ఆయనే కీర్తి.. ఆయనో స్ఫూర్తి
తెలుగు చలనచిత్రసీమ పరిశ్రమగా ఎదిగి మూడు పువ్వులు, ఆరుకాయలుగా వర్ధిల్లడానికి అహర్నిశలు కృషి చేసిన వారిలో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. అత్యధిక చిత్రాల్లో నటించిన కథనాయకుడిగానే కాక నిర్మాతగా, స్టూడియో అధినేతగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన ప్రతిభావంతుడు. 1964 తేనె మనసులు మొదలు, 2016 శ్రీశ్రీ వరకు ఆయన 350కి పైగా సినిమాల్లో నటించి వేలమందికి పని కల్పించిన మహనీయుడు. ఆయన ప్రేక్షకులు, అభిమానుల్ని అలరించడంతో పాటు నిర్మాతల హీరోగా పేరొందిన కీర్తి పతాక. అన్నింటికి మించి మంచి మనసున్న నటశేఖర్ కృష్ణ యావత్ టాలీవుడ్ కి స్ఫూర్తి ప్రదాత. తెలుగు సినీ సీమలో ఆయనదో సువర్ణాధ్యాయం.