పీఎంగా మోదీ సీఎంగా జగన్ ప్రమాణ
స్వీకారం
ప్రధానిగా
నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ సీఎంగా వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిలు గురువారం(మే30)
ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ రెండోసారి ప్రధానిగా ప్రమాణం స్వీకారం చేయగా ఏపీ
రెండో ముఖ్యమంత్రిగా జగన్ తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు. దేశ రాజధాని ఢిల్లీ,
ఏపీ రాజధాని అమరావతిల్లో అత్యంత వైభవంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాలు జరిగాయి.
రాష్ట్రపతి భవన్ లో గురువారం రాత్రి 7గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
ప్రధానిగా మోదీతో ప్రమాణ స్వీకారం చేయించారు. మోదీతో పాటు 58 మంది లోక్ సభ,
రాజ్యసభలకు చెందిన సభ్యులు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో 25మంది
కేంద్రమంత్రులుగా, 9 మంది స్వతంత్ర ప్రతిపత్తిగల సహాయమంత్రులుగా, మరో 24 మంది
సహాయమంత్రులుగా ప్రమాణం చేశారు. తెలుగువారిలో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి
సహాయమంత్రిగా ప్రమాణం చేయగా ఆరుగురు మహిళా మంత్రులు గురువారం ప్రమాణ స్వీకారం
చేశారు. స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్, హర్ సిమ్రత్ కౌర్ బాదల్, సాధ్వి నిరంజన్
జ్యోతి, రేణుకాసింగ్ సరుతా, దేవశ్రీ చౌదురి మంత్రులుగా ప్రమాణం చేశారు.
కార్యక్రమానికి బీజేపీ కురువృద్ధులు అద్వానీ, మనోహర్ జోషి, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, గులాం నబీ అజాద్ తదితర ప్రముఖులు హాజరైన వారిలో ఉన్నారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి
అరవింద్ కేజ్రీవాల్, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఈ వేడుకలో పాల్గొన్నారు.
ప్రమాణ స్వీకారానికి ఆయా రాష్ట్రాల సీఎంలు మమతా బెనర్జీ(పశ్చిమబెంగాల్), నవీన్
పట్నాయక్(ఒడిశా), పినరయి విజయన్(కేరళ), వై.ఎస్.జగన్(ఏపీ), కేసీఆర్(తెలంగాణ),
అమరీందర్ సింగ్(పంజాబ్), భూపేశ్ భగల్(ఛత్తీస్ గఢ్), కమల్ నాథ్(మధ్యప్రదేశ్), అశోక్
గెహ్లాట్(రాజస్థాన్)లు హాజరుకాలేదు.
విభజిత ఆంధ్రప్రదేశ్
రెండో ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్ తో గవర్నర్ నరసింహన్ మధ్యాహ్నం 12.23 నిమిషాలకు
ప్రమాణ స్వీకారం చేయించారు. జగన్ ఒక్కరే ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడ
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ
సీఎం కేసీఆర్, తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు ఎం.కె.స్టాలిన్ ముఖ్య అతిథులుగా
హాజరయ్యారు. ప్రమాణం చేసిన అనంతరం జగన్ ప్రసంగిస్తూ అవినీతి రహిత సుపరిపాలన
అందిస్తానని చెప్పారు. వృద్ధాప్య పింఛన్లపై తొలి సంతకం చేసిన జగన్ మొదటి ఏడాది
రూ.2250 తర్వాత ఏడాది రూ.2500, ఆపై ఏడాది రూ.2750 చొప్పున అవ్వా,తాతలకు అందిస్తానంటూ
ఆ మొత్తాన్ని క్రమంగా పెంచుకుంటూ వెళ్తానని చెప్పారు. గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకు
సంబంధించి రెండో సంతకం చేశారు. ప్రతి గ్రామానికి 10 మంది చొప్పున రాష్ట్రం మొత్తం
లక్షా50వేల గ్రామ వాలంటీర్ల నియామకాలు చేపడతామన్నారు. వారికి వేతనంగా నెలకు
రూ.5వేలు చెల్లిస్తామని వారికి మెరుగైన ఉపాధి లభించే వరకు వాలంటీర్లగా
కొనసాగుతారన్నారు. రాష్ట్రంలో యువతకు మొత్తం 4 లక్షల ఉద్యోగాలు కల్పించాలని
లక్ష్యంగా పెట్టుకున్నట్లు జగన్ వివరించారు.