`కరోనా` బామ్మ@113కు జేజేలు!!
కరోనా.. నువ్వు నన్ను ఏం చేయలేకపోయావు.. హాహా..హా.. అని
చిరునవ్వులు చిందిస్తోంది..ఓ శతాధిక వృద్ధురాలు.. కరోనా అనేంటి..ఆ బామ్మను నాటి
స్పానిష్ ఫ్లూ వైరస్ సైతం టచ్ చేయలేకపోయింది. ఇంతకీ ఆ బామ్మ ఎవరనుకుంటున్నారు..
స్పెయిన్ కు చెందిన 113 ఏళ్ల మరియా బ్రన్యాస్. వాస్తవానికి
ఆమె అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన వారు. అక్కడ నుంచి స్పెయిన్ లోని
కటోలినియాకు వలసవచ్చారు. 20 ఏళ్లగా సదరు బామ్మ అక్కడే
వృద్ధాశ్రమంలో కాలం వెళ్లదీస్తోంది. ఇటీవల కరోనా మహమ్మారి స్పెయిన్ ను అతలాకుతలం
చేసింది. గడిచిన ఏప్రిల్ లో మరియా ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడినా విజయంతంగా
ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొంది మృత్యుంజయురాలిగా మనముందుకి వచ్చారు. డిసెంబర్ 2019లో చైనాలోని వూహాన్ లో పురుడుపోసుకున్న కరోనా ఆ తర్వాత ప్రపంచం నలుమూలలా
విస్తరించి తడాఖా చూపిస్తోంది. యూరప్, అమెరికా దేశాల్లో
విజృంభించి వేలాది ప్రాణాల్ని బలితీసుకుంది. ఇటలీలోని సీనియర్ సిటిజన్లలో 80 శాతం మంది మహమ్మారికి నేలకూలారు. స్పెయిన్లో వైరస్ కారణంగా దాదాపు 27వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశానికే చెందిన అనా దెల్ వాల్లె అనే 106 ఏళ్ల మహిళ కరోనా నుంచి కోలుకున్న అతిపెద్ద వయస్కురాలిగా ఇటీవల గుర్తింపు పొందారు. అయితే తాజాగా ఈ రికార్డును మరియా చెరిపేశారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 1918-19లో విజృంభించిన స్పానిష్ ఫ్లూ నుంచి సైతం మరియా కోలుకోవడం విశేషం. రెండు
ప్రపంచ యుద్ధాలు సహా 1936-39 మధ్య జరిగిన స్పానిష్
అంతర్యుద్ధాన్నీ ఆమె చూశారు. గతేడాది డిసెంబరులో స్పెయిన్కు చెందిన వృద్ధాప్య
పరిశోధన సంస్థ చేపట్టిన సర్వే ద్వారా మరియా దేశంలో అతి పెద్ద వయస్కురాలిగా గుర్తింపు
పొందారు. తనలాంటి వయోవృద్ధుల్ని తమ ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన వైద్య
సిబ్బందికి ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.