Friday, October 18, 2019

CJI Gogoi recommends Justice S A Bobde as his successor


సీజేఐగా బోబ్డే పేరును సిఫార్సు చేసిన గొగొయ్
భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా సీనియర్ జస్టిస్ శరద్ అర్వింద్ బోబ్డే పేరును ప్రస్తుత సీజేఐ రంజన్ గొగొయ్ ప్రతిపాదించారు. ఈ మేరకు బోబ్డే పేరును సిఫార్సు చేస్తూ ఆయన కేంద్రానికి శుక్రవారం లేఖ రాశారు. సంప్రదాయాన్ని అనుసరించి గొగొయ్ తన వారసుడిగా బోబ్డే ను ప్రతిపాదిస్తూ కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో పేర్కొన్నారు.  కేంద్రం ఈ సిఫార్సును పరిగణనలోకి తీసుకుంటే మహారాష్ట్రకు చెందిన 64 ఏళ్ల బోబ్డే భారత 47వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవుతారు. సుప్రీం జస్టిస్ గా 12 ఏప్రిల్ 2013 నుంచి వ్యవహరిస్తున్న బోబ్డే పదవీ కాలం 23 ఏప్రిల్ 2021 వరకు ఉంది. ఆయన గతంలో మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ (ముంబయి, నాగ్ పూర్)లో చాన్స్ లర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం గొగొయ్ తర్వాత సుప్రీంకోర్టులో బోబ్డేనే అందరికంటే సీనియర్. గొగొయ్ 46వ సీజేఐగా 8 అక్టోబర్ 2018న బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలం వచ్చే నెల 17 నవంబర్ లో ముగియనుంది.

Sunday, October 13, 2019

India, Japan to hold joint military exercise from Oct 19


19 నుంచి భారత్ జపాన్ సంయుక్త సైనిక విన్యాసాలు
ఉగ్రవాద నిరోధక సైనిక విన్యాసాల్లో భారత జపాన్ లు సంయుక్తంగా పాల్గొననున్నాయి. ఈనెల 19 నుంచి నవంబర్ 2 వరకు ఉభయదేశాలకు చెందిన సైనికులు ఈ విన్యాసాల్లో పాలుపంచుకోనున్నారు. ధర్మ-గార్డియన్ (ధర్మ సంరక్షణ) పేరిట ఈ సైనిక విన్యాసాల్ని మిజోరంలోని వైరెంగ్టేలో నిర్వహించనున్నారు. ఈ విన్యాసాల్లో భారత్, జపాన్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (జేజీఎస్డీఎఫ్) లకు చెందిన 25 మంది చొప్పున సైనికులు పాల్గొనబోతున్నారు.  ఆయా దేశాలలో వివిధ తీవ్రవాద నిరోధక కార్యకలాపాలకు సంబంధించిన అనుభవాన్ని ఉభయ దేశాల సైనికులు ఈ సందర్భంగా పంచుకోనున్నారు. ప్రపంచ ఉగ్రవాదం నేపథ్యంలో ఇరు దేశాలు భద్రతా సవాళ్ల ను అధిగమించేందుకు ఏర్పాటవుతున్న ఈ విన్యాసాలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. అదే సమయంలో భారత జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్ఠం కానున్నాయి. అటవీ ప్రాంతంతో పాటు పట్టణాల్లో తలెత్తుతోన్న ఉగ్రవాదం.. నిరోధక చర్యలపై ప్లాటూన్ స్థాయి లో సైనికులు ఉమ్మడి శిక్షణ పొందనున్నారు. వివిధ దేశాలతో భారతదేశం చేపట్టిన సైనిక విన్యాసాల శిక్షణ క్రమంలో తాజా కార్యక్రమం  కీలకమైనదని అధికారిక ప్రకటన పేర్కొంది.

