మార్షల్స్ సైనిక
యూనిఫాంపై సమీక్ష: ఉపరాష్ట్రపతి
రాజ్యసభలో కొత్తగా అమలులోకి వచ్చిన మార్షల్స్ యూనిఫాంపై పున:సమీక్షకు చైర్మన్,
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదేశించారు. సైనిక దుస్తుల తరహాలో మార్షల్స్ యూనిఫాం
ఉండడంపై కొందరు సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేయడాన్ని పరిగణనలోకి తీసుకున్న సభాపతి
ఈ మేరకు రాజ్యసభ సెక్రటేరియట్ కు మంగళవారం ఆదేశాలు ఇచ్చారు. రాజ్యసభ సచివాలయం
వివిధ సలహాలు పరిశీలించాక మార్షల్స్ కు కొత్త యూనిఫాం అమలు చేసింది. అయితే సైనికయేతర
సిబ్బంది సైనిక యూనిఫాంను కాపీ చేయడం, ధరించడం చట్టవిరుద్ధం, భద్రతాపరమైన ప్రమాదమంటూ వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మార్షల్స్ సైనిక దుస్తులు,
టోపీ, తలపాగాలను ధరించడంపై మాజీ ఆర్మీ
చీఫ్ జనరల్ వి.పి.మాలిక్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆయన
ఈ విషయంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జోక్యం
కోరుతూ ట్వీట్ చేశారు. ఆయనకు పలువురు రిటైర్డ్ డిఫెన్స్ అధికారులు మద్దతు ఇచ్చారు.
ఈ నేపథ్యంలో వెంకయ్య ఈ విషయమై రాజ్యసభ సచివాలయం పున:సమీక్షిస్తుందని సభకు
తెలిపారు.