దక్షిణాఫ్రికాకు తొలి విజయం:చిత్తయిన అప్ఘానిస్థాన్
ఐసీసీ వరల్డ్ కప్-12లో
దక్షిణాఫ్రికా తొలి విజయాన్ని అందుకుంది. మ్యాచ్ నం.21 కార్డిఫ్ వేదికగా శనివారం జరిగిన
మ్యాచ్లో ద.ఆఫ్రికా టాస్ గెలిచి అప్ఘానిస్థాన్ ను బ్యాటింగ్ కు దింపింది. వర్షం
వల్ల 48 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో అప్ఘాన్ బ్యాట్స్ మెన్ పేలవంగా ఆడారు. ప్రత్యర్థి
ద.ఆఫ్రికాకు 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించారు. అనంతరం బ్యాటింగ్
ప్రారంభించిన ద.ఆఫ్రికా విజయం నల్లేరు మీద బండి నడకే అయింది. 28.4 ఓవర్లలో ఓపెనర్ క్వింటన్
డికాక్(68)వికెట్ ను మాత్రమే కోల్పోయి 131 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది. మరో ఓపెనర్ హషీం అమ్లా 41 పరుగులు,
ఫెహ్లుక్వయో 17 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. అప్ఘాన్ కెప్టెన్ గుల్బద్దీన్ నైబ్
మాత్రమే ఓ వికెట్ పడగొట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన అప్ఘానిస్థాన్ జట్టులో చలాకీ
ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ ఒక్కడే మిడిల్ ఆర్డర్ లో చెప్పుకోదగ్గ పరుగులు చేయడంతో 100
పరుగుల మార్క్ ను అప్ఘానిస్థాన్ దాట గల్గింది. జట్టు మొత్తం 34.1 ఓవర్లలోనే 125
పరుగులకు ఆలౌటయింది. టాప్ స్కోరర్ రషీద్ 25 బంతుల్లో 6 ఫోర్లతో 35 పరుగులు చేశాడు.
ఓపెనర్లు నూర్ జర్దాన్(32), హజ్రతుల్లా
జజాయ్(22) మాత్రమే రెండంకెల స్కోరు
సాధించారు. ద.ఆఫ్రికా బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్ 29/4
వికెట్లు, పొదుపుగా పరుగులిచ్చిన క్రిస్ మోరిస్ 13/3
వికెట్లు , ఫెహ్లుక్వయో 18/2 వికెట్లు తీసుకోగా రబాడ36/1 వికెట్ పడగొట్టారు.