చంద్రబాబుకు ఏపీ సీఐడీ
నోటీసులు
ఆంధ్రప్రదేశ్ మాజీ
ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకి సీఐడీ పోలీసులు
విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు అందజేశారు. రాజధాని భూముల ధారాదత్తంపై
ఫిబ్రవరి 24నే చంద్రబాబుపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి
విచారణ చేపట్టారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఆయన హయాంలో ఇన్ సైడర్ ట్రేడింగ్
జరిగిందంటూ గత ఆరు నెలలుగా వై.ఎస్.ఆర్.సి.పి సర్కారు పలు విచారణలు చేపట్టిన సంగతి
తెలిసిందే. తాజాగా 500 ఎకరాల అసెన్డ్ భూముల విక్రయాలపై చంద్రబాబుకు ఈ
నోటీసులు అందాయి. మంగళవారం ఉదయం ఏపీ సీఐడీ పోలీసు బృందాలు హైదరాబాద్ బంజారాహిల్స్
లోని ఆయన నివాసానికి చేరుకుని విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు.
చంద్రబాబుకు వారం రోజుల గడువిస్తూ ఈనెల 23న విజయవాడ సత్యనారాయణపురంలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు రావాల్సిందిగా
నోటీసులో పేర్కొన్నారు. సెక్షన్ 41ఏ సి.ఆర్.పి.సి కింద ఈ నోటీసులు జారీ చేశారు. నోటీసుని అందుకుని చంద్రబాబు
సంతకం చేశారు. ఆయనతో పాటు గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖను నిర్వహించిన మాజీ మంత్రి
నారాయణను కూడా ఈనెల 22న విచారణకు
హాజరుకావాల్సిందిగా సీఐడీ పోలీసులు నోటీసు అందించారు. అసెన్డ్ భూముల్ని క్రయవిక్రయాలు
జరపడం, ప్రత్యేక జీవో ద్వారా రిజిస్ట్రేషన్లు చేయడంపై
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన సీఐడీ
పోలీసులు ఈ మేరకు చంద్రబాబు, నారాయణలపై ఎస్సీ,ఎస్టీ కేసు ఫైల్ చేసి ఈ నోటీసులు ఇచ్చారు. వీరు విచారణకు హాజరుకానట్లయితే
అరెస్టు చేయాల్సి ఉంటుందని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ విషయమై చంద్రబాబు
న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.