తెలంగాణకు జై కొట్టిన షర్మిల
రాజన్న తనయ వై.ఎస్.షర్మిల తొలిసారి తెలంగాణకు జై కొట్టారు. రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టాలనే యోచనలో ఉన్న ఆమె వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. శనివారం షర్మిల స్వగృహం లోటస్ పాండ్ లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన అభిమానులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వై.ఎస్ తన పాలనలో పేదలు లక్షాధికారులు కావాలని ఆశించారన్నారు. వారి పిల్లలు ఉచితంగా ఉన్నత, వృత్తి విద్యలు చదువుకొని గొప్పవారు అవ్వాలని కలలు కన్నారని గుర్తు చేశారు. రైతే రాజులా తలఎత్తుకుని జీవించేలా పాలించారని షర్మిల చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలోని తమతమ ప్రాంతాల్లో జీవనస్థితిగతుల గురించి నిర్భయంగా నిజాయతీగా అభిప్రాయాలు వెల్లడించాలని అభిమానుల్ని కోరారు. ఆ ఫీడ్ బ్యాక్ తో రానున్న కాలంలో తాము ఏవిధంగా ముందడుగు వేయాలనేది ఆలోచన చేస్తామన్నారు. అందుకనుగుణంగా 11 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని వారి ముందుంచారు. ఈ సమావేశం సదర్భంగా షర్మిల భావోద్వేగంతో మాట్లాడుతూ రాజన్న తెలంగాణకు ఎంతో చేశారని అందువల్లే ఆయన చనిపోయినప్పుడు ఈ ప్రాంతంలో ఎక్కువ మంది గుండెలాగిపోయి మరణించారన్నారు. ఇప్పుడు ఆయన బాటలోనే తెలంగాణకు తమ వంతు సేవలందిస్తామని చెప్పారు. దాంతో సమావేశానికి హాజరైన వారు ఒక్కసారిగా జై తెలంగాణ నినాదాలు చేశారు. ప్రతిగా షర్మిల కూడా పలుమార్లు జై తెలంగాణ అంటూ వారితో గొంతు కలిపారు.
No comments:
Post a Comment