అమెరికా ప్రజాస్వామ్యం గెలిచింది.. ఈ గెలుపు ప్రతి అమెరికా పౌరుడిది అని
కొత్త శ్వేతసౌధాధిపతి జోబైడెన్ ఉద్ఘాటించారు. ప్రెసిడెంట్ గా బైడన్, వైస్ ప్రెసిడెంట్
గా కమలా హ్యారిస్ లు జనవరి 20 బుధవారం పదవీ ప్రమాణాలు చేశారు. తొలుత కమలా ప్రమాణస్వీకారం
చేయగా తర్వాత బైడెన్ ప్రమాణం చేశారు. అనంతరం జాతినుద్దేశించి అధ్యక్షుడిగా తొలి ప్రసంగం
చేశారు. మహోన్నత అమెరికా చరిత్రలో ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు `అమెరికా
డే` గా పేర్కొన్నారు. చరిత్రలో అమెరికా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని అగ్రరాజ్యంగా నిలిచిందన్నారు. అమెరికా భవిత కోసం ప్రతి ఒక్కరితో కలిసి పనిచేస్తానని
బైడెన్ హామీ ఇచ్చారు. ఉగ్రవాదం పీచమణిచేందుకు మరోసారి అమెరికా ఏకతాటిపై ముందుకు సాగాలని
ఆకాంక్షించారు. వర్ణ, మత వివక్షలకు తమ పాలనలో తావు ఉండబోదన్నారు. ఇటీవల అమెరికా క్యాపిటల్ హిల్ పై జరిగిన దాడి, హింసతో నెలకొన్న భయాందోళనల్ని యావత్ దేశ ప్రజలు సంఘటితంగా నిలిచి
పటాపంచలు చేశారన్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పూర్వ అమెరికా అధ్యక్షులు బిల్
క్లింటన్, జార్జిబుష్ జూనియర్, బరాక్ ఒబామా హాజరయ్యారు. కానీ ఇప్పటికీ ఎన్నికల్లో తనే
గెలిచాననే భ్రమలో ఉన్న (తాజా) మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ వేడుకకు గైర్హాజరయ్యారు.
Wednesday, January 20, 2021
Joe Biden sworn in as America`s 46th President
Tuesday, January 19, 2021
Turkey slaps advertising ban on twitter with new social media law
ట్విటర్ పై టర్కీ కొరడా
టర్కీ ట్విటర్ పై కొరడా ఝళిపించింది. మంగళవారం నుంచి అమలులోకి వచ్చిన కొత్త చట్టం ప్రకారం ట్విటర్ దాని అనుబంధ సంస్థలు పెరిస్కోప్, పిన్‌టారెస్ట్ లలో ప్రకటనల నిషేధాన్ని విధించింది. టర్కీలో స్థానిక ప్రతినిధులను నియమించడంలో విఫలమైన ట్విటర్ పై ఈ మేరకు టర్కీ చర్యలు తీసుకుంది. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ అథారిటీ చట్టం ప్రకారం తమ స్థానిక ప్రతినిధులను నియమించని సోషల్ మీడియా కంపెనీలపై జరిమానాలను సైతం ప్రభుత్వం విధిస్తోంది. ఈ కొత్త చట్టం ప్రకారం తమ దేశ నిబంధనలకు అనుగుణంగా లేని కంటెంట్‌ను ఆయా సోషల్ మీడియా స్థానిక ప్రతినిధులు తొలగించాలి. ముఖ్యంగా విషపు ప్రచారంగా ప్రభుత్వం పేర్కొన్న ట్వీట్లు అన్నింటినీ ఈ ప్రతినిధులు తీసివేయాలి. ఫేస్బుక్ కొత్త నిబంధనలు అమలు పరుస్తున్నప్పటికీ ట్విటర్ మాత్రం తాత్సారం చేస్తుండడంతో టర్కీ ప్రభుత్వానికి చిరెత్తుకొచ్చింది. ఈ నేపథ్యంలో ట్విటర్‌పై ప్రకటనల నిషేధం పడింది. ఈ చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఇప్పటికే ఫేస్బుక్, యూట్యూబ్ లు ప్రభుత్వానికి భారీ జరిమానాలు చెల్లించుకున్నాయి. టర్కీలో యథేచ్ఛగా చట్ట ఉల్లంఘనలు జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని ఈ సందర్భంగా టర్కీ ఉప రవాణా మంత్రి ఒమర్ ఫాతిహ్ సయాన్ వ్యాఖ్యానించారు.
Friday, January 15, 2021
Rahul Gandhi attends Tamilanadu Jallikattu Celebrations
జల్లికట్టుకు హాజరైన రాహుల్
గాంధీ
తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పొంగల్ వేడుకలు సంబరంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం మదురై సహా ఆయా ప్రాంతాల్లో జోరుగా జల్లికట్టు నిర్వహించారు. అవనియపురంలో వార్షిక జల్లికట్టు (బుల్ టామింగ్) కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తమిళనాడులో మూడు రోజుల పర్యటనకు విచ్చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ద్రవిడ మున్నేట్రా కగం (డిఎంకె) యువజన విభాగం నాయకుడు ఉదయనిధి స్టాలిన్ తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీ వేణుగోపాల్, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ చీఫ్ కే ఎస్ అలగిరి, పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి నారాయణసామి సహా ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ సంప్రదాయం, సంస్కృతికి మద్దతుగా తను ఇక్కడకి వచ్చానన్నారు. అయితే రాహుల్ గాంధీ జల్లికట్టుకు హాజరుకావడంపై చాలా మంది నిరసన వ్యక్తం చేశారు. పలువురు బీజేపీ నాయకులు, ఇతర ప్రతిపక్ష నేతలు కాంగ్రెస్ నాయకుడివి అవకాశవాద రాజకీయాలని ఆరోపించారు. తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి మాట్లాడుతూ గతంలో రాష్ట్రంలో జల్లికట్టుపై నిషేధానికి యూపీఏ ప్రభుత్వం కారణమని అవనిపురానికి రావడానికి రాహుల్ కు నైతిక హక్కు లేదు అని విమర్శించారు.
Thursday, January 7, 2021
Cold Waves in Telangana next coming four days
గజగజ వణుకుతున్నతెలంగాణ
శీతల పవనాలకు తోడు ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో చలికి తెలంగాణ గజ గజ వణుకుతోంది. ఈరోజూ పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడడంతో జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. రానున్న మూడు నాలుగు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. బుధ,గురువారాల్లో హైదరాబాద్, నల్లగొండ, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జోగులాంబ గద్వాల, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వానలు పడుతున్నాయి. ద్రోణి కారణంగా తూర్పు దిశ నుంచి వేగంగా గాలులు వీస్తున్నాయి. బంగాళాఖాతంలోని తేమ దక్షిణ కోస్తా నుంచి తెలంగాణ మీదుగా రావడంతో ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురుస్తున్నాయి. మరోవైపు పొగమంచు కూడా కమ్మేసింది. ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం ఆదిలాబాద్‌లో 14 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుకాగా, కామారెడ్డిలో 15 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా సంగారెడ్డి, నిర్మల్, కుమురం భీమ్, వికారాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలు సహా పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.