సర్దార్ పటేల్ పాదాల చెంత 370 రద్దు నిర్ణయం: మోదీ
మహానేత సర్దార్ వల్లభ్ భాయ్
పటేల్ 114వ జయంతిని పురస్కరించుకుని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఘనంగా నివాళులర్పించారు. గురువారం పటేల్ చౌక్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతితో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి హర్దీప్ పురి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ లు దివంగత నేత పటేల్ సేవల్ని శ్లాఘించి పుష్పాంజలి ఘటించారు. స్వాతంత్ర్యానికి పూర్వం వేర్వేరుగా
ఉన్న వందలాది సంస్థానాల్ని దేశంలో విలీనం చేసి అఖండ భారత సంస్థాపనకు పటేల్ సాగించిన
కృషిని నేతలు గుర్తు చేసుకున్నారు. కేంద్రంలో బీజేపీ పగ్గాలు చేపట్టాక 2014 నుంచి సర్దార్
పటేల్ జయంతిని ఏక్తా దివస్ (ఐక్యత, సమగ్రత దినోత్సవం) గా పాటిస్తున్నసంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు నిర్ణయాన్ని పటేల్ కు అంకితమిస్తున్నట్లు
ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆ మహానేత పాదాల చెంత ఈ నిర్ణయాన్ని ఉంచుతున్నానంటూ
మోదీ పుష్పాంజలి ఘటించారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ (కెవాడియా-గుజరాత్) వద్ద ఏర్పాటైన కార్యక్రమంలో
ప్రధాని ప్రసంగిస్తూ శతాబ్దాలకు పూర్వం దేశాన్ని చాణక్యుడు ఏకతాటిపై నిలిపారని మళ్లీ
ఆ ఘనతను సర్దార్ పటేల్ సొంతం చేసుకున్నారన్నారు.