంచరీ నమోదు చేశాడు. కీపర్ బ్యాట్స్ మన్ ముష్ఫికర్ రహీం(83) జట్టులో అత్యధిక స్కోరు సాధించాడు.
చివర్లో మహ్మదుల్లా(27), మొసాదిక్ హొస్సేన్(35) జట్టు పెద్ద స్కోరు చేసేందుకు
తోడ్పడ్డారు. అఫ్గన్ బౌలర్లలో ముజ్బుర్ రహ్మన్ 3 వికెట్లు, కెప్టెన్ గుల్బుద్దీన్
నయిబ్ 2 వికెట్లు, దవ్లత్ జద్రాన్, మహ్మద్ నబీలు చెరో వికెట్ తీసుకున్నారు. దీంతో
అఫ్గనిస్థాన్ ఇప్పటికి ఆడిన 7 మ్యాచ్ ల్లో ఓటమి పాలయింది. దక్షిణాఫ్రికా,
వెస్టిండీస్, అఫ్గనిస్థాన్ లపై గెలుపుతో బంగ్లాదేశ్ తన విజయాల సంఖ్యను మూడుకు
పెంచుకుంది.