ఘట్ కేసర్ బీఫార్మసీ విద్యార్థిని
బలవన్మరణం
తనను కిడ్నాప్ చేసి ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారం చేశారనే డ్రామాతో హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన ఘట్కేసర్ విద్యార్థిని బుధవారం తుదిశ్వాస విడిచింది. ఆమె బలవన్మరణానికి పాల్పడ్డం యావత్ నగరవాసుల్ని కలచివేసింది. ఆ కేసులో తీవ్ర విమర్శల పాలైన విద్యార్థిని తొలుత మంగళవారం మధ్యాహ్నం ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను కుటుంబసభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. యువతికి వైద్యం అందించి వైద్యులు ఇంటికి పంపారు. ఇంటికి వచ్చిన యువతి తిరిగి నిన్న రాత్రి మరోసారి షుగర్ ట్యాబ్లెట్లు మింగింది. ఘట్కేసర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. సదరు యువతి కిడ్నాప్ డ్రామా ఆడి 10 రోజులవుతోంది. పోలీసులు ఆమెను సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం వైద్యుల సూచనమేరకు ఆమెను మానసిక చికిత్సాలయానికి తరలించారు. కౌన్సిలింగ్ చేసి చికిత్స అందిస్తున్నారు. అంతలోనే మళ్లీ ఆత్మహత్యకు పాల్పడ్డంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.