విజయమ్మ చొరవతో పురోహితులకు నిత్యావసరాల పంపిణీ
వై.ఎస్.ఆర్.సి.పి. గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ చొరవ
తీసుకోవడంతో విజయవాడ కర్మాన్ ఘాట్ లో పురోహితులకు నిత్యావసర సరకుల పంపిణీ చేశారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో గల పిండ ప్రదానాలు నిర్వహించే కర్మాన్ ఘాట్ పురోహితుల ఆకలిదప్పులపై ప్రభుత్వం స్పందించింది. శనివారం దేవాదాయశాఖ మంత్రి
వెల్లంపల్లి శ్రీనివాస్ ఒక్కొక్కరికి రూ.2 వేల
విలువ చేసే నిత్యావసరాల కిట్లను అందజేశారు. టీవీ9లో ప్రసారమైన
వార్తా కథనానికి స్పందించిన విజయమ్మ మంత్రి శ్రీనివాస్ కి ఫోన్ చేసి వారికి సత్వర
సాయం అందించాలని కోరారు. దాంతో రంగంలోకి దిగిన ప్రభుత్వ యంత్రాంగం నెలరోజులకు
సరిపడా బియ్యం, కంది, మినపగుళ్లు తదితర
నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేసింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 20 కిలోల చొప్పున నాణ్యమైన బియ్యంతో పాటు అవసరమైన ఆహార దినుసుల్ని వారికి
అందించామన్నారు. ఇప్పటికే తమ పశ్చిమ నియోజకవర్గంలో లక్షా4వేల
మందికి బియ్యం పంపిణీ పూర్తి చేసినట్లు వివరించారు. ఈరోజు కర్మాన్ ఘాట్ సమీపంలో గల
కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద పురోహితులు సామాజిక దూరాన్ని పాటిస్తూ కిట్లను
అందుకున్నారన్నారు.