Monday, November 9, 2020

Trailblazers lifted JioT-20 womens Trophy for the first time

ట్రయల్ బ్లేజర్స్ దే టీ20 కప్

స్మృతి మంధాన విజృంభణతో ట్రయల్ బ్లేజర్స్ తొలిసారి మహిళల టీ20 కప్ ను సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన  జియో 2020 టీ20 చాలెంజర్ కప్ ఫైనల్స్ లో  సూపర్ నోవాస్ పై 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్మృతి బ్యాటర్ గానే కాక కెప్టెన్ గానూ రాణించి మ్యాచ్ ను తన జట్టుకు తొలిసారి ట్రోఫీని సాధించిపెట్టింది. గతంలో ఈ ట్రోఫీని సూపర్ నోవాస్ రెండుసార్లు గెలిచి హ్యాట్రిక్ పై కన్నేసినా ట్రయల్ బ్లేజర్స్ అన్నిరంగాల్లో రాణించి కైవసం చేసుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ట్రయల్ బ్లేజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 119 పరుగులు చేసింది. స్మృతి 49 బంతుల్లో 3 సిక్సర్లు 5 ఫోర్లతో 68 పరుగులు స్కోరు చేసింది. ప్రత్యర్థి జట్టులో రాధా యాదవ్ 4 ఓవర్లలో 16 పరుగులిచ్చి 5 వికెట్లు ఖాతాలో వేసుకుంది. టీ20 మహిళా టోర్నీల్లో ఓ మ్యాచ్ లో 5 వికెట్లు సాధించిన తొలి క్రికెటర్ గా రికార్డు సృష్టించింది. అనంతరం 120 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన సూపర్ నోవాస్ 7 వికెట్లు కోల్సోయి 102 పరుగులే చేయగల్గింది. సల్మా కాతున్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టగా పొదుపుగా పరుగులిచ్చి దీప్తి శర్మ 2 వికెట్లు తీసింది. ఈ ఫైనల్స్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన స్మృతి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు మొత్తం మూడు అవార్డుల్ని సాధించడం విశేషం.

Sunday, November 8, 2020

CM Jagan condolences to YSRCP Kakinada city president Frooti Kumar`s Death

వైఎస్సార్సీపీ తూ.గో. నేత మృతి: సీఎం సంతాపం

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఫ్రూటీ కుమార్ కరోనాతో ఆదివారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన చురుగ్గా పనిచేస్తున్నారు. కరోనా సోకడంతో గత కొంతకాలంగా విశాఖపట్నంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈరోజు తుది శ్వాస విడిచారు. ఇటీవల సీఎం జగన్.. ఫ్రూటీకుమార్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆయన సతీమణి చంద్రకళా దీప్తికి ఫోన్‌ చేసి ఆరా తీశారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ కూడా సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన అకాల మరణం బాధిస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుమార్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తరుణంలో ఇలా జరగడం పట్ల విచారం వెలిబుచ్చారు.

Friday, November 6, 2020

TV9 has bagged a record 17 NT awards

టీవీ9 కు ఎన్టీ అవార్డుల పంట

టీవీ9 తెలుగు రికార్డు స్థాయిలో న్యూస్ టెలివిజన్ అవార్డులు సాధించింది. వివిధ విభాగాల్లో మొత్తం 17 అవార్డులు సొంతం చేసుకుని కాలరేగరేసింది. బెస్ట్ న్యూస్ డిబేట్ షో అవార్డును `బిగ్ న్యూస్ బిగ్ డిబేట్` దక్కించుకోగా బెస్ట్ ప్రైమ్టీవీ న్యూస్ యాంకర్ అవార్డును మురళీకృష్ణ కైవసం చేసుకున్నారు. బెస్ట్ టీవీ న్యూస్ ప్రెజెంటర్ అవార్డు పూర్ణిమకు లభించింది. బెస్ట్ డైలీ న్యూస్ బులిటెన్ అవార్డు `టాప్ న్యూస్ 9` ఖాతాలో వేసుకుంది. అదేమాదిరిగా బెస్ట్ టీవీ న్యూస్ రిపోర్టర్ గా అశోక్ వేములపల్లి, బెస్ట్ యంగ్ టీవీ జర్నలిస్ట్ గా స్వప్నిక అవార్డులు గెలుచుకున్నారు. బెస్ట్ ప్రైమ్ టైమ్ న్యూస్ షో అవార్డును `అనగనగా ఒక ఊరు` దక్కించుకుంది. అలాగే టీవీ9 తెలుగు బెస్ట్ న్యూస్ చానల్ వెబ్సైట్ అవార్డు tv9telugu.com ను వరించింది.

Tuesday, November 3, 2020

3 Killed in Vienna `Terror Attack` At 6 Locations

వియన్నాలో ఉగ్రపంజా

          · ముంబయి దాడి తరహాలో ఘటన

ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉగ్రవాదులు పంజా విసిరారు. దేశంలో మంగళవారం నుంచి రెండో విడత కరోనా లాక్ డౌన్ విధించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా సోమవారం అర్ధరాత్రి వరకు హోటళ్లు, మార్కెట్, మాల్స్ లో ఆనందంగా గడిపారు. ఇదే అదునుగా వియన్నా లోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. మొత్తం ఆరు ప్రాంతాల్లో ముష్కరులు ఇష్టానుసారం కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ముగ్గురు దుర్మరణం చెందగా మరో 15 మంది తీవ్రగాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సెంట్రల్ వియన్నా అంతటా సోమవారం రాత్రి వేర్వేరు ప్రాంతాల్లో జట్లుగా విడిపోయిన ఉగ్రవాదులు పెద్దఎత్తున కాల్పులకు దిగారు.  ఈ దుశ్చర్యను ఛాన్సలర్ సెబాస్టియన్ కుర్జ్ `పాశవిక ఉగ్రవాద దాడి`గా పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిలో ఓ వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా బంధించినట్లు తెలుస్తోంది. అయితే ప్రజలంతా నగరం మధ్యలోనే సురక్షితంగా ఉండాలని సరిహద్దు తనిఖీలను ముమ్మరం చేశామని దేశ అంతర్గత వ్యవహారాలశాఖ (హోం) మంత్రి కార్ల్ నెహమ్మర్ తెలిపారు. పిల్లలు మంగళవారం పాఠశాలకు హాజరు కానవసరం లేదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. భారత్ లో పన్నేండేళ్ల క్రితం (2008 నవంబర్ 26-29 తేదీల్లో) పాక్ నుంచి దేశంలోకి చొరబడిన లష్కర్ ఎ తోయిబాకు చెందిన ముష్కరులు 166 మందిని బలిగొన్న సంగతి తెలిసిందే. నాడు ఈ ఉగ్రదాడిలో మొత్తం 10 మంది పాల్గొన్నారు.