వలస కూలీల ఉసురు తీసిన రైలుబండి
పొట్టచేతపట్టుకుని సుదూర ప్రాంతాలకు వలసవచ్చిన అభాగ్యులు వాళ్లు.. స్వస్థలాలకు
తిరుగుపయనమవుతూ కానరాని లోకాలకు తరలిపోయారు. ఈ విషాద దుర్ఘటన మహారాష్ట్రలోని ఔరంగబాద్
సమీపంలో చోటు చేసుకుంది. ఔరంగాబాద్-జల్నా రైల్వే లైన్‌లో ట్రాక్ పై నిద్రిస్తున్న
16 మంది జీవితాల్ని గూడ్సు బండి చిదిమేసింది. దుర్ఘటనలో మరో అయిదుగురు పరిస్థితి అత్యంత
విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రప్రభుత్వం చొరవతో ఏర్పాటయిన శ్రామిక్ రైలులో స్వరాష్ట్రానికి
చేరుకోవాలని కొండంత ఆశతో వలస కూలీలు గురువారం బయలుదేరారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్
మే 17 వరకు పొడిగించిన దరిమిలా రైల్వే శాఖ శ్రామిక్ రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే.
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కూలీలు ఈ రైలు ఎక్కేందుకు జల్నా నుంచి భుసావాల్ కు బయలుదేరారు.
వారంతా శుక్రవారం అక్కడ నుంచి శ్రామిక్ రైలులో స్వస్థలాలకు చేరుకోవాల్సి ఉంది. అప్పటికే
35 కి.మీ. నడక సాగించిన వాళ్లు రాత్రి కావడంతో ఓ ఫ్లై ఓవర్ సమీపంలోని రైల్వే ట్రాక్
పై నిద్రకు ఉపక్రమించారు. అలసట కారణంగా కూలీలంతా గాఢ నిద్రావస్థలో ఉన్నారు. ట్రాక్
పై మనుషులున్న సంగతిని లోకో పైలట్ గుర్తించినా రైలు నిలుపుచేసే సమయం చిక్కలేదని తెలుస్తోంది.
దాంతో గూడ్సు వారిపై నుంచి దూసుకుపోగా కూలీల దేహాలు ఛిద్రమై ట్రాక్ కు ఇరువైపులా పడిపోయాయి.
కొనఊపిరితో ఉన్న అయిదుగుర్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న
పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుల్ని ఆసుపత్రికి
తరలించారు. ట్రాక్ సమీపంలో కూర్చున్న మరో ముగ్గురు మాత్రం ఈ ఘోరం నుంచి సురక్షితంగా
బయటపడినట్లు సమాచారం. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ ఘోర ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి
వ్యక్తం చేశారు.