షెహ్లా
అరెస్ట్ కు 10 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి
దేశద్రోహం కేసును ఎదుర్కొంటున్న కశ్మీర్ పీపుల్స్ మూవ్ మెంట్ నాయకురాలు షెహ్లా
రషీద్ కు ఢిల్లీ కోర్టు బాసటగా నిలిచింది. ముందస్తు బెయిల్ కోసం ఆమె దాఖలు చేసిన
పిటిషన్ ను తోసిపుచ్చిన కోర్టు ఈ మేరకు శుక్రవారం ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ
చేసింది. కేసు ప్రాథమిక దర్యాప్తు దశలోనే ఉందని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (ఐ.ఒ)
కోర్టుకు తెలియజేయడంతో ఈ తీర్పు వెల్లడించింది. ఒకవేళ అరెస్ట్ చేయాల్సి వస్తే మాత్రం
ఆమెకు 10 రోజుల ముందే విషయాన్ని తెలపాలని పోలీసులకు కోర్టు ఆదేశాలిచ్చింది. ఆగస్ట్
17న ఆమె ఉద్దేశపూర్వకంగానే దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు
పెట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. జమ్ముకశ్మీర్ ప్రజల్లో విద్వేషభావాల్ని
రెచ్చగొట్టేలా షెహ్లా పోస్టులు చేశారని పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు. ముఖ్యంగా
భారత సైన్యం అక్కడ విచారణల పేరిట యువతను అర్ధరాత్రిళ్లు తరలించుకు వెళ్లి ఇబ్బందుల
పాల్జేస్తున్నారంటూ ఆమె ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
వివిధ సోషల్ మీడియా గ్రూపుల్లో షెహ్లా వరుస పోస్టులు పెడుతూ అల్లర్లు
ప్రేరేపించేందుకు యత్నించినట్లు కేసు పెట్టారు. ఇదిలావుండగా అరెస్ట్ ను
తప్పించుకోవడానికి ఆమె యాంటిసిపేటరీ బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. పోలీసు
విచారణకు తమ క్లయింట్ హాజరవుతారని షెహ్లా న్యాయవాదులు తెలిపినా అడిషినల్ సెషన్స్
జడ్జి సతీష్ కుమార్ అరోరా ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు.