ప్రణబ్‌దా అస్తమయం
భారతరత్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలోని ఆర్మీ ఆర్ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆగస్టు ప్రారంభంలో ప్రణబ్ కి డాక్టర్లు కీలకమైన శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత కరోనా కూడా నిర్ధారణ కావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. అవయవాలేవీ పనిచేయకపోవడంతో కోమాలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ప్రణబ్ ముఖర్జీకి చికిత్స అందిస్తున్నా ఫలితం లేకుండాపోయింది. ఆయన మరణంతో దేశం గొప్ప రాజనీతిజ్ఞుడ్ని కోల్పోయిందని పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీతో పాలు పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతిగా, కేంద్ర మంత్రిగా ఆయన అందించిన సేవలను స్మరించుకొనేందుకు దేశ వ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాపం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే రాష్ట్రపతి భవన్‌తో సహా అన్ని కార్యాలయాలపై జాతీయజెండా అవనతం చేయాలని కేంద్రం ప్రకటించింది. అధికారిక లాంఛనాలతో ప్రణబ్ అంత్యక్రియలు మంగళవారం నిర్వహించేందుకు రక్షణ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. సైనిక వందనంతో తుది వీడ్కోలు పలకనున్నారు. దాదాలేని ఢిల్లీని ఊహించలేమని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు.