ప్రధాని, ఉపరాష్ట్రపతి నివాసాలకు
పార్లమెంట్ నుంచి సొరంగ
మార్గం
ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం నుంచి ప్రధాని నివాసంతో పాటు ఉపరాష్ట్రపతి
నివాసం, ఎంపీ చాంబర్స్‌కు సొరంగ
మార్గాలను నిర్మిస్తున్నారు. టాటా ప్రాజెక్ట్స్ సంస్థ కొత్త పార్లమెంట్ భవనాన్ని
నిర్మిస్తోంది. రూ.971 కోట్ల వ్యయంతో అన్ని హంగులు, అత్యాధునిక టెక్నాలజీతో కొత్త పార్లమెంట్ భవనం నిర్మితమవుతున్న విషయం
తెలిసిందే. గత డిసెంబరు 10న ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ
నిర్మాణాన్ని దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగనున్న 2022 ఆగస్టు 15
నాటికి నిర్మాణం పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా
చేపట్టిన ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్టు గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు
వెలువడ్డాయి. ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి
వంటి వీవీఐపీలు రోడ్డు మార్గంలో పార్లమెంట్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా సొరంగం
మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డుపై ప్రధాని కాన్వాయ్ వెళ్తే భారీగా
సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ట్రాఫిక్‌ను నిలిపివేయాలి.
కొత్త పార్లమెంట్ భవనం ఈ సమస్యలకు
తెరదించనుంది. అయితే రాష్ట్రపతి ఇంటికి మాత్రం సొరంగ మార్గాన్ని నిర్మించడం లేదు.
రాష్ట్రపతి పార్లమెంట్‌కు ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తారు. అందువల్ల ఈ నిర్ణయం
తీసుకున్నారు. ప్రధాని, ఉపరాష్ట్రపతి, ఎంపీలు ఏడాదిలో మూడు దఫాలు
సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలు జరిగే రోజులన్నీ పార్లమెంట్‌కు రావాలి. అందువల్ల
ప్రధాని, ఉపరాష్ట్రపతి నివాసంతో పాటు
ఎంపీ చాంబర్స్‌కు సొరంగం మార్గం ఏర్పాటు చేస్తున్నారు. గోల్ఫ్ కార్ట్‌లోనే సొరంగ
మార్గం గుండా నేతలు పార్లమెంట్‌కు వెళ్తారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా
సౌత్ బ్లాక్ వైపు ప్రధాని నివాసం, ప్రధానమంత్రి
కార్యాలయం నిర్మిస్తున్నారు. నార్త్ బ్లాక్ వైపు ఉపరాష్ట్రపతి నివాసం
రూపుదిద్దుకుంటోంది.