Saturday, October 5, 2019

Durga pooja revellers use umberellas as rain plays spoilsport on the day of maha saptami in kolkatta


గొడుగులతో దుర్గామాత వేడుకల్లో పాల్గొన కోల్ కతా వాసులు
పశ్చిమబెంగాల్ లో శనివారం మహాసప్తమి వేడుకల్ని భక్తులు సంబరంగా జరుపుకున్నారు. ఓ వైపు వర్షం కురుస్తున్నా కోలకతాలో భక్తులు పెద్ద సంఖ్యలో గొడుగులు వేసుకుని మరీ వేడుకల్లో పాల్గొన్నారు. రుతుపవనాలు ఇంకా తిరోగమనం ప్రారంభించకపోవడంతో, పశ్చిమ బెంగాల్‌లో దుర్గా పూజా ఉత్సవాలపై ఉరుములతో కూడిన వర్షాలు ప్రభావితం చూపుతున్నాయి. ఈ వర్షాలు దశమి రోజున కూడా కురవొచ్చని వాతావరణ శాఖ శనివారం పేర్కొంది. ఈశాన్య జార్ఖండ్ మీదుగా ఒక తుపాను, జార్ఖండ్, ఉత్తర ఒడిశా ప్రాంతాలలో మరో తుపాను విరుచుకు పడొచ్చని తెలిపింది. దీనివల్ల  పశ్చిమ బెంగాల్‌లో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ వర్గాలు ప్రకటించాయి. ఇంకా నాలుగ్రోజుల పాటు జరుగనున్న దుర్గా మాత పూజలపై వర్షాల ప్రభావం పడొచ్చని భావిస్తున్నారు. అయితే ఈ రోజు మహాసప్తమి  సందర్భంగా ఓ వైపు జోరుగా వాన కురుస్తున్నా భక్తులు యథావిధిగా పూజలకు హాజరుకావడం విశేషం.

Friday, October 4, 2019

Shooting down chopper on Feb 27 was 'big mistake', action against officers: IAF chief


ఐఏఎఫ్ సొంత హెలికాప్టర్ నే కూల్చేయడం పెద్ద తప్పు: భదౌరియా
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లోని బాలాకోట్ లో ఉగ్రతండాలపై మెరుపుదాడులు జరిపిన మరుసటి రోజున సొంత హెలికాప్టర్ నే క్షిపణితో కూల్చేసి ఐఏఎఫ్ గ్రౌండ్ సిబ్బంది చాలా పెద్ద తప్పు చేశారని ఎయిర్ చీఫ్ మార్షల్ భదౌరియా అన్నారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టాక శుక్రవారం తొలిసారిగా విలేకర్లతో మాట్లాడారు.  జమ్ముకశ్మీర్ నౌషెరా సెక్టార్ లోని బుద్గామ్‌లో ఫిబ్రవరి 27న చోటు చేసుకున్న ఈ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోనున్నామన్నారు. భారత-పాకిస్థాన్ ల గగనతలంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో ఐఏఎఫ్ మిగ్-17 ప్రయాణిస్తోంది. హెలికాప్టర్‌లోని ఐఎఫ్ఎఫ్ ('ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫ్రెండ్ లేదా శత్రువు'వ్యవస్థ స్విచ్ ఆఫ్ చేసి ఉండడం,  గ్రౌండ్ సిబ్బంది, ఛాపర్ సిబ్బంది మధ్య కమ్యూనికేషన్ లోపం కారణంగా శత్రు విమానంగా భావించి క్షిపణితో సొంత చాపర్ నే కూల్చేశారు. ఈ ఘటనలో ఆరుగురు వాయుసేన సిబ్బందితో పాటు ఓ పౌరుడు దుర్మరణం చెందారు. ఆరోజు ఉదయం 10 గంటలకు ఐఏఎఫ్ చాపర్ శ్రీనగర్ కు 100 కిలోమీటర్ల దూరంలోని గగనతలంలో ఉండగా అధికారులు తిరిగి రావాల్సిందిగా ఆదేశాలిచ్చారు. తిరిగి వస్తున్న చాపర్ ను గ్రౌండ్ సిబ్బంది శత్రు విమానంగా భావించి క్షిపణి దాడి చేశారు. ఇందుకు బాధ్యులైన నలుగురు అధికారులపై ఇప్పటికే పరిపాలనా చర్యలు తీసుకున్నారు. ఇద్దరు సీనియర్ అధికారులపై కోర్టు మార్షల్ ప్రొసీజర్స్ క్రమశిక్షణ చర్యలు ప్రారంభిస్తున్నట్లు భదౌరియా తెలిపారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు మే ప్రారంభంలో, శ్రీనగర్ బేస్  ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ (ఏఓసీ) ను వాయుసేన బదిలీ చేసింది. ఇలాంటి ఘటన పునరావృతం కారదని చీఫ్ మార్షల్ భదౌరియా ఈ సందర్భంగా హెచ్చరించారు.