ట్విటర్ పై టర్కీ కొరడా
టర్కీ ట్విటర్ పై కొరడా ఝళిపించింది. మంగళవారం నుంచి అమలులోకి వచ్చిన కొత్త చట్టం ప్రకారం ట్విటర్ దాని అనుబంధ సంస్థలు పెరిస్కోప్, పిన్‌టారెస్ట్ లలో ప్రకటనల నిషేధాన్ని విధించింది. టర్కీలో స్థానిక ప్రతినిధులను నియమించడంలో విఫలమైన ట్విటర్ పై ఈ మేరకు టర్కీ చర్యలు తీసుకుంది. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ అథారిటీ చట్టం ప్రకారం తమ స్థానిక ప్రతినిధులను నియమించని సోషల్ మీడియా కంపెనీలపై జరిమానాలను సైతం ప్రభుత్వం విధిస్తోంది. ఈ కొత్త చట్టం ప్రకారం తమ దేశ నిబంధనలకు అనుగుణంగా లేని కంటెంట్‌ను ఆయా సోషల్ మీడియా స్థానిక ప్రతినిధులు తొలగించాలి. ముఖ్యంగా విషపు ప్రచారంగా ప్రభుత్వం పేర్కొన్న ట్వీట్లు అన్నింటినీ ఈ ప్రతినిధులు తీసివేయాలి. ఫేస్బుక్ కొత్త నిబంధనలు అమలు పరుస్తున్నప్పటికీ ట్విటర్ మాత్రం తాత్సారం చేస్తుండడంతో టర్కీ ప్రభుత్వానికి చిరెత్తుకొచ్చింది. ఈ నేపథ్యంలో ట్విటర్‌పై ప్రకటనల నిషేధం పడింది. ఈ చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఇప్పటికే ఫేస్బుక్, యూట్యూబ్ లు ప్రభుత్వానికి భారీ జరిమానాలు చెల్లించుకున్నాయి. టర్కీలో యథేచ్ఛగా చట్ట ఉల్లంఘనలు జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని ఈ సందర్భంగా టర్కీ ఉప రవాణా మంత్రి ఒమర్ ఫాతిహ్ సయాన్ వ్యాఖ్యానించారు.