జగన్ దేశంలోనే గొప్ప సీఎం:బొత్స
దేశంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్
మోహన్ రెడ్డే గొప్ప ప్రజానాయకుడని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స
సత్యనారాయణ పేర్కొన్నారు. బహుశా అందుకే మంగళవారం ఢిల్లీలో ట్రంప్ విందు సమావేశానికి ఆయనను
కేంద్రప్రభుత్వం ఆహ్వానించకపోయి ఉండొచ్చన్నారు. విశాఖలో బుధవారం ఆయన మీడియా
సమావేశంలో మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతుల గౌరవార్థం రాష్ట్రపతి
రామ్ నాథ్ కోవింద్ ఇచ్చిన విందుకు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు, హర్యానా ముఖ్యమంత్రి
మనోహర్ ఖట్టర్, కర్ణాటక సీఎం యడ్యూరప్ప, అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ హాజరైన సంగతి తెలిసిందే.
ఈ విషయంపై ప్రతిపక్ష తెలుగుదేశం నాయకులు చేసిన విమర్శల్ని బొత్స తిప్పికొట్టారు.
తొలిసారి ముఖ్యమంత్రి అయినందునే జగన్ ను పిలవలేదనడం కూడా సరైనది కాదన్నారు.
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ల్ని
ఆహ్వానించని విషయాన్ని గమనించాలని కోరారు. జగన్పై కేసులున్నందుకే ఆహ్వానం
అందలేదని టీడీపీ నేతలు వ్యంగ్యోక్తులు విసరడంపై బొత్స తనదైన శైలిలో దుమ్మెత్తిపోశారు. సమావేశంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పైనా ఆయన విరుచుకుపడ్డారు